‘‘రోబోటిక్స్ రంగంలో బాలురు మాత్రమే రాణిస్తారని ఒకప్పుడు అనుకున్నాను. అది కేవలం అపోహ మాత్రమే. బాలికలు కూడా రాణించగలుగుతారని, బాలురకంటే మెరుగైన ఫలితాలను సాధించగలరని నిరూపించాను’’ అన్నది ఉషా కుమావత్. పదిహేనేళ్ల ఉషా కుమావత్.గోవా, పంజిమ్ పట్టణంలో పదవ తరగతి చదువుతున్న ఉష గత మార్చి నెలలో దుబాయ్‌లో జరిగిన ఇంటర్నేషనల్ కోవెడర్ 5.0 ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ రోబో సిటీ చాలెంజ్‌లో విజేతగా నిలిచింది. యునైటెడ్ నేషన్స్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ కాన్సెప్ట్‌లో భాగంగా నిర్వహించిన పోటీల్లో అరవై దేశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో స్టెల్లార్ కంట్రోల్ స్కిల్స్‌లో ఉష ప్రతిభ కనబరిచింది. తన విజయాన్ని తన టీచర్ మాయా కామత్‌కి అంకితమిచ్చింది ఉషా కుమావత్.
వీడియోగేమ్ కూడా తెలియదు
‘‘మా సొంతూరు రాజస్థాన్‌లోని గుహాలా గ్రామం. నేను పుట్టింది పెరిగింది గోవాలోనే. నాన్న భవన నిర్మాణరంగంలో టైల్స్ అమర్చే పని చేస్తాడు. అమ్మ గృహిణి. కంప్యూటర్‌ను దూరం నుంచి చూడడమే కానీ కనీసం తాకిన సందర్భం కూడా లేదు. అలాంటి నన్ను మా టీచర్ మాయా కామత్ ఒక రోబోటిక్స్ వర్క్ షాప్‌కి తీసుకెళ్లారు. నాకు చాలా ఆసక్తి కలిగింది. ఎన్నో సందేహాలు కలిగాయి. అవన్నీ టీచర్‌ని అడుగుతూ ఉంటే ఆమె కూడా చాలా ఇష్టంగా వివరించేవారు.
కోడింగ్ కూడా నేర్పించారు. నాకు వీడియో గేమ్ ఆడిన అనుభవం కూడా లేదు. అలాంటిది రోబోటిక్స్‌లో నైపుణ్యం సాధించగలిగానంటే అంతా మా టీచర్‌ప్రోత్సాహమే. దుబాయ్‌లో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడానికి ముందు గురుగ్రామ్‌లో జాతీయస్థాయి పోటీలకు తీసుకెళ్లారు. పోటీల వేదిక మీద రోబోను ఆపరేట్ చేయడం కొంత బెరుగ్గా అనిపించినప్పటికీ నా ప్రతిభను ప్రదర్శించగలిగాను. ఆ పోటీల్లోనే అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యాను.
ఆ పోటీల్లో రాణించాలంటే ఇంకా చాలా బాగా సాధన చేయాలని నాకే అర్థమైంది. ఎక్కువ రోజుల్లేవు. నా రోబో పేరు క్వార్కీ. దాంతో ఐదు నిమిషాల సమయంలో మ్యాచింగ్ కలర్స్, జడ్జింగ్ డైరెక్షన్స్, నావిగేటింగ్, సెగ్రెగేటింగ్ వంటి పదకొండు పనులు చేయించి నిరూపించాలి నేను. రోజూ టైమ్ పెట్టుకుని సాధన చేస్తూ ఒక రోజుకంటే మరో రోజు ఇంకా తక్కువ సమయంలో పూర్తి చేస్తూ మొత్తానికి లక్ష్యాన్ని సాధించగలిగాను’’ అని వివరించింది ఉషా కుమావత్.
పేరు మారింది
ఇదిలా ఉండగా... ఉషకు రోబోటిక్స్‌లో శిక్షణ ఇవ్వడం కంటే దుబాయ్ వెళ్లడానికి పాస్‌పోర్టు కోసం పడిన కష్టాలే పెద్దవన్నారు ఉష టీచర్ మాయా కామత్. ‘‘పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాలను చూస్తే ఒకదానితో మరొకటి సరిపోలడం లేదు. స్కూల్ రికార్డ్స్‌లో ఉషా కుమావత్ అని ఉంది, బర్త్ సర్టిఫికేట్‌లో ఉషా కుమారి అని ఉంది. బర్త్ సర్టిఫికేట్‌ను సరిచేయమని కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు చేయాల్సి వచ్చింది. ఉష తల్లిదండ్రుల మ్యారేజ్ సర్టిఫికేట్ లేదు. వారి పెళ్లి రాజస్థాన్‌లోని వాళ్ల సొంతూరులో జరిగింది. ఆ సర్టిఫికేట్ కుదరదని పాన్ కార్డు కోసం అప్లయ్ చేశాం.
పాన్ కార్డు రావాలంటే ముందు ఆధార్ కార్డులో పేరు సరి చేసుకోవాల్సి వచ్చింది. ఇన్ని ప్రయాసల తర్వాత పాస్‌పోర్టు జారీ అయింది. కానీ ప్రయాణఖర్చులు ప్రశ్నార్థకమయ్యాయి. గోవాలోని పెద్ద వ్యాపార కంపెనీలను అభ్యర్థించి మొత్తానికి అవసరానికి తగిన డబ్బు సమకూర్చగలిగాను. దుబాయ్ వరకు తీసుకెళ్లిన తర్వాత అక్కడ చక్కటి ప్రతిభ ప్రదర్శించి మనదేశానికి గౌరవం తెచ్చింది. ఉష లాగా నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులు ఉంటే నేర్పించి వారిని విజేతలుగా తీర్చిదిద్దడానికి మాలాంటి టీచర్లు సిద్ధంగా ఉంటారు. మా విజయం మా విద్యార్థులే’’ అన్నారు మాయా కామత్.
Comments
Please login to add a commentAdd a comment