తేనెటీగ.. చూపులకు చిన్నదే గానీ, అది చేసే పని చాలా చాలా పెద్దది. పూల మీద వాలుతూ మకరందాన్ని సేకరిస్తుంది. పనిలో పనిగా ఇందాక దాటి వచ్చిన పూలలోని పుప్పొడిని గ్రహించి ఇప్పుడు స్పృశిస్తున్న పూలకు అందిస్తూ జీవనం సాగిస్తుంది. ప్రకృతిలో ఇదొక అద్భుతం. పరపరాగ సంపర్కం అనాదిగా ఇలా సహజంగా జరిగిపోతూ వస్తోంది! ప్రపంచవ్యాప్తంగా 75% ఆహార పంటల దిగుబడులు పెరగాడానికి, నాణ్యత చేకూరడానికి ఎంతో కొంత మేరకైనా తేనెటీగలు, అడవి తేనెటీగలు, సీతాకోకచిలుకలు, తుమ్మెదలు.. ఎంతగానో తోడ్పడుతున్నాయి.
ఇవి లేకపోతే టమాటా, కోకో, కాఫీ, ఆపిల్, బాదం.. పంటలు/తోటలు తుడిచిపెట్టుకు పోయి ఉండేవట. ప్రాణప్రదమైన సేవలందించే తేనెటీగలకు రసాయనిక పురుగుమందులతోనే ముప్పొచ్చిపడింది. పారిశ్రామిక వ్యవసాయం తీవ్రస్థాయిలో జరిగే పాశ్చాత్య, ఐరోపా దేశాల్లో ఈ బెడద ఎక్కువగా ఉంది. చనిపోయిన తేనెటీగలు కుప్పలు తెప్పలుగా బయటపడుతుండడం శాస్త్రవేత్తలను కలవరపరుస్తోంది. మనకు తిండి కొరత ముంచుకు రాకుండా ఉండాలంటే తేనెటీగలను కంటికి రెప్పలా కాపాడుకోవాలని ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తోంది.
ఇందుకోసం ఈ ఏడాది నుంచి మే 20వ తేదీన ప్రపంచ తేనెటీగల దినోత్సవం జరుపుకోవాలని పిలుపునిచ్చింది. వ్యవసాయ రసాయనాలు వాడటం మానేసి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించాలని సూచించింది. కేవలం రైతులకే కాదు.. సమాజంలో ప్రతి ఒక్కరికీ తేనెటీగలను పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది. వీటికి హానిచేసే పనులు మానుకోవాలి. ఇళ్ల దగ్గర తేనెటీగల కోసం పూల మొక్కలు పెంచాలని ఆహార–వ్యవసాయ సంస్థ(ఎఫ్.ఎ.ఓ.) డైరెక్టర్ జనరల్ జోస్ గ్రాజియానో డ సిల్వ సూచిస్తున్నారు.
మే 20నే ఎందుకు?
తేనెటీగల పెంపకానికి స్లొవేనియా దేశం పెట్టింది పేరు. తేనెటీగల పెంపకానికి పితామహుడిగా పేరుగాంచిన అంతోన్ జన ఆ దేశస్తుడే. బ్రెజ్నిక అనే నగరంలో ఆయన 1734లో మే 20న జన్మించారు. చిత్రకళ నేర్చుకోవడానికి కాలేజీలో చేరినప్పటికీ అంతోన్ మనసంతా తేనెటీగల మీదే ఉండేదట. నిజానికి ఆయన బాల్యమంతా తెనె పెట్టెల మధ్యనే గడచింది. వాళ్ల నాన్న తమ ఇంటి చుట్టూ 130 తేనె పెట్టలను ఏర్పాటు చేశారట.
ఆ విధంగా తేనెటీగలపై అంతోన్‌కు గాఢమైన ఆసక్తి కలిగింది. ఆ ఆసక్తే ఆయనను తేనెటీగల తొలి అధ్యాపకుడిగా, తొలి గ్రంథ రచయితగా చరిత్రలో నిలబెట్టాయి. తేనెటీగల పెట్టెలను పెయింటింగ్స్‌తో సృజనాత్మకంగా తీర్చిదిద్దడం అంతోన్ ప్రత్యేకత. ఆయన స్మ ృత్యర్థం మే 20న ప్రపంచ తేనెటీగల దినోత్సవం జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. తేనెటీగలకు హాని కలిగించే పురుగుమందులను నిషేధించే చట్టం తేవడం ద్వారా స్లొవేకియా మిగతా దేశాలకు మార్గదర్శకంగా నిలిచింది!
Comments
Please login to add a commentAdd a comment