అధినేతల హత్యలు
నేడు అమరవీరుల సంస్మరణ దినం. 68 ఏళ్ల క్రితం సరిగ్గాఇదే రోజున మహాత్మాగాంధీ ఒక అతివాది చేతిలో హత్యకు గురయ్యారు. అత్యంత దురదృష్టకరమైన ఆ దుర్ఘటనను గుర్తు చేసుకుంటూ.. చరిత్రలోని ఇలాంటి కొన్ని ‘ప్రసిద్ధ’ హత్యోదంతాలను ఓసారి సింహావలోకనం చేసుకుందాం.
గమనిక:ఏ హత్యకూ‘ఇదే కారణం’ అని చెప్పలేం కానీ, ‘ఇదీ ఒకకారణం’ అని చెప్పుకోడానికి తగిన ఆధారాలు చరిత్రలో కనిపిస్తాయి.
1895 క్వీన్ (మిన్) మమాంగ్‌సియాంగ్, కొరియా
ఎవరు చంపారు?
ఇంపీరియల్ జపనీస్ ఆర్మీ లెఫ్ట్‌నెంట్ జనరల్ మియరా గోరో నాయకత్వంలో 50 మందికి పైగా జపాన్ ఏజెంట్లు రాణిప్రాసాదాన్ని చుట్టుముట్టి ఆమెను కాల్చి చంపారు.
ఎందుకు చంపారు?
సామ్రాజ్య విస్తరణకు క్వీన్ మిన్ అడ్డుగా ఉన్నారని భావించిన జపాన్ ఆమెను అంతమొందించింది.
తర్వాతేం జరిగింది?
దౌత్య నిరసనలు మొదలయ్యాయి. కొరియాను శాంతింపజేయడానికి జపాన్ 56 మంది సౌంత పౌరులను దోషులుగా అంగీకరించింది. కొరియాలో స్వాతంత్య్ర కాంక్ష తలెత్తింది. రాణి హత్య ప్రభావంతో 60 దేశభక్త సైనిక దళాలు ఆవిర్భవించాయి.
1963 జాన్ ఎఫ్.కెన్నెడీ, అమెరికా అధ్యక్షుడు
ఎవరు చంపారు?
లీ హార్వే ఓస్వాల్డ్
ఎందుకు చంపారు?
ఎందుకనేది కనుక్కోవడంలో ‘వారెన్ కమిషన్’ విఫలమైంది.
తర్వాతేం జరిగింది?
హత్యపై కుట్ర సిద్ధాంతాలు బయల్దేరాయి. అమెరికన్ ప్రజలు ఆగ్రహానికి, అసహనానికి గురయ్యారు. కొందరు మానసికంగా జబ్బున పడ్డారు!
1965 మాల్కమ్ ఎక్స్, హక్కుల కార్యకర్త, రచయిత
ఎవరు చంపారు?
తాల్మెడ్ హేయర్ (థామస్ హేగన్), నార్మన్ 3ఎక్స్ బట్లర్, థామస్ 15ఎక్స్ జాన్సన్.
ఎందుకు చంపారు?
‘నేషన్ ఆఫ్ ఇస్లాం’ నుంచి మాల్కమ్ ఎక్స్ బయటికి వచ్చేశాడు. కక్ష కట్టిన నేషన్ ఆఫ్ ఇస్లాం.. తన ఏజెంట్‌లను పంపించి అతడిని హత్య చేయించింది.
తర్వాతేం జరిగింది?
డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, ఇంకా.. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు సంతాపం వ్యక్తం చేశారు. కార్యకర్తలు మాల్కమ్ ఉద్యమ వారసత్వాన్ని కొనసాగించారు.
1918 రెండవ నికోలస్, రష్యా చివరి చక్రవర్తి (జార్)
ఎవరు చంపారు?
బోల్షెవిక్ అధికారి యకోవ్ యురోవ్‌స్కీ నేతృత్వంలోని ఫైరింగ్ స్క్వాడ్. ఈ స్వా్కడ్ ఒక్క నికోలస్‌నే కాకుండా ఆయన కుటుంబ సభ్యులందరినీ (భార్య, నలుగురు కూతుళ్లు, కొడుకు) హతమార్చింది.
ఎందుకు చంపారు?
కరువులోంచి తలెత్తిన ఫిబ్రవరి విప్లవం, పాలనపై ప్రజల్లోని అసంతృప్తి, మొదటి ప్రపంచ యుద్ధంలో రష్యా జోక్యం ఇవన్నీ.. నికోలస్‌కు వ్యతిరేకంగా పనిచేశాయి.
క్రీ.పూ. 44 జూలియస్ సీజర్, రోమ్ సేనాపతి
ఎవరు చంపారు?
కేషియస్ లాంజినస్, మార్కస్ జూనియస్ బ్రూటస్
ఎందుకు చంపారు?
పదవి కోసం.
తర్వాతేం జరిగింది?
రోమ్‌లోని మధ్య, దిగువ తరగతి ప్రజల్లో ఆగ్రహావేశాలు ఆకాశాన్నంటాయి. సీజర్‌ని చంపిన అరిస్టోక్రాట్స్ (సంపన్న వర్గాలు)పై ప్రతీకార దాడులు జరిగాయి. అంతర్యుద్దం మొదలైంది. చివరికి సీజర్ దత్తపుత్రుడు ఆగస్టస్ రోమ్ చక్రవర్తి అయ్యాడు.
1610 నాల్గవ హెన్రీ, ఫ్రాన్స్ చక్రవర్తి
ఎవరు చంపారు?
ప్రాంకోయిస్ రవైలాక్
ఎందుకు చంపారు?
కాల్వినిజం నుంచి కేథలిజంలోకి లోకి హెన్రీ మతం మార్చుకున్నారు. ఆ మార్పిడిని క్యాథలిక్ పిడివాది రవైలాక్ విశ్వసించలేదు. పైగా హెన్రీ ప్రొటెస్టెంట్‌లపై మతసహనం కనబరిచేవారు. అంతేకాకుండా.. ‘స్పానిష్ నెదర్లాండ్స్’ను ఆక్రమించుకోవాలని నిర్ణయించాడు. ఇవన్నీ చూస్తున్న రవైలాక్.. పోప్‌కు వ్యతిరేకంగా యుద్ధం మొదలు కాబోతున్నదని తలచి, అంతకన్నా ముందే కింగ్ హెన్రీని తుదముట్టించదలచుకున్నాడు.
తర్వాతేం జరిగింది?
హెన్రీ... హెన్రీ ది గ్రేట్ అయ్యాడు. మరణానంతరం పరమత సహనానికి ప్రతీకగా నిలిచాడు.
1865 అబ్రహాం లింకన్, అమెరికా అధ్యక్షుడు
ఎవరు చంపారు?
జాన్ విల్కీస్ బూత్
ఎందుకు చంపారు?
అమెరికా అంతర్యుద్ధంలో లింకన్‌ను వ్యతిరేకించిన ‘కాన్ఫెడరేషన్’ (అమెరికా నుంచి వేరు పడదామనుకున్న దక్షిణాది రాష్ట్రాల కూటమి)లో జాన్ విల్కీస్ బూత్ సభ్యుడు.
తర్వాతేం జరిగింది?
జాన్ విల్కీస్ బూత్‌ని సమర్థించిన నగరాలలో దాడులు జరిగాయి. వాషింగ్టన్ డిసి లోని ఫోర్డ్ థియేటర్ మూతపడింది. లింకన్ హత్య జరిగింది అందులోనే.
1948మహాత్మాగాంధీ, భారత జాతిపిత
ఎవరు చంపారు?
నాథూరామ్ గాడ్సే
ఎందుకు చంపారు?
దేశ విభజన పరిహారంగా పాకిస్థాన్‌కు 42 కోట్ల రూపాయలను ఇవ్వాలని భారత్ నిర్ణయించింది. ఇది గాడ్సేకు కోపం తెప్పించింది. స్వాతంత్య్రం వల్ల భారత్ బలహీనపడి, పాక్ లాభపడిందని అతడు భావించాడు.
తర్వాతేం జరిగింది?
బ్రాహ్మణులపై దాడులు జరిగాయి. (గాడ్సే బ్రాహ్మిణ్). భారత ప్రభుత్వం గాంధీజీని కాపాడుకోలేక పోయిందన్న విమర్శలు మొదలయ్యాయి. గాంధీజీకి భద్రతను నిరాకరించే అలవాటు ఉందనీ, ఆయనపై అప్పటికే రెండుమూడు సార్లు హత్యాయత్నం జరిగిందని తెలిసి కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయిందన్న ఆరోపణలు వచ్చాయి.
1968మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, పౌరహక్కుల ఉద్యమ నేత
ఎవరు చంపారు?
జేమ్స్ ఎర్ల్ రే.
ఎందుకు చంపారు?
రే.. తను చంపలేదని అన్నాడు. హత్య కుట్రలో తనొక పావును మాత్రమే అని చెప్పాడు. ఈ హత్యలో అమెరికా ప్రభుత్వం హస్తం ఉందని లూథర్ కింగ్ కుటుంబ సభ్యులు ఆరోపించారు.
తర్వాతేం జరిగింది?
కనీసం 100 నగరాల్లో అల్లర్లు చెలరేగాయి. అమెరికా ఒణికిపోయింది!
1914 ఆర్చ్ డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్, ఆస్ట్రియా–హంగేరి సింహాసన వారసుడు
ఎవరు చంపారు?
గవ్రిలో ప్రిన్సిప్
ఎందుకు చంపారు?
‘యంగ్ బోస్నియా’ అనే బోస్నియా సెర్బుల ఉగ్రవాద సంస్థలో గవ్రిలో ఒక సభ్యుడు. ఫెర్డినాండ్‌ను అంతమొందించడం ద్వారా ఆస్ట్రియా–హంగేరి పాలన నుంచి సెర్బియాకు విముక్తి కల్పించాలనుకున్నాడు.
తర్వాతేం జరిగింది?
మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది.