‘‘సన్నగా ఉండాలని కడుపు మాడ్చుకుంటే అనారోగ్యమే. చక్కగా తినాలి... చక్కగా ఎక్సర్‌సైజ్‌లు చేయాలి. ఆరోగ్యమే మహాభాగ్యం’’ అని ఉష మూల్పూరి(Usha Mulpuri)అన్నారు. నిర్మాతగా తన తనయుడు నాగశౌర్యతో ‘ఛలో, నర్తనశాల, కృష్ణా వ్రింద విహారి’ తదితర చిత్రాలను నిర్మించారు. తొలి చిత్రం ‘ఛలో’ తోనే నిర్మాతగా సక్సెస్‌ని టేస్ట్ చేసిన ఉష ఇప్పుడు తన రెస్టారెంట్ ‘ఉష మూల్పూరి’స్ కిచెన్(Usha Mulpuri's Kitchen)’ ద్వారా రుచికరమైన వంటకాలు అందిస్తున్నారు. ఇక గణతంత్ర దినోత్సవం(Republic Day) సందర్భంగా ‘సాక్షి’ కోసం ప్రత్యేకంగా కొన్ని వంటకాలు(Recipes) తయారు చేశారు. ఆ వంటకాలు తెలుసుకుందాం.
‘‘దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్... ఆ మనుషుల ఆరోగ్యం మా బాధ్యత... అందుకే రిపబ్లిక్ డే సందర్భంగా చేసిన వంటకాల్లోనూ పోషక విలువలు ఉండేలా చూసుకున్నాను’’ అంటూ దేశభక్తిని చాటుతూ, జెండా రంగులకు తగ్గట్టుగా తాను కూడా రెడీ అయి, కిచెన్‌లోకి ఎంటరయ్యారు ఉష. ముందుగా నాన్ వెజ్ స్టార్టర్ చేశారు.. ‘పండుమిర్చి కోడి వేపుడు, క్రీమ్ చికెన్, కరివేపాకు కోడి వేపుడు’ చేసి, ఆ కాంబోని అందంగా ప్రెజెంట్ చేశారు. ‘‘పండు మిర్చిలో విటమిన్ ఎ, బి, సి వంటివి పుష్కలంగా ఉంటాయి. అలాగే కేన్సర్‌తో పోరాడే ఔషద గుణాలు ఉంటాయి.
కరివేపాకులో విటమిన్ ఎ, బి, సి, ఇ వంటివి ఉంటాయి. కంటికి, జుట్టుకి మంచిది. ఎముకల ఆరోగ్యానికి కూడా కరివేపాకు బెస్ట్. అందుకే ఆహారం ఆరంభమే ఆరోగ్యంగా ఆరంభించాలని ఈ స్టార్టర్స్ చేశాను’’ అని వివరించారు ఉష. రైస్ ఐటమ్స్‌లో పుదీనా మాంసం పులావ్, చికెన్ ఫ్రైడ్ రైస్, పండుమిర్చి కోడి పులావ్ చేశారు. ‘‘పుదీనాకి మంచి వాసన ఉంటుంది. దాంతోపాటు రుచి కూడా బాగుంటుంది.
అలాగే ఆహారం జీర్ణం కావడానికి పుదీనా మంచిది. ఐరన్ పుష్కలంగా ఉన్న పుదీనాని మీరు రోజూ తీసుకోవచ్చు. మనలో చాలామందికి రోజూ టీ తాగే అలవాటు ఉంటుంది. ఆ టీలో కొన్ని పుదీనా ఆకులు వేసుకుని, తాగి చూడండి. మీకే తేడా తెలుస్తుంది. ఇక నాన్‌వెజ్ తినేవారికి చికెన్‌లో ఎన్ని పోషక పదార్థాలు ఉన్నాయో తెలిసిందే’’ అని పేర్కొన్నారామె. మాంసాహారం మాత్రమే కాదు... శాకాహారం కూడా చేశారు ఉష. వెజ్‌లో కరివేపాకు వెజ్ పులావ్, పండుమిర్చి పనీర్ పలావ్, కర్డ్ రైస్ చేశారు.
‘‘కరివేపాకు, పండుమిర్చి ఎంత మంచిదో ముందే చెప్పాను. పనీర్ మంచి ప్రోటీన్ ఫుడ్. నాన్‌వెజ్ తినేవారికి మాంసం రూపంలో ప్రోటీన్లు అందుతాయి. వెజిటేరియన్స్‌కి పనీర్ బెస్ట్. పనీర్‌లో తక్కువ కార్బోహైడ్రేట్స్... ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. ఇక మన ఇండియన్స్‌లో చాలామందికి ఫైనల్‌గా పెరుగన్నం తింటేనే సంతృప్తిగా ఉంటుంది. పెరుగులో కావాల్సినంత కాల్షియం ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పొట్ట చల్లగా ఉండటానికి పెరుగన్నం కూడా చేశాను’’ అని తెలిపారు ఉష మూల్పూరి.
ఎనిమిది పదుల వయసులవాళ్లకూ...
‘‘మనం ఆహారం తీసుకున్నాక పొట్ట బరువుగా ఉండకూడదు. తేలికగా అనిపించాలి. ఫుడ్ బిజినెస్ ఆరంభించాలనుకున్నప్పుడు నా మెయిన్ టార్గెట్ ఇదే. మా రెస్టారెంట్‌కి ఎనభై ఏళ్ల వయసు, ఆ పైన ఉన్నవాళ్లు కూడా వస్తారు. ‘పొట్ట చాలా తేలికగా ఉందమ్మా’ అని వారు చెప్పినప్పుడు హ్యాపీగా ఉంటుంది’’ అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు.
సెలబ్రిటీలకూ...
‘‘మా కిచెన్ వంటకాలను ఎన్టీఆర్, రామ్‌చరణ్, ఉపాసన, కృష్ణారెడ్డి, హరీష్ శంకర్, బాబీ, బుచ్చిబాబు, కోటి, మెగా కృష్ణారెడ్డి, నందినీ రెడ్డిగార్లు వంటివారు ఇష్టపడతారు. మా దగ్గర బ్రొకోలీ కాషూనట్ చిల్లీ గార్లిక్ ఫేమస్. ఇవి ఎక్కువగా తెప్పించుకుంటారు’’ అని చెప్పారు ఉష.
అవగాహన పెంచుకోవాలి
‘‘నేను రెస్టారెంట్ పెట్టాలనుకున్నప్పుడు నాకు పెద్దగా ఏమీ తెలియదు. జీతాలిచ్చి మనుషులను పెట్టుకుని, వాళ్లతో చేయించేయొచ్చు. కానీ అందులో పరిపూర్ణత ఉండదు. వంటకు కావల్సినవి కొనడం నుంచి వాటిని సరిగ్గా శుభ్రం చేసి వండటం వరకూ అన్నింటినీ దగ్గరుండి చేయించేదాన్ని. ‘సర్వ మత సమ్మేళనం’ అంటారు... ‘సర్వ ఆహారం సమ్మేళనం’ అంటాను.
రెస్టారెంట్ అంటే రకరకాల వాళ్లు వస్తారు. వాళ్లకి తగ్గట్టుగా ఉండాలి కదా. నా కుటుంబ సభ్యులకు వండుతున్నట్లుగా భావించి వంట చేయిస్తాను. వీలున్నప్పుడల్లా అన్ని టేబుల్స్ దగ్గరికి వెళ్లి, అందర్నీ పలకరిస్తుంటాను. ‘మాకు ఇంటికి వచ్చినట్లుగా ఉంది’ అని అంటుంటారు. అందరికీ ‘సాక్షి’ ద్వారా థ్యాంక్స్ చెబుతున్నాను’’ అంటూ ముగించారు ఉష.
– డి.జి. భవాని
(చదవండి: నీ రీప్లేస్‌మెంట్ రోబో: సు'నీ'శితంగా శస్త్రచికిత్స)
Comments
Please login to add a commentAdd a comment