ఒక వధువు, ఒక వరుడు ఏకమై దంపతులుగా జీవనం గడపాలంటే వాస్తవంగా కొన్ని వందల రూపాయలు మాత్రమే ఖర్చవుతాయి, అవసరం అవుతాయి. కానీ ఏళ్ల తరబడి కొనసాగుతున్న ‘సాంప్రదాయ ఖర్చులు’ పెళ్లీడుకు వచ్చిన యువతుల పాలిట ముళ్ల కంచెలు అవుతున్నాయి. వాళ్ల తల్లిదండ్రులకు మోయలేనంత భారంగా పరిణమిస్తున్నాయి. ఈ పరిస్థితి నుంచి ముస్లిం మైనారిటీ మహిళలకు, వాళ్ల తల్లిదండ్రులకు విముక్తి కల్పించేందుకు ఆవిర్భవించిన సంస్థే ‘అమన్’.ముస్లిం కుటుంబాలలో నికాహ్ సందర్భంగా.. కట్న కానుకలతో పాటు ఏర్పాటు చేసే విందు భోజనాల ఖర్చులు వధువు తల్లిదండ్రులకు తలకు మించిన భారం అవుతాయి. అమన్ సంస్థ ఈ విందు భోజనాలకు సంబంధించి ముస్లిం కుటుంబాలతో ఒక అవగాహన కల్పించాలని ప్రయత్నం చేసి ఆ దిశగా ఆచరణలోకి తీసుకొచ్చింది. లక్షల రూపాయలు ఖర్చయ్యే మాంసాహార భోజనానికి తెరదించాలని ప్రచారం చేస్తోంది.
దశాబ్ద కాలంగా ఈ సంస్థ చేస్తున్న కృషి వల్ల వేలాది కుటుంబాలు లబ్దిపొందాయి. ‘అవాయిడ్ మటన్ ఆఫ్టర్ నికాహ్’ (అమన్) అనే నినాదంతో బయలుదేరిన ఈ సంస్థ తన లక్ష్య సిద్ధి కోసం చిత్తశుద్ధితో నిర్విరామంగా కృషి చేస్తోంది. నికాహ్ ఖర్చులను తగ్గించేందుకు పనిచేస్తూ ఇప్పటి వరకు కర్నూలు నగర ముస్లింలకు నలభై ఎనిమిది కోట్ల రూపాయలు ఆదా చేసినట్లు అమన్ నిర్వాహకులు చెబుతున్నారు. నికాహ్ వేడుకల్లో మాంసాహార నిషేధం కోసం తమ కమిటీ సభ్యులు నిరంతరం శ్రమిస్తూ, తద్వారా ఆడపిల్లల తల్లిదండ్రులకు ఆర్థికపరమైన ఊరటను చేకూర్చుతున్నారని సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. హమీద్, సహాయ కార్యదర్శి ఎండి అన్వర్ బాషా తెలిపారు.
అమన్ ఆవిర్భావం వెనుక
‘‘2005లో అనంతపురం జిల్లా గుంతకల్లులో ఓ ముస్లిం ఇంట పెళ్లి జరిగింది. అందులో నికాహ్ తరువాత పెళ్లి కొడుకు బంధువులకు విందు భోజనాల్లో మాంసాహారం సంతృప్తికరంగా వడ్డించలేదని వరుని తరుపున వచ్చిన బంధువులు గొడవ పెట్టుకున్నారు. ఆ ఘర్షణ చివరకు సాయంత్రానికే పెళ్లి తెగతెంపులకు దారి తీసింది. ఈ ఘటన పేపరులో చదివి చాలా బాధపడ్డాం. ఆ తరువాత చికెన్ తింటే ‘చికున్ గున్యా’ వస్తుందనే ప్రచారం సంచలనం రేపింది. అప్పటివరకు కర్నూలు పెళ్లిళ్లలో తక్కువ ఖర్చు అని చికెన్‌తో భోజనాలు పెట్టే వారు. అయితే చికెన్ తింటే చికున్ గున్యా వస్తుందన్న భ్రమతో నికాహ్ భోజనాలు పొట్టేలు మాంసంతోనే పెట్టాలని అబ్బాయిల తల్లిదండ్రులు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు.
ఈ సంఘటనలు ఆందోళన కలిగించాయి. కర్నూలు నగరంలో 80శాతం మంది ముస్లింలు పేద, సామాన్య కుటుంబాలే. బీడి కార్మికులు, రిక్షా, తాపీ కార్మికులు, హమాలీలు ఖరీదైన పొట్టేలు మాంసం వండి వచ్చిన బంధువులందరికీ భోజనాలు ఏర్పాటు చేయాలంటే ఖర్చు లక్షలకు చేరుతుంది. ఈ సమస్య పరిష్కారానికి ఉద్యమం తీసుకురావాలని యునైటెడ్ మైనారిటీ సొసైటీ అధ్యక్షుడు మౌలానా జుబేర్ అహ్మద్ ఖాన్ రషాదీతో 2006 జనవరిలో మలిగియా మసీదులో కూర్చొని చర్చించాం. అయన సానుకూల స్పందనతో ‘అమన్’ కమిటీని ఏర్పాటు చేసి నికాహ్ వేడుకల్లో మాంసాహారం నిషేధం కోసం అభిప్రాయ సేకరణకు సిద్ధమయ్యాం. ఉద్యోగులు, లాయర్లు, ఇంజనీర్లు, డాక్టర్లను వ్యక్తిగతంగా కలిసి అమన్ కమిటీ ఆశయాలు వివరించాం.
అబ్బాయి తల్లిదండ్రులు నిర్వహించే వలిమా విందుకు ఎలాంటి అభ్యంతరాలు ఉండబోవని చెప్పాం. ప్రతి రోజు ఉదయం నుంచి రాత్రి 11గంటల వరకు వివిధ కుటుంబాలను కలిసి ప్రచారం చేపట్టాం. ఐదు నెలలకు పైబడిన మా శ్రమకు అల్లాహ్ కరుణ తోడవడంతో ముస్లిం ప్రజల్లో చైతన్యం వచ్చేసింది. 80వేల సంతకాలు సేకరించాం. వాటిలో ప్రభుత్వ ఖాజీలు హాఫీజ్ సయ్యద్ సలీం బాషా (హనఫీ), యూసుఫ్ జానీ (అహెలే హదీస్)లు సంతకాలు చేశారు. ‘అవాయిడ్ మటన్ ఆఫ్టర్ నికాహ్’ అనే నినాదంతో ఆ ఆంగ్లపదాల్లోని మొదటి అక్షరాలతో అమన్ కమిటీ అని పేరు పెట్టాం. ముందుగా మటన్‌ను మాత్రమే నిషేధించాలనుకున్నాం.
కానీ ప్రజల నుంచి వచ్చిన విన్నపాల మేరకు మటన్, చికెన్‌తోపాటు ఇతర ఏ మాంసాహారాన్నీ నికాహ్‌లో పెట్టరాదనే నిర్ణయానికి వచ్చాం. అయితే అప్పటికే ప్రజల్లో ‘అమన్’ కమిటీ పేరు బాగా పాపులర్ అవడంతో ఆ పేరును అలాగే కొనసాగిస్తున్నాం’’ అని వివరించారు హమీద్, అన్వర్ బాషా.భవిష్యత్తులో వరకట్న కానుకలు, అదనపు కట్నాలపై సైతం ఇదే తరహాలో పోరాటాలు నిర్వహించి, ఆ భారం నుంచి కూడా అమ్మాయిల తల్లిదండ్రులను తప్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది ‘అమన్’. అందుకోసం ‘ఆమని’ (ఆడపిల్లల మరణాల నివారణ) అనే సంస్థను ఏర్పాటు చేయబోతోంది.
Comments
Please login to add a commentAdd a comment