కావ్య.. ఓ స్పెషల్ గాళ్‌! | Meet 12-year-old Kavya who is building robots to save honey bees | Sakshi
Sakshi News home page

కావ్య.. ఓ స్పెషల్ గాళ్‌!

Published Thu, Apr 13 2017 11:17 AM | Last Updated on Tue, Sep 5 2017 8:41 AM

కావ్య.. ఓ స్పెషల్ గాళ్‌!

కావ్య.. ఓ స్పెషల్ గాళ్‌!

పన్నెండేళ్ల వయసులో ఎవరైనా ఏమిచేస్తారు? సహజంగానే బడికిపోతారు. తోటి పిల్లలతో కాసేపు ఆడుకుంటారు. ఆలసిపోయాక అమ్మ ఒడిలో సేదదీరతారు. అయితే 12 ఏళ్ల కావ్య విఘ్నేశ్‌ మాత్రం ఇందుకు భిన్నం. తాను కేవలం ఆటపాటలకే పరిమితం కాలేదు. కాస్త ఖాళీ సమయం దొరికినా దానిని ఇతరులకు ఉపయోగపడేలా వినియోగిస్తోంది. ఇతరులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం దొరికేలా చేస్తోంది.

న్యూఢిల్లీ: ఇప్పటిదాకా మీరు చదివినదంతా నిజమే. ఆవాస ప్రాంతాల్లో సంచరించే తేనెటీగల సంరక్షణకు కంకణం కట్టుకున్న కావ్య.. ఇందుకోసం ఏకంగా ఓ రోబోను తయారుచేసే పనిలో నిమగ్నమైంది. దీనిని వచ్చే నెలలో డెన్మార్క్‌లో జరగనున్న అంతర్జాతీయ రోబోటిక్స్‌ ప్రదర్శనలో ఉంచనుంది.

దేశరాజధానిలోని వసంత్‌కుంజ్‌ ప్రాంతంలో నివసించే కావ్య... ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో ఏడో తరగతి చదువుతోంది. రోబోటిక్స్, అత్యాధునిక పరికరాలను ఉపయోగించి ‘బీ సేవర్‌ బాట్‌’ను కావ్య తయారుచేసింది. ఈ ‘బీ సేవర్‌ బాట్‌’ ... ఫలదీకరణతోపాటు తేనె ఉత్పత్తికి దోహదం చేసే తేనెటీగలకు ఎటువంటి హాని కలగకుండా రక్షణ కల్పిస్తుంది. ‘తొమ్మిదేళ్ల వయసులోనే రోబోటిక్స్‌పై దృష్టి సారించా. నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యలకు రోబోటిక్స్‌ద్వారా పరిష్కార మార్గం చూపాలనేదే నా లక్ష్యమ’ని ఈ సందర్భంగా కావ్య చెప్పింది. గత మూడేళ్ల కాలంలో ఢిల్లీ రీజనల్‌ రోబోటిక్స్‌ చాంపియన్‌షిప్‌ (2015, 16)తోపాటు అనేక రోబోటిక్‌ చాంపియన్‌షిప్‌లను ఈ విద్యార్థిని కైవసం చేసుకుంది. వచ్చే నెలలో డెన్మార్క్‌లో జరిగే అంతర్జాతీయ పోటీలో భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

తేనెటీగలపైనే ఎందుకు దృష్టి సారించావని అడగ్గా ‘సహజంగానే వీటిని ఎవరూ పట్టించుకోరు. పైగా రసాయనాలను వెదజల్లి మరీ మనుషులు వీటి ప్రాణాలను హరిస్తారు. ప్రపంచంలోని పంటల్లో 85 శాతం ఫలదీకరణ ప్రక్రియ వీటిద్వారానే జరుగుతుందనే విషయాన్ని నేను, నా బృందం తెలుసుకున్నామ’ని తెలిపింది. సాధారణంగా ఇళ్ల సమీపంలో తేనెతుట్టె కనిపిస్తే వెంటనే పెస్ట్‌ కంట్రోలర్లను రప్పించి వాటిపై రసాయనాలు చల్లిస్తారని, ఇలా చేయడం వల్ల 20 నుంచి 80 వేల వరకు తేనెటీగలు చనిపోతున్నాయని ఈ బాలమేధావి వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement