అమరులకు వందనం
జనవరి 30 అమరవీరుల సంస్మరణ దినం
బ్రిటిష్ పతాకం పరిచిన చీకట్ల కింద మగ్గిపోతున్న భారతావనికి కొత్త సూర్యోదయాన్ని చూపించి తాను అస్తమించారు బాపూజీ. మాతృభూమికి స్వేచ్ఛావాయువుల నిచ్చి తుదిశ్వాస వదిలారాయన. జనవరి 30, 1948న గాడ్సే తుపాకి గుళ్లకు బలైనప్పటికీ చాలామంది ప్రపంచ ప్రజల గుండెల్లో ఆయన స్మృతి ఈనాటికీ పదిలమే. గాంధీజీ స్ఫూర్తి, ఆదర్శం ప్రపంచ చరిత్రలో అనంతమైన అధ్యాయాలుగా మిగిలాయి కూడా. అహింస అనే ఆయన ఆదర్శానికి కైమోడ్పులు ఘటిస్తూనే స్వాతంత్య్రోద్యమంలో జాతీయ కాంగ్రెస్‌కు దీటుగా తమవైన పంథాలలో ఉద్యమించి త్యాగాలు చేసిన వారినీ స్మరించుకోవడం ఇవాళ్టి తరాల బాధ్యత. మితవాదులైనా, అతివాదులైనా, తీవ్ర జాతీయవాదులైనా– దాస్య శృంఖలాలు తెగే వరకే ఆ దృష్టి. ఆ విభజన. మార్గం వేరైనా, వారందరి లక్ష్యం దేశ స్వాతంత్య్రమే. ఎవరి త్యాగమైనా స్వరాజ్య భారతికీ, కొత్త తరాల దృష్టిలోనూ విలువైనదే కావాలి. అందుకే గాంధీజీ వర్ధంతికే ఆ మృతవీరులనూ స్మరించుకునే సమున్నత ఆదర్శాన్ని ఈ దేశం పాటిçస్తున్నది. గాంధీజీ ప్రతి భారతీయుడి హృదయాన్ని కదిపారు. నిజమే! ఆయనకు ముందు జరిగిన పోరులలోనూ, అలనాటి వీరులలోనూ అలాంటి శక్తే కనిపిస్తుంది. ఇదీ నిజమే!
కానీ.....
రక్తదీపావళిని మరిపించే ఆ త్యాగమూర్తుల జీవితాలలో మనకు తెలిసినవి ఎన్ని? వారిలో ఎందరిని తలుచుకుంటున్నాం? ఎంతమంది గురించి మన తరం వాళ్లం చదువుకున్నాం? చరిత్ర పుటలలో ఓ చోటు కోసమనీ, స్వతంత్ర భారతంలో పదవులొస్తాయనీ వారు తమ సర్వస్వం అర్పించలేదు. కేవలం దేశం కోసం ప్రాణాలర్పించారు. నిస్వార్థంగా నిష్క్రమించారు. అందుకే ఆ హుతాత్మల త్యాగ నిరతిని గాలికి వదిలేయడం ఏ దేశమైనా చేయవలసిన పనికాదు.
1857 నాటి ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో తొలి తూటా కాల్చిన మంగళ్ పాండే సాహసం, నానా సాహెబ్, లక్ష్మీబాయి, తాంతియా తోపే, తురేబాజ్ ఖాన్, వీరందరి వెనుక నిలిచిన సిపాయీల త్యాగాలు మరచిపోతామా! చిన్న ఉద్యమంతో పెద్ద త్యాగం చేసిన వాసుదేవ్ బల్వంత్ ఫాడ్కేని తలచుకోవడం మన విధి. పంజాబ్‌లో కొన్ని క్షణాల పాటు ఆరో నదికి– నెత్తుటి నదికి జన్మనిచ్చిన జలియన్‌వాలాబాగ్ దురంతంలో నేలకూలిన వారిని స్మరించేందుకు రెండు నిమిషాలు కేటాయించలేమా? స్వరాజ్యం నా జన్మహక్కు అన్న తిలక్, లాఠీదెబ్బలకు బలైన లజ్‌పతిరాయ్, అండమాన్ జైలులో కఠోర శిక్షలు అనుభవించిన సావర్కర్, ఇంకా ఎందరో త్యాగధనులు... గదర్‌వీరులు లాలా హరదయాళ్, సోహన్‌సింగ్ భాక్నా, కర్తార్ సింగ్, పృథ్వీసింగ్ ఆజాద్, రాస్ బిహారీ బోస్, ఉద్దమ్‌సింగ్, మౌల్వీ బర్కతుల్లా, దర్శి చెంచయ్య వంటి వారి స్వాతంత్య్ర కాంక్ష సదా స్మరణీయమే. పదిహేనేళ్ల ప్రాయంలోనే ఉరికొయ్యకు వేలాడాడు ఖుదీరాం. అషఫుల్లా ఖాన్, మదన్‌లాల్ థింగ్రా చిన్నతనంలోనే దేశం కోసం ప్రాణాలు అర్పించారు. హిందుస్తాన్ రిపబ్లికన్ సోషలిస్ట్ అసోసియేషన్ పేరు గుర్తుకు వస్తే సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీని దద్దరిల్ల చేసిన బాంబు పేలుడు చెవిని తాకడమే కాదు, భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి ఉడుకు రక్తపు చుక్కలు కంటి ముందు కదులుతాయి.
కొండకోనలలో సంతాల్ హూల్ అంటూ సంతాల్ తెగ ఆదివాసులు, ఉల్‌గులాన్ అంటూ బిర్సా ముండా నేతృత్వంలో ముండా తెగ గిరిజనులు; ఇంకా ఖోలీలు, ఖోందులు, రాణీ గ్లెయిడినీ నాయకత్వంలో పోరాడిన నాగా వీరులు, నల్లమల చెంచులు.. ఎందరో గిరిపుత్రులు బ్రిటిష్ దాష్టీకం మీద శర సంధానం చేశారు. ప్రాణాలు వదిలారు. ‘జైహింద్’ అంటూ... ‘చలో ఢిల్లీ’ అంటూ నినదించిన సుభాష్ బోస్, షానవాజ్ ఖాన్, మోహన్‌సింగ్ దేవ్ వంటి ఆజాద్ హింద్ ఫౌజు జవానులు; చిట్టగాంగ్ మహావీరుడు సూర్యసేన్... ఎందరని! ఎన్నెన్ని త్యాగాలని! ఎన్నెన్ని రక్త తర్పణలని! కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఇలాంటి స్వేచ్ఛాకాంక్షతోనే దేశం ప్రతిధ్వనించింది. వీటి నడుమనే కనిపిస్తుంది విశాఖ మన్య పోరాటం. ఆ మహా యుద్ధానికి నాయకుడే అల్లూరి శ్రీరామరాజు అనే సీతారామరాజు. ఇది తెలుగు గడ్డ మీద జరిగిన పోరు. అయినా ఇప్పటికీ తెలుగువారికి తెలియని సత్యాలెన్నో! ఈ వారం నుంచి మొదలయ్యే ‘ఆకుపచ్చని సూర్యోదయం’ సీరియల్ ఆ లోటును పూరిస్తుందని మా నమ్మకం.