అప్పుడే ఏడుస్తూ... అంతలోనే నవ్వుతూ!
మెడిక్షనరీ
ఎవరిలోనైనా భావోద్వేగాలు అప్పటికప్పుడే మారిపోతూ కనిపిస్తున్నాయా? అప్పుడే నవ్వుతూ కనిపించిన వాడు, అంతలోనే ఏడుస్తున్నాడా? పరస్పర విరుద్ధమైన ఈ ఫీలింగ్స్‌ను అతడు నియంత్రించుకోలేకపోతున్నాడా? ఎంతగా ప్రయత్నించినా ఈ ఏడుపూ, నవ్వూ... ఈ రెండింటినీ ఆపుకోలేకపోతున్నాడా? అయితే... అతడు ‘సూడో బల్బులార్ ఎఫెక్ట్’ అనే జబ్బుతో బాధపడుతుండవచ్చేమోనని అనుమానించాలి. ఇదో రకం నరాల రుగ్మత.
ఇందులో రోగి తన ప్రమేయం లేకుండానే నవ్వుతుంటాడు. అంతలోనే ఏడుస్తుంటాడు. లేదా వెంటవెంటనే ఈ రెండూ చేస్తుంటాడు. చిత్రమేమిటంటే... ఏదైనా విషాదవార్త విన్నప్పుడు నవ్వుతుండవచ్చు. లేదా నవ్వాల్సిన చోట ఏడ్వవచ్చు. ఇవన్నీ తాను అనుకోకపోయినా జరుగుతుండవచ్చు. ఇలా తన భావోద్వేగాల మీద తనకే అదుపు లేకపోవడంతో సామాజికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంటాడు. ఇలాంటి రోగుల విషయంలో డాక్టర్లకు రోగికి చికిత్స కంటే ముందుగా అతడి ప్రవర్తన గురించి కుటుంబ సభ్యులకుఅవగాహన కల్పించాల్సి వస్తుంది. కొన్ని మందులతో దీనికి చికిత్స కూడా అందుబాటులో ఉంది.