
నా వయసు 28 ఏళ్లు. మా పెళ్లయి ఎనిమిదేళ్లయ్యింది. మాకు సంతానం కలగడం లేదు. ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము. ఎన్నో టెస్ట్‌లు చేయించాము. మావారి కౌంట్‌లో సమస్య లేదు. హోమియోలో మంచి మందులు ఉన్నాయా?
మన సమాజంలో చాలామంది దంపతులు ‘సంతానలేమి’ సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనికి కేవలం శారీరకంగా వచ్చే వ్యాధులు, లోపాలు మాత్రమేగాక... మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, రాత్రివేళ ఉద్యోగాలు, మానసిక ఒత్తిడి వంటివి గణనీయమైన పాత్ర పోషిస్తున్నాయి. ఆరోగ్యవంతులైన దంపతులు ఎలాంటి గర్భనిరోధక పద్ధతులు పాటించకుండా ఏడాది పాటు దాంపత్య జీవనం సాగించినా పిల్లలు కలగకపోవడాన్ని ‘సంతానలేమి’గా చెప్పవచ్చు. సంతానలేమికి కారణాలు అటు మహిళల్లోను, ఇటు పురుషుల్లోను ఉండవచ్చు. ఒక్కోసారి ఇద్దరిలోనూ ఉండవచ్చు.
సంతానలేమికి కారణాలు
►మన జీవనశైలితో పాటు కాలుష్యం, వాతావరణం, పొగతాగడం, మద్యం, బిగుతైన దుస్తులు ధరించడం, అధిక బరువు, మానసిక ఒత్తిడి, కొన్ని రకాల మందులు.
►మహిళల వయసు 30 ఏళ్లు దాటాక సంతానం కలిగి అవకాశాలు తగ్గుతాయి.
►మహిళల్లో నెలసరి సమస్యలు, అండాల విడుదల సరిగా లేకపోవడం లేదా విడుదలైన అండాల నాణ్యత లోపించడం వంటివి కారణాలు.
►మహిళల్లోని ట్యూబల్‌బ్లాక్స్, ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఎండోమెట్రియాసిస్ వంటి సమస్యలు.
►పురుషుల్లో శుక్రకణాల సంఖ్య తగినంతగా లేకపోవడం, ఉన్నా – వాటిలో తగినంత చురుకుదనం లేకపోవడం లేదా వాటి ఆకృతి సరిగా లేకపోవడం వంటి లోపాలు.
►మరికొందరు పురుషుల్లో అసలు శుక్రకణాలే లేకపోవచ్చు.
మహిళల్లో చేయించాల్సిన పరీక్షలు
►థైరాయిడ్ ప్రొఫైల్ (టీ3, టీ4, టీఎస్‌హెచ్),
►పెల్విక్ స్కాన్
►ఫాలిక్యులార్ స్టడీ
► హార్మోనల్ పరీక్షలు (ఈస్ట్రోజెన్, ప్రోజెస్టరాన్, ఎఫ్‌ఎస్‌హెచ్, ఎల్‌హెచ్)
►హిస్టర్‌స్పాలింజియోగ్రామ్
►సీబీపీ, ఈఎస్‌ఆర్ వంటి పరీక్షలు చేయించాలి.
పురుషులకు చేయించాల్సిన పరీక్షలు
►వీర్యపరీక్ష
►హార్మోనల్ పరీక్షలు
►థైరాయిడ్ ప్రొఫైల్
►టెస్టిక్యులార్ బయాప్సీ
►సీబీపీ, ఈఎస్‌ఆర్
►అల్ట్రాసౌండ్ అబ్డామిన్ స్క్రోటమ్.
చికిత్స: సంతానలేమి సమస్యకు హోమియోలో చక్కటి వైద్యం అందుబాటులో ఉంది. ఈ సమస్యకు నిర్దిష్టంగా అసలు కారణం కనుగొనేందుకు అవసరమైన పరీక్షలు చేయించాలి. ఆ తర్వాత మహిళలు, పురుషుల్లో లోపాలను బట్టి పురుషుల్లోనైతే వీర్యకణాల వృద్ధి, వాటి నాణ్యత పెరిగేలా చూడటం వల్ల, అలాగే మహిళల్లో అండం నాణ్యతలను పెంచడం వంటి చికిత్సల ద్వారా ఫలదీకరణ జరిగే అవకాశాన్ని మెరుగుపరచవచ్చు. హోమియోలో మహిళలకు పల్సటిల్లా, సెపియా, కాల్కేరియా లాంటి మందులను వారి లక్షణాలను బట్టి వాడవచ్చు. అలాగే పురుషులకు లైకోపోడియం, బెరైటాకార్ట్, ఆసిడ్‌ఫాస్, నేట్రమ్‌మూర్‌లాంటి మందులను లక్షణాలను బట్టి వాడాల్సి ఉంటుంది. అయితే ఈ మందులను పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో వాడితేనే ప్రయోజనం ఉంటుంది. ఇలా హోమియో చికిత్స ద్వారా సంతానం కలగడానికి అవరోధంగా ఉన్న సమస్యలన్నీ తొలగిస్తే దాదాపు 50 – 60 శాతం వరకు సత్ఫలితాలను పొందవచ్చు.
డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో),
స్టార్ హోమియోపతి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment