Martyrs Remembrance Day
-
‘బలి పశువు’ కొలువుగా మారిందెందుకు?
‘అంకురం’ సినిమాలో నక్సలైట్లకు సహకరిస్తున్నారనే నెపంతో రేవతి ఇంటిని పోలీసులు అర్ధరాత్రి కూల్చేస్తారు. తెల్లారి పరామర్శకు వచ్చిన వారు ‘ఇది చాలా అన్యాయం, మనం వెంటనే వెళ్లి పోలీసు రిపోర్టు ఇవ్వాలి’ అని సలహా ఇస్తారు. ఈ మాట విన్న తర్వాత రేవతి, ఆమె తండ్రి పగలబడి నవ్వుతారు. నిస్సహాయత, నిర్వేదం నిండుకున్న ఆ నవ్వులో 1980–90 దశకాల్లో తెలంగాణ జిల్లాల్లో, మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పోలీసు వ్యవస్థపై ప్రజలకున్న ఏవగింపు ప్రస్ఫుటిస్తుంది. ‘కన్యాశుల్కం’ నాటకంలో గిరీశం పాత్రధారి మరొకరితో రిక్షాలో వెళుతూ భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చే అవకాశాల గురించి చర్చిస్తుంటాడు. అది వింటున్న రిక్షా కార్మికుడు ‘సొతంత్రం వస్తే మన ఊరి హెడ్డు (పోలీస్ హెడ్ కానిస్టేబుల్) మారుతాడాండీ’ అని ఆశగా అడుగుతాడు. పోలీసుల నుంచి విముక్తి అయితే చాలు, ఆ రిక్షా కార్మికుడికి స్వాతంత్య్రం వచ్చినట్లే. సిని మాలు, నాటకాలు, పాటలు ఆయా కాలాల్లో నెలకొన్న సామాజిక స్థితికి అద్దం పడతాయి. బ్రిటిష్ ఏలుబడిలో ఉన్నా, నిజాం కాలంలో అయినా, సమైక్య పాలన అయినా పోలీసులే ప్రజలకు ప్రధాన విరోధులుగా కనిపించేవారు. నిజానికి ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందు గుర్తొచ్చేది పోలీసులే. ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహించేది సైనికులతో పాటు పోలీసులే. ఇంత కష్టంతో కూడుకున్న పని చేస్తున్న పోలీసులకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు రావాలి. సైని కుల గురించి ఎంత గొప్పగా మాట్లాడుకుంటారో, వారికంటే తక్కువ వేతనాలు, సౌకర్యాలు పొందుతూ ఎక్కువ సేవలు అందిస్తున్న పోలీసుల గురించి అంతకన్నా గొప్పగా మాట్లాడుకోవాలి కదా? కానీ ఆ పరిస్థితి ఉందా? ఆయా కాలాల్లో ప్రభుత్వాలు అనుసరించిన విధానం, పాలకుల వైఖరి కారణంగా పోలీసులు బలిపశువులు కావాల్సి వచ్చింది. తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించే ప్రజ లను అణచివేయడమే పోలీసుల ప్రాథమిక విధి కావడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. నేరాలను అదుపు చేయడం, నేరస్తులకు శిక్ష పడేలా చేయడం, సమాజంలో శాంతి–ప్రజలకు భద్రత కల్పించడం లాంటి ప్రాథమిక విధులు పోలీసులకు ద్వితీయ, తృతీయ ప్రాధాన్యాలుగా మారడం వల్లే ఈ దుస్థితి వచ్చింది. సామాజిక, ఆర్థిక, రాజకీయ కోణాల నుంచి పరిస్థితిని సమీక్షించి సమస్యను పరిష్కరిస్తే ఇంత హింస –ప్రతిహింస జరిగేవి కావు. ప్రతీ దాన్ని శాంతిభద్రతల సమస్యగా చూడటంవల్ల ఈ దుఃఖం మిగిలింది. ప్రభుత్వాలు ప్రజాస్వామ్యయుతంగా ఆలోచించి, పని చేయగలిగిన చోట పరిస్థితి మారుతున్నది. పోలీసుల బలిదానాలు తగ్గాయి. ఆరేళ్ల కింద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రమే దీనికి పెద్ద ఉదాహరణ. సామాజిక అసమానతలు తొలగించడం, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, పేదరికాన్ని పారద్రోలడం, ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించడం లాంటి అంశాల్లో ప్రభుత్వం ఎంత బాగా పనిచేస్తే సమాజంలో శాంతి, సామరస్యం అంత వర్ధిల్లుతాయి. పోలీసు నిర్బంధంగా పేరుబడ్డ ప్రభుత్వ నిర్బంధాన్ని స్వయంగా చవిచూసిన ఉద్యమకారుడు కావడం వల్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సామాజిక, ఆర్థిక అంశాలకు సంబంధించి దీర్ఘకాలిక వ్యూహంతో పనిచేస్తున్నారు. శాంతియుతంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రమే కండ్లముందు ఉండడంతో ఎంతటి జటిల సమస్యనైనా పరిష్కరించుకోవచ్చనే మానసిక దృఢత్వం తెలంగాణ ప్రజల్లో ఏర్పడింది. సమస్యల పరిష్కారానికి ప్రాణాలు పణంగా పెట్టే ఉద్యమాలు అవసరం లేదనే దృక్పథం ఏర్పడింది. 1985లో పీపుల్స్ వార్ అగ్రనాయకుడు కొండపల్లి సీతారామయ్యను ఉస్మానియా ఆసుపత్రి నుంచి తీసుకుపోవడానికి భద్రతా విధుల్లో ఉన్న కానిస్టేబుల్ మహ్మద్ ఇబ్రహీంను నక్సలైట్లు కాల్చి చంపారు. అప్పటి నుంచి 2014లో తెలంగాణ ఆవిర్భావం వరకు సమైక్య రాష్ట్రంలో మొత్తం 557 మంది పోలీసులు విధి నిర్వహణలో అసువులు బాశారు. అందులో తెలంగాణ వారు 325 మంది. ఏడాదికి సగటున 20 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేవలం ఒక్కరంటే ఒక్క పోలీసు కానిస్టేబుల్ మాత్రమే నక్సలైట్ల చేతిలో హతమవడం మారిన పరిస్థితికి అద్దం పడుతున్నది. ప్రభుత్వం నుంచి అందుతున్న ప్రోత్సాహం, విధానపర సౌలభ్యం కారణంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ సాధ్యమవుతున్నది. దీంతో ప్రజలకు పోలీసుల పట్ల ఉన్న పాత వైఖరి మారి సదభిప్రాయం రూపుదిద్దుకుంటున్నది. పోలీసులున్నది మన కోసమే అని ప్రజలు భావించినప్పుడు వారి బలిదానాలకు నిజంగానే గొప్ప నివాళి, సానుభూతి లభిస్తుంది. ఈ దిశగా తెలంగాణ రాష్ట్రంలో తొలి అడుగులు పటిష్టంగా పడ్డాయి. (నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా) గటిక విజయ్‌కుమార్ వ్యాసకర్త కేసీఆర్ వ్యక్తిగత పౌర సంబంధాల అధికారి -
అధినేతల హత్యలు
నేడు అమరవీరుల సంస్మరణ దినం. 68 ఏళ్ల క్రితం సరిగ్గాఇదే రోజున మహాత్మాగాంధీ ఒక అతివాది చేతిలో హత్యకు గురయ్యారు. అత్యంత దురదృష్టకరమైన ఆ దుర్ఘటనను గుర్తు చేసుకుంటూ.. చరిత్రలోని ఇలాంటి కొన్ని ‘ప్రసిద్ధ’ హత్యోదంతాలను ఓసారి సింహావలోకనం చేసుకుందాం. గమనిక:ఏ హత్యకూ‘ఇదే కారణం’ అని చెప్పలేం కానీ, ‘ఇదీ ఒకకారణం’ అని చెప్పుకోడానికి తగిన ఆధారాలు చరిత్రలో కనిపిస్తాయి. 1895 క్వీన్ (మిన్) మమాంగ్సియాంగ్, కొరియా ఎవరు చంపారు? ఇంపీరియల్ జపనీస్ ఆర్మీ లెఫ్ట్‌నెంట్ జనరల్ మియరా గోరో నాయకత్వంలో 50 మందికి పైగా జపాన్ ఏజెంట్లు రాణిప్రాసాదాన్ని చుట్టుముట్టి ఆమెను కాల్చి చంపారు. ఎందుకు చంపారు? సామ్రాజ్య విస్తరణకు క్వీన్ మిన్ అడ్డుగా ఉన్నారని భావించిన జపాన్ ఆమెను అంతమొందించింది. తర్వాతేం జరిగింది? దౌత్య నిరసనలు మొదలయ్యాయి. కొరియాను శాంతింపజేయడానికి జపాన్ 56 మంది సౌంత పౌరులను దోషులుగా అంగీకరించింది. కొరియాలో స్వాతంత్య్ర కాంక్ష తలెత్తింది. రాణి హత్య ప్రభావంతో 60 దేశభక్త సైనిక దళాలు ఆవిర్భవించాయి. 1963 జాన్ ఎఫ్.కెన్నెడీ, అమెరికా అధ్యక్షుడు ఎవరు చంపారు? లీ హార్వే ఓస్వాల్డ్ ఎందుకు చంపారు? ఎందుకనేది కనుక్కోవడంలో ‘వారెన్ కమిషన్’ విఫలమైంది. తర్వాతేం జరిగింది? హత్యపై కుట్ర సిద్ధాంతాలు బయల్దేరాయి. అమెరికన్ ప్రజలు ఆగ్రహానికి, అసహనానికి గురయ్యారు. కొందరు మానసికంగా జబ్బున పడ్డారు! 1965 మాల్కమ్ ఎక్స్, హక్కుల కార్యకర్త, రచయిత ఎవరు చంపారు? తాల్మెడ్ హేయర్ (థామస్ హేగన్), నార్మన్ 3ఎక్స్ బట్లర్, థామస్ 15ఎక్స్ జాన్సన్. ఎందుకు చంపారు? ‘నేషన్ ఆఫ్ ఇస్లాం’ నుంచి మాల్కమ్ ఎక్స్ బయటికి వచ్చేశాడు. కక్ష కట్టిన నేషన్ ఆఫ్ ఇస్లాం.. తన ఏజెంట్లను పంపించి అతడిని హత్య చేయించింది. తర్వాతేం జరిగింది? డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, ఇంకా.. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు సంతాపం వ్యక్తం చేశారు. కార్యకర్తలు మాల్కమ్ ఉద్యమ వారసత్వాన్ని కొనసాగించారు. 1918 రెండవ నికోలస్, రష్యా చివరి చక్రవర్తి (జార్) ఎవరు చంపారు? బోల్షెవిక్ అధికారి యకోవ్ యురోవ్స్కీ నేతృత్వంలోని ఫైరింగ్ స్క్వాడ్. ఈ స్వా్కడ్ ఒక్క నికోలస్నే కాకుండా ఆయన కుటుంబ సభ్యులందరినీ (భార్య, నలుగురు కూతుళ్లు, కొడుకు) హతమార్చింది. ఎందుకు చంపారు? కరువులోంచి తలెత్తిన ఫిబ్రవరి విప్లవం, పాలనపై ప్రజల్లోని అసంతృప్తి, మొదటి ప్రపంచ యుద్ధంలో రష్యా జోక్యం ఇవన్నీ.. నికోలస్‌కు వ్యతిరేకంగా పనిచేశాయి. క్రీ.పూ. 44 జూలియస్ సీజర్, రోమ్ సేనాపతి ఎవరు చంపారు? కేషియస్ లాంజినస్, మార్కస్ జూనియస్ బ్రూటస్ ఎందుకు చంపారు? పదవి కోసం. తర్వాతేం జరిగింది? రోమ్‌లోని మధ్య, దిగువ తరగతి ప్రజల్లో ఆగ్రహావేశాలు ఆకాశాన్నంటాయి. సీజర్ని చంపిన అరిస్టోక్రాట్స్ (సంపన్న వర్గాలు)పై ప్రతీకార దాడులు జరిగాయి. అంతర్యుద్దం మొదలైంది. చివరికి సీజర్ దత్తపుత్రుడు ఆగస్టస్ రోమ్ చక్రవర్తి అయ్యాడు. 1610 నాల్గవ హెన్రీ, ఫ్రాన్స్ చక్రవర్తి ఎవరు చంపారు? ప్రాంకోయిస్ రవైలాక్ ఎందుకు చంపారు? కాల్వినిజం నుంచి కేథలిజంలోకి లోకి హెన్రీ మతం మార్చుకున్నారు. ఆ మార్పిడిని క్యాథలిక్ పిడివాది రవైలాక్ విశ్వసించలేదు. పైగా హెన్రీ ప్రొటెస్టెంట్లపై మతసహనం కనబరిచేవారు. అంతేకాకుండా.. ‘స్పానిష్ నెదర్లాండ్స్’ను ఆక్రమించుకోవాలని నిర్ణయించాడు. ఇవన్నీ చూస్తున్న రవైలాక్.. పోప్‌కు వ్యతిరేకంగా యుద్ధం మొదలు కాబోతున్నదని తలచి, అంతకన్నా ముందే కింగ్ హెన్రీని తుదముట్టించదలచుకున్నాడు. తర్వాతేం జరిగింది? హెన్రీ... హెన్రీ ది గ్రేట్ అయ్యాడు. మరణానంతరం పరమత సహనానికి ప్రతీకగా నిలిచాడు. 1865 అబ్రహాం లింకన్, అమెరికా అధ్యక్షుడు ఎవరు చంపారు? జాన్ విల్కీస్ బూత్ ఎందుకు చంపారు? అమెరికా అంతర్యుద్ధంలో లింకన్‌ను వ్యతిరేకించిన ‘కాన్ఫెడరేషన్’ (అమెరికా నుంచి వేరు పడదామనుకున్న దక్షిణాది రాష్ట్రాల కూటమి)లో జాన్ విల్కీస్ బూత్ సభ్యుడు. తర్వాతేం జరిగింది? జాన్ విల్కీస్ బూత్‌ని సమర్థించిన నగరాలలో దాడులు జరిగాయి. వాషింగ్టన్ డిసి లోని ఫోర్డ్ థియేటర్ మూతపడింది. లింకన్ హత్య జరిగింది అందులోనే. 1948మహాత్మాగాంధీ, భారత జాతిపిత ఎవరు చంపారు? నాథూరామ్ గాడ్సే ఎందుకు చంపారు? దేశ విభజన పరిహారంగా పాకిస్థాన్‌కు 42 కోట్ల రూపాయలను ఇవ్వాలని భారత్ నిర్ణయించింది. ఇది గాడ్సేకు కోపం తెప్పించింది. స్వాతంత్య్రం వల్ల భారత్ బలహీనపడి, పాక్ లాభపడిందని అతడు భావించాడు. తర్వాతేం జరిగింది? బ్రాహ్మణులపై దాడులు జరిగాయి. (గాడ్సే బ్రాహ్మిణ్). భారత ప్రభుత్వం గాంధీజీని కాపాడుకోలేక పోయిందన్న విమర్శలు మొదలయ్యాయి. గాంధీజీకి భద్రతను నిరాకరించే అలవాటు ఉందనీ, ఆయనపై అప్పటికే రెండుమూడు సార్లు హత్యాయత్నం జరిగిందని తెలిసి కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయిందన్న ఆరోపణలు వచ్చాయి. 1968మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, పౌరహక్కుల ఉద్యమ నేత ఎవరు చంపారు? జేమ్స్ ఎర్ల్ రే. ఎందుకు చంపారు? రే.. తను చంపలేదని అన్నాడు. హత్య కుట్రలో తనొక పావును మాత్రమే అని చెప్పాడు. ఈ హత్యలో అమెరికా ప్రభుత్వం హస్తం ఉందని లూథర్ కింగ్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. తర్వాతేం జరిగింది? కనీసం 100 నగరాల్లో అల్లర్లు చెలరేగాయి. అమెరికా ఒణికిపోయింది! 1914 ఆర్చ్ డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్, ఆస్ట్రియా–హంగేరి సింహాసన వారసుడు ఎవరు చంపారు? గవ్రిలో ప్రిన్సిప్ ఎందుకు చంపారు? ‘యంగ్ బోస్నియా’ అనే బోస్నియా సెర్బుల ఉగ్రవాద సంస్థలో గవ్రిలో ఒక సభ్యుడు. ఫెర్డినాండ్‌ను అంతమొందించడం ద్వారా ఆస్ట్రియా–హంగేరి పాలన నుంచి సెర్బియాకు విముక్తి కల్పించాలనుకున్నాడు. తర్వాతేం జరిగింది? మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది. -
అమరులకు వందనం
జనవరి 30 అమరవీరుల సంస్మరణ దినం బ్రిటిష్ పతాకం పరిచిన చీకట్ల కింద మగ్గిపోతున్న భారతావనికి కొత్త సూర్యోదయాన్ని చూపించి తాను అస్తమించారు బాపూజీ. మాతృభూమికి స్వేచ్ఛావాయువుల నిచ్చి తుదిశ్వాస వదిలారాయన. జనవరి 30, 1948న గాడ్సే తుపాకి గుళ్లకు బలైనప్పటికీ చాలామంది ప్రపంచ ప్రజల గుండెల్లో ఆయన స్మృతి ఈనాటికీ పదిలమే. గాంధీజీ స్ఫూర్తి, ఆదర్శం ప్రపంచ చరిత్రలో అనంతమైన అధ్యాయాలుగా మిగిలాయి కూడా. అహింస అనే ఆయన ఆదర్శానికి కైమోడ్పులు ఘటిస్తూనే స్వాతంత్య్రోద్యమంలో జాతీయ కాంగ్రెస్‌కు దీటుగా తమవైన పంథాలలో ఉద్యమించి త్యాగాలు చేసిన వారినీ స్మరించుకోవడం ఇవాళ్టి తరాల బాధ్యత. మితవాదులైనా, అతివాదులైనా, తీవ్ర జాతీయవాదులైనా– దాస్య శృంఖలాలు తెగే వరకే ఆ దృష్టి. ఆ విభజన. మార్గం వేరైనా, వారందరి లక్ష్యం దేశ స్వాతంత్య్రమే. ఎవరి త్యాగమైనా స్వరాజ్య భారతికీ, కొత్త తరాల దృష్టిలోనూ విలువైనదే కావాలి. అందుకే గాంధీజీ వర్ధంతికే ఆ మృతవీరులనూ స్మరించుకునే సమున్నత ఆదర్శాన్ని ఈ దేశం పాటిçస్తున్నది. గాంధీజీ ప్రతి భారతీయుడి హృదయాన్ని కదిపారు. నిజమే! ఆయనకు ముందు జరిగిన పోరులలోనూ, అలనాటి వీరులలోనూ అలాంటి శక్తే కనిపిస్తుంది. ఇదీ నిజమే! కానీ..... రక్తదీపావళిని మరిపించే ఆ త్యాగమూర్తుల జీవితాలలో మనకు తెలిసినవి ఎన్ని? వారిలో ఎందరిని తలుచుకుంటున్నాం? ఎంతమంది గురించి మన తరం వాళ్లం చదువుకున్నాం? చరిత్ర పుటలలో ఓ చోటు కోసమనీ, స్వతంత్ర భారతంలో పదవులొస్తాయనీ వారు తమ సర్వస్వం అర్పించలేదు. కేవలం దేశం కోసం ప్రాణాలర్పించారు. నిస్వార్థంగా నిష్క్రమించారు. అందుకే ఆ హుతాత్మల త్యాగ నిరతిని గాలికి వదిలేయడం ఏ దేశమైనా చేయవలసిన పనికాదు. 1857 నాటి ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో తొలి తూటా కాల్చిన మంగళ్ పాండే సాహసం, నానా సాహెబ్, లక్ష్మీబాయి, తాంతియా తోపే, తురేబాజ్ ఖాన్, వీరందరి వెనుక నిలిచిన సిపాయీల త్యాగాలు మరచిపోతామా! చిన్న ఉద్యమంతో పెద్ద త్యాగం చేసిన వాసుదేవ్ బల్వంత్ ఫాడ్కేని తలచుకోవడం మన విధి. పంజాబ్‌లో కొన్ని క్షణాల పాటు ఆరో నదికి– నెత్తుటి నదికి జన్మనిచ్చిన జలియన్‌వాలాబాగ్ దురంతంలో నేలకూలిన వారిని స్మరించేందుకు రెండు నిమిషాలు కేటాయించలేమా? స్వరాజ్యం నా జన్మహక్కు అన్న తిలక్, లాఠీదెబ్బలకు బలైన లజ్‌పతిరాయ్, అండమాన్ జైలులో కఠోర శిక్షలు అనుభవించిన సావర్కర్, ఇంకా ఎందరో త్యాగధనులు... గదర్‌వీరులు లాలా హరదయాళ్, సోహన్‌సింగ్ భాక్నా, కర్తార్ సింగ్, పృథ్వీసింగ్ ఆజాద్, రాస్ బిహారీ బోస్, ఉద్దమ్‌సింగ్, మౌల్వీ బర్కతుల్లా, దర్శి చెంచయ్య వంటి వారి స్వాతంత్య్ర కాంక్ష సదా స్మరణీయమే. పదిహేనేళ్ల ప్రాయంలోనే ఉరికొయ్యకు వేలాడాడు ఖుదీరాం. అషఫుల్లా ఖాన్, మదన్‌లాల్ థింగ్రా చిన్నతనంలోనే దేశం కోసం ప్రాణాలు అర్పించారు. హిందుస్తాన్ రిపబ్లికన్ సోషలిస్ట్ అసోసియేషన్ పేరు గుర్తుకు వస్తే సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీని దద్దరిల్ల చేసిన బాంబు పేలుడు చెవిని తాకడమే కాదు, భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి ఉడుకు రక్తపు చుక్కలు కంటి ముందు కదులుతాయి. కొండకోనలలో సంతాల్ హూల్ అంటూ సంతాల్ తెగ ఆదివాసులు, ఉల్గులాన్ అంటూ బిర్సా ముండా నేతృత్వంలో ముండా తెగ గిరిజనులు; ఇంకా ఖోలీలు, ఖోందులు, రాణీ గ్లెయిడినీ నాయకత్వంలో పోరాడిన నాగా వీరులు, నల్లమల చెంచులు.. ఎందరో గిరిపుత్రులు బ్రిటిష్ దాష్టీకం మీద శర సంధానం చేశారు. ప్రాణాలు వదిలారు. ‘జైహింద్’ అంటూ... ‘చలో ఢిల్లీ’ అంటూ నినదించిన సుభాష్ బోస్, షానవాజ్ ఖాన్, మోహన్‌సింగ్ దేవ్ వంటి ఆజాద్ హింద్ ఫౌజు జవానులు; చిట్టగాంగ్ మహావీరుడు సూర్యసేన్... ఎందరని! ఎన్నెన్ని త్యాగాలని! ఎన్నెన్ని రక్త తర్పణలని! కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఇలాంటి స్వేచ్ఛాకాంక్షతోనే దేశం ప్రతిధ్వనించింది. వీటి నడుమనే కనిపిస్తుంది విశాఖ మన్య పోరాటం. ఆ మహా యుద్ధానికి నాయకుడే అల్లూరి శ్రీరామరాజు అనే సీతారామరాజు. ఇది తెలుగు గడ్డ మీద జరిగిన పోరు. అయినా ఇప్పటికీ తెలుగువారికి తెలియని సత్యాలెన్నో! ఈ వారం నుంచి మొదలయ్యే ‘ఆకుపచ్చని సూర్యోదయం’ సీరియల్ ఆ లోటును పూరిస్తుందని మా నమ్మకం.