వివిధ రకాల పరికరాలు, రోబోట్‌లు తయారుచేసే సరదా దిల్లీకి చెందిన సౌరవ్ కుమార్‌ను ఈవీ స్టార్టప్ ‘యూలర్’ వరకు తీసుకెళ్లింది. కాలుష్య సమస్యకు పరిష్కారంగా తయారు చేసిన ఈ కంపెనీ త్రీ–వీలర్స్ సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్నాయి. ఫ్లిప్‌కార్ట్, బిగ్‌బాస్కెట్‌లాంటి పెద్ద కంపెనీలు ‘యూలర్’ క్లయింట్స్‌గా ఉన్నాయి....
‘బెటర్ ఫ్యూచర్’ అంటూ కుటుంబంతో బిహార్ నుంచి దిల్లీకి వెళ్లి స్థిరపడ్డాడు సౌరవ్ కుమార్ తండ్రి. సౌరవ్ కుమార్‌కు గణితం అంటే ఇష్టం. రోబోట్‌ల తయారీపై ఆసక్తి. ఇక తండ్రికి గణితంతో పాటు సైన్స్ కూడా ఇష్టం. ఇద్దరూ సైన్స్‌కు సంబంధించిన విషయాలను ముచ్చటించుకునేవాళ్లు. దిల్లీలోని డీపీఎస్ ఆర్‌కే పురం స్కూల్లో చదివే రోజుల్లో రోబోట్‌ల తయారీలో ఎక్కువ సమయం గడిపేవాడు సౌరవ్. దిల్లీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆ తరువాత కార్నెల్ యూనివర్శిటీలో చదువుకునే రోజుల్లో కూడా ఏరియల్ వెహికిల్స్ నుంచి అండర్‌వాటర్ వెహికిల్స్ వరకు ఏదో ఒకటి తయారుచేస్తూనే ఉండేవాడు.
హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్ కాంబినేషన్‌ను ఎంజాయ్ చేసేవాడు. ఆ ఆనందం తనను మరో స్థాయికి తీసుకువెళ్లింది. ఒక విజయం సాధించిన తరువాత ‘వాట్ నెక్ట్స్?’ అనే ప్రశ్న వేసుకుంటాడు సౌరవ్. 2017లో ‘క్యూబ్26’ కంపెనీని వేరే కంపెనీకి అమ్మాడు. ఆ తరువాత స్విస్ గణితశాస్త్రవేత్త లియోన్‌హర్డ్ యూలర్ పేరు మీద ‘యూలర్ మోటర్స్’ కంపెనీ ప్రారంభించాడు. యూలర్ మోటర్ కంపెనీ కాలుష్య సమస్య తలెత్తని త్రీ–వీలర్‌లను తయారు చేస్తుంది. ‘మన దేశంలో ఎన్నో పట్టణాలు తీవ్రమైన కాలుష్య సమస్యని ఎదుర్కొంటున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కాలుష్య సమస్యకు పరిష్కారంగా త్రీ–వీలర్స్‌ను తయారు చేశాం’ అంటాడు సౌరవ్.
ఈ త్రీ వీలర్స్‌కు సంబంధించి లిథియం ఎనర్జీ బ్యాటరీ ప్యాక్‌లను సౌరవ్ కుమార్ అతని బృందం సొంతంగా తయారుచేసింది. ‘యూలర్’కు తనదైన చార్జింగ్ నెట్‌వర్క్, యాప్ ఉన్నాయి. దీని ద్వారా యూజర్‌లు తమ వాహనాలను మానిటర్ చేయవచ్చు. ‘వాహనం తయారు చేయడం సవాలు కాదు. తయారీ ప్రక్రియ సంతోషాన్ని ఇస్తుంది. అయితే అసలు సిసలు సమస్య ఫండింగ్. మీ కస్టమర్ ఎవరు? అనే ప్రశ్నకు సరిౖయెన సమాధానం చెప్పినప్పుడు ఫండింగ్ కష్టం కాదు’ అంటాడు సౌరవ్.
సౌరవ్ రంగంలోకి వచ్చినప్పుడు ఎలక్ట్రిక్ వెహికిల్ ఇండస్ట్రీ శైశవ దశలోనే ఉండడం, ఇకామర్స్ కంపెనీలు ఈవీల వైపు పెద్ద ఎత్తున రాకపోవడం సౌరవ్‌కు కలిసి వచ్చింది. ‘ఎలక్ట్రిక్ వెహికిల్ కంపెనీ నిర్మాణంలో రైట్ ప్రొడక్ట్, చార్జింగ్ సిస్టమ్, ఫైనాన్సింగ్ ముఖ్య పాత్ర పోషిస్తాయి’ అంటాడు సౌరవ్. దేశవ్యాప్తంగా ‘యూలర్’ రెండు వందల చార్జింగ్ స్టేషన్‌లను నిర్మించింది.
‘అంతర్గత దహన ఇంజిన్ (ఐసీయి) పనితీరు, బ్యాటరీ ప్యాక్‌కు సంబంధించి ఇన్‌బిల్ట్ థర్మల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ మార్కెట్‌లో మాకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చాయి. పోటీలో ముందుండేలా చేశాయి’ అంటాడు సౌరవ్. చిన్నగా ప్రస్థానం మొదలు పెట్టిన ‘యూలర్’ ఇప్పుడు పన్నెండు ఎకరాల పరిధిలో నెలకు మూడు వేల వాహనాలను తయారుచేసే ఫ్యాక్టరీ నిర్మించడం వరకు ఎదిగింది. ‘సామాజిక బాధ్యత’ అనేది సౌరవ్‌కు ఇష్టమైన మాట.
డబ్బు కోసం కష్టపడడం తప్పేమీ కాదు. అయితే అది మాత్రమే ప్రాధాన్యత కాదు. సమాజానికి తిరిగి ఏం ఇస్తున్నామనేది ముఖ్యం.
– సౌరవ్ కుమార్
Comments
Please login to add a commentAdd a comment