
లండన్ : భార్యాభర్తల మధ్య కీచులాటలు సహజమే అయినా పలు అంశాలపై తరచూ వాదులాటల ఫలితంగా భార్యతో పోలిస్తే భర్తపైనే ఒత్తిడి అధికమని తాజా అథ్యయనం వెల్లడించింది. భార్యాభర్తల కలహాలు భర్తల ఆరోగ్యంపైనే అధికంగా ప్రభావం చూపుతున్నాయని తేలింది. భార్యాభర్తల గొడవల పలితంగా భర్తలు తరచూ తలనొప్పి, నిద్రలేమి వంటి అనారోగ్యాలకు గురవుతున్నారని అమెరికా పరిశోధకులు 16 ఏళ్ల పాటు నిర్వహించిన అథ్యయనం తెలిపింది.
పిల్లలు, కుటుంబ బాధ్యతలు, డబ్బు వంటి పలు అంశాలపై దంపతుల్లో చెలరేగే వాదోపవాదాలు పురుషుల్లోనే అధికంగా ఒత్తిడి హార్మోన్లను ప్రేరేపిస్తుండటంతో వారిని అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయని పరిశోధకులు పేర్కొన్నారు.భార్యాభర్తల సంబంధాల్లో సాన్నిహిత్యం, పరస్పర విశ్వాసం, భాగస్వామిని అర్థం చేసుకోవడం వంటివి కీలకమని అథ్యయన రచయిత, నెవాడా యూనివర్సిటీకి చెందిన రోజీ ష్రౌట్ చెబుతున్నారు.
నెవాడా, మిచిగాన్ యూనివర్సిటీ పరిశోధకులు 373 మంది జంటలను వారి వివాహమైన తొలి ఏడాదితో పాటు మూడవ, ఏడవ, పదహారో ఏడాదుల్లో వారి వైవాహిక బంధం, విభేదాలు, వాదులాటల గురించి కూపీ లాగారు. ఇక ఎలాంటి ఒడిదుడుకులూ, ఒత్తిళ్లూ, విభేదాలు లేకుండా సంసారం సాగించే దంపతుల ఆరోగ్యం స్కోర్ 5కు 4.07తో మెరుగ్గా ఉన్నట్టు వీరి పరిశోధనలో వెల్లడైంది.
ఇక క్షణక్షణం కీచులాడుకునే దంపతుల ఆరోగ్యం 3.86 స్కోర్‌తో సమస్యలతో సహజీవనం చేస్తోంది. అయితే ఈ జంటల్లో మహిళలతో పోలిస్తే పురుషులే అధికంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు వెల్లడైంది. వారి వైవాహిక జీవితంతో సంబంధం లేకుండా పురుషులపైనే వాదులాటల ఒత్తిడి అధికంగా ఉంటున్నట్టు తేలిందని పరిశోధకులు పేర్కొన్నారు.