మామిడి... మ్యాంగో... ఆమ్... ఈ మూడూ దొరికే సీజన్ ఇది. మూడూ ఒకటే కదా అనుకుంటున్నారా? వంటను బట్టి... కోతను బట్టి... చేర్చే తీపిని బట్టి... కలిపే కారాన్ని బట్టి ఒక్కొక్కటి ఒక్కో రుచి. ఎండలకి విసుగ్గా ఉన్నప్పుడు వీటిని ట్రై చేయండి. రొటీన్‌ని మ్యాం‘గో’ అనండి.
మ్యాంగోకుల్ఫీ
కావలసినవి: మామిడి పండు ముక్కలు – ముప్పావు కప్పు; చల్లటి చిక్కటి పాలు – అర కప్పు (ఫుల్ క్రీమ్ మిల్క్); ఏలకుల పొడి – పావు టీ స్పూను; ఫుల్ ఫ్యాట్ క్రీమ్/ మీగడ – అర కప్పు; కండెన్స్‌డ్ మిల్క్ – అర కప్పు; కుంకుమ పువ్వు నీళ్లు – 3 టేబుల్ స్పూన్లు; పిస్తా తరుగు – ఒక టీ స్పూను; కుంకుమ పువ్వు – చిటికెడు.
తయారీ:
►మిక్సీలో మామిడి పండు ముక్కలు వేసి మెత్తగా అయ్యేలా మిక్సీ పట్టాలి
►చల్లటి పాలు జత చేసి మరోమారు తిప్పాలి
►చిక్కటి క్రీమ్ జత చేసి మరోమారు తిప్పాలి
►అర కప్పు కండెన్స్‌డ్ మిల్క్ జత చేసి మరోమారు మిక్సీ తిప్పాలి
►ఏలకుల పొడి, కుంకుమ పువ్వు నీళ్లు జత చేసి మరోమారు తిప్పాలి
►కుల్ఫీ మౌల్డ్‌లోకి ఈ మిశ్రమం పోసి, పిస్తా తరుగు, కుంకుమ పువ్వులతో అలంకరించి మూత పెట్టేయాలి
►డీప్ ఫ్రీజ్‌లో సుమారు ఎనిమిది గంటలపాటు ఉంచి బయటకు తీసి చల్లగా అందించాలి.
మ్యాంగో హల్వా
కావలసినవి: మామిడి పండు గుజ్జు – 2 కప్పులు; పంచదార – 2 టేబుల్ స్పూన్లు; నెయ్యి – అర కప్పు; బాదం పప్పులు – రెండు టేబుల్ స్పూన్లు; జీడి పప్పులు – రెండు టేబుల్ స్పూన్లు
తయారీ:
►ఒక పాత్రలో మామిడి పండు గుజ్జు, పంచదార వేసి కలపాలి
►స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి బాగా కరిగాక జీడిపప్పులు, బాదం పప్పులు వేసి వేయించి, తీసి పక్కన ఉంచాలి
►స్టౌ మీద మందపాటి పాత్ర ఉంచి, అందులో మామిడిపండు గుజ్జు, పంచదార మిశ్రమం వేసి కలియబెట్టాలి
►మంట బాగా తగ్గించి మామిడి పండు గుజ్జు హల్వాలా మారేవరకు ఉంచాలి
►నెయ్యి జత చేసి బాగా కలిపి దింపేయాలి
►ముందుగా వేయించిన బాదం పప్పులు, జీడి పప్పుల్ని పైన చల్లాలి
►తీయటి మామిడి హల్వా సిద్ధం.
మ్యాంగో ఐస్‌క్రీమ్
కావలసినవి: మామిడిపండు గుజ్జు – ఒక కప్పు; మామిడి పండ్ల ముక్కల తరుగు – ఒక కప్పు; కస్టర్డ్ పౌడర్ – ఒక టేబుల్ స్పూను; వెనిలా ఎసెన్స్ – ఒక టీ స్పూను; పాలు – ఒక కప్పు; క్రీమ్ – మూడు కప్పులు; పంచదార – ఒక కప్పు.
తయారీ:
►ఒక పాత్రలో కొద్దిగా పాలు, కస్టర్డ్ పౌడర్ వేసి కలిపి పక్కన ఉంచాలి
►మిగిలిన పాలను ఒక గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టాలి
►పంచదార జత చేసి కలపాలి
►పాలు వేడెక్కాక కస్టర్డ్‌పౌడర్ కలిపిన పాలను వేసి రెండు నిమిషాల పాటు మరిగించాలి
►స్టవ్ కట్టేసి ఆ మిశ్రమాన్ని చల్లార్చాలి
►అందులో మామిడి పండు గుజ్జు, మామిడి పండు ముక్కల తరుగు, క్రీమ్, వెనిలా వేసి బాగా గిలకొట్టి, ఆ మిశ్రమాన్ని డీప్ ఫ్రిజ్‌లో మూడు గంటలపాటు ఉంచి
►బయటకు తీస్తే యమ్మీ యమ్మీ మ్యాంగో ఐస్‌క్రీమ్ సిద్ధమైనట్లే.
మామిడి పండు శ్రీకరణ
కావలసినవి: మామిడి పండ్లు – 2; పాలు – ఒక గ్లాసు; పంచదార – 4 టీ స్పూన్లు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; జీడిపప్పు పొడి – ఒక టేబుల్ స్పూను; బాదం పప్పుల పొడి – ఒక టేబుల్ స్పూను.
తయారీ:
►బాగా పండిన మామిడి పండ్లను శుభ్రంగా కడిగి, తొక్క వేరు చేసి, గుజ్జును ఒక గిన్నెలోకి తీసుకోవాలి
►ముద్దలు ముద్దలుగా లేకుండా మెత్తగా అయ్యేలా ఒక స్పూనుతో బాగా మెదపాలి
►చక్కెర జత చేసి మరోమారు కలపాలి
►కాచి చల్లార్చిన పాలు ఒక గ్లాసుడు జతచేసి కలియబెట్టాలి
►జీడిపప్పుల పొడి, బాదం పప్పుల పొడి వేసి బాగా కలపాలి
►ఏలకుల పొడి జత చేసి మరోమారు బాగా కలిపి మూత పెట్టాలి
►ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో ఒక గంట ఉంచి బయటకు తీయాలి
►దీనిని చపాతీ, పూరీలలో నంచుకుని తింటే కూడా రుచిగా ఉంటుంది .
మామిడి పండు పులుసు
కావలసినవి: మామిడి పండు – 1 (దోరగా ఉండాలి); ఉల్లి తరుగు – ఒక కప్పు; తరిగిన పచ్చిమిర్చి – 4; టొమాటో తరుగు – ఒక కప్పు; బెల్లం – ఒక టేబుల్ స్పూను; చింతపండు రసం – అర కప్పు (కొద్దిగా చిక్కగా ఉండాలి); ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; మెంతులు – అర టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; కరివేపాకు – రెండు రెమ్మలు; కొత్తిమీర – రెండు టేబుల్ స్పూన్లు; నూనె – ఒక టేబుల్ స్పూను.
తయారీ:
►ముందుగా మామిడి పండును ముక్కలు చేసుకోవాలి
►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక (మూడు టేబుల్ స్పూన్లు) మెంతులు, జీలకర్ర, ఆవాలు ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి
►ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి
►పసుపు జత చేసి ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి
►టొమాటో తరుగు జత చేసి బాగా కలిపి తగినంత ఉప్పు వేసి కలిపి మూత ఉంచాలి
►రెండు నిమిషాల తరవాత మూత తీసి, ధనియా పొడి, మిరప కారం వేసి కలిపాక, కొద్దిగా బెల్లం పొడి వేసి బాగా కలపాలి
►చింతపండు రసం వేసి కలియబెట్టాలి
►మామిడి పండు ముక్కలు జత చేసి రెండు మూడు నిమిషాల పాటు కలిపి మూత పెట్టాలి
►కరివేపాకు, కొత్తిమీర వేసి కలిపి దింపేసి గిన్నె మీద మూత పెట్టాలి
►పదినిమిషాల తరవాత మూత తీసి అన్నంలో కలుపుకుంటే రుచిగా ఉంటుంది.
మామిడి పండు కూర
కావలసినవి: మామిడి పండ్లు – 4; తాజా కొబ్బరి తురుము – అర కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 2; తరిగిన ఉల్లిపాయలు – 3; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; మెంతులు – అర టీ స్పూను; ఆవాలు – అర టీ స్పూను; ఎండు మిర్చి – 1 (ముక్కలు చేయాలి); కరివేపాకు – రెండు రెమ్మలు; నీళ్లు – ఒక కప్పు; కొబ్బరి పాలు – 200 మి.లీ.; ఉప్పు – అర టీ స్పూను; కొబ్బరి నూనె – 2 టేబుల్ స్పూన్లు
తయారీ:
►మామిడి పండ్లను శుభ్రంగా కడిగి తొక్క వేరు చేయాలి
►మామిడి పండ్లను సన్నగా ముక్కలు చేయాలి
►మందపాటి పాత్రలో మామిడి పండు ముక్కలు, నీళ్లు, పసుపు, మిరప కారం, ఉప్పు వేసి స్టౌ మీద ఉంచి, మూత పెట్టి సన్నటి మంట మీద ఉడికించాలి
►పచ్చి కొబ్బరి తురుము, పచ్చి మిర్చి, ఉల్లి తరుగు మిక్సీలో వేసి మెత్తగా చేయాలి
►అర కప్పు నీళ్లు జత చేసి మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టాలి
►ఈ మిశ్రమాన్ని ఉడుకుతున్న మామిడి పండ్ల ముక్కలకు జత చేసి, బాగా కలిపి మంట బాగా తగ్గించాలి
►కొబ్బరి పాలు జత చేసి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి
►బాణలిలో కొబ్బరి నూనె వేసి స్టౌ మీద ఉంచి వేడి చేశాక, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండు మిర్చి,కరివేపాకు ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించి, ఉడుకుతున్న కూర మీద వేసి దింపేయాలి.
మామిడి తాండ్ర
కావలసినవి: మామిడి పండు ముక్కలు – రెండు కప్పులు; పంచదార – ఒక కప్పు; ఏలకుల పొడి – అర టీ స్పూను; నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు
తయారీ:
►మామిడి పండు ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా చేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి
►స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక మామిడి పండు గుజ్జు వేసి ఆపకుండా కలుపుతుండాలి
►ఏలకుల పొడి జత చేయాలి
►పంచదార వేసి బాగా కలపాలి
►మిశ్రమం బాగా చిక్కబడే వరకు కలుపుతుండాలి
►ఒక పెద్ద ప్లేట్‌కి నిండుగా నెయ్యి పూయాలి
►బాగా ఉడికిన మామిడి పండు గుజ్జును ప్లేటులో
►పోసి సమానంగా పరిచి పైన మూత ఉంచి సుమారు పది గంటల సేపు వదిలేయాలి
►ఆ తరవాత చాకుత్ కట్ చేసుకుంటే మామిడి తాండ్ర సిద్ధమైనట్లే.
మ్యాంగో మోర్ కుళంబు
కావలసినవి: మామిడి పండు – 1 (పెద్ద పెద్ద ముక్కలు చేయాలి); తాజా కొబ్బరి తురుము – పావు కప్పు; జీలకర్ర – ఒక టీ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – 1; ఎండు మిర్చి – 1; పెరుగు – ఒక కప్పు; ఆవాలు – ఒక టీ స్పూను; మెంతులు – 2 టీ స్పూన్లు; కరివేపాకు – రెండు రెమ్మలు; నూనె – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత.
తయారీ:
►స్టౌ మీద బాణలి వేడయ్యాక తగినన్ని నీళ్లు, మామిడి పండు ముక్కలు, ఉప్పు, పసుపు వేసి రెండు మూడు నిమిషాలు ఉడికించాలి
►మిక్సీలో కొబ్బరి తురుము, మెంతులు, పచ్చి మిర్చి, ఎండు మిర్చి వేసి, కొద్దిగా గోరు వెచ్చని నీళ్లు జతచేసి మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టాలి
►ఈ మిశ్రమాన్ని ఉడుకుతున్న మామిడి పండు ముక్కలకు జత చేయాలి
►పెరుగు జత చేసి మరోమారు కలియబెట్టాలి
►స్టౌ మీద చిన్న బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక పోపు సామాను వేసి వేయించి, సిద్ధమైన మ్యాంగో మోర్ కుళాంబులో వేసి కలపాలి.
Comments
Please login to add a commentAdd a comment