
మార్కెట్‌లో కొనే కాయగూరలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని రోజుల్లో పాడవడం గ్యారెంటీ. గాల్లోని ఆక్సిజన్ ఒక కారణమైతే.. సూక్ష్మజీవులు రెండో కారణం. ఈ సమస్యను అధిగమించేందుకు కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న అపీల్ సైన్సెస్ అనే సంస్థ ఓ వినూత్నమైన ఆవిష్కరణ చేసింది. పండ్లు, కాయగూరల తొక్కల నుంచి సేకరించిన పదార్థాలతో తయారు చేసిన పూతతో కాయగూరలను ఎక్కువ కాలంపాటు తాజాగా ఉంచవచ్చునని నిరూపించింది. ఈ మ్యాజిక్ పూతతో కూడిన పండ్లు ఇప్పుడు కొన్ని అమెరికన్ సూపర్‌మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి కూడా.
ఈ పూత రంగు, రుచి, వాసన లేకుండా ఉంటుందని, కొన్ని రకాల కొవ్వులు, గ్లైకరో లిపిడ్స్‌లు కలిగి ఉంటుందని సంస్థ చెబుతోంది. కాయగూరలను ఒకసారి ఈ సేంద్రియ రసాయనంలో ముంచితీస్తే చాలని.. సాధారణంగా అవి నిల్వ ఉండే సమయం కంటే రెండు మూడు రెట్లు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయని కంపెనీ ప్రతినిధి వివరిస్తున్నారు. పండ్లు, కాయగూరల నుంచి తేమ బయటికి పోకుండా, బయటి నుంచి ఆక్సిజన్ అతితక్కువ మోతాదులో మాత్రమే తగిలేలా చేయడం ద్వారా ఈ రసాయనం వాటిని ఎక్కువ కాలం తాజాగా ఉంచుతుందని వివరిస్తున్నారు. ఆర్గానిక్ పదార్థాలతోనే తయారవుతోంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులూ ఉండవని తయారీదారులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment