పతకాలు సరే... ‘పసితనం’ సంగతేంటి?
అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో చైనాను మించిన దేశం మరొకటి లేదంటే అతిశయోక్తి కాదేమో. ఆర్థిక సంస్కరణలతో అభివృద్ధిలో దూసుకుపోతున్న ఆ దేశం, ఇప్పుడు ఒక్కో అగ్ర రాజ్యాన్ని వెనక్కి నెట్టేస్తోంది. అన్నింటా తానే ముందుండాలని లక్ష్యం పెట్టుకున్న చైనా ఇప్పుడు మరో అడుగు ముందుకు వేయాలనే దిశగా సాగుతోంది. ఒలింపిక్స్‌లో కాకలు తీరిన దేశాలకు చెక్ పెట్టి పతకాల పట్టికలో స్థిరంగా ఆధిపత్యాన్ని చాటాలన్నదే దానికి ఏకైక లక్ష్యం. దాన్ని చేరుకునేందుకు ఎంతో శ్రమిస్తోంది. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆ దిశగా దూసుకెళుతోంది. అమెరికా, రష్యా, బ్రిటన్, ఆస్ట్రేలియా లాంటి పతకాలు కొల్లగొట్టే దేశాలను వెనక్కి నెట్టేస్తోంది. అన్ని రంగాల్లోలాగే క్రీడల్లోనూ ఎప్పటికీ సూపర్ పవర్ అని నిరూపించుకోవాలనుకుంటోంది.
- శ్యామ్ తిరుక్కోవళ్లూరు
ప్రపంచ క్రీడల్లో చైనా తిరుగులేని ఆధిపత్యం సాధనకు చేరువైంది. ఒలింపిక్స్‌లో అమెరికాను సవాల్ చేస్తోంది. దీనికోసం చిన్నప్పటి నుంచే పిల్లలకు కఠినమైన శిక్షణను ఇస్తున్నారు. అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారు. ఇవన్నీ నాణేనికి ఒకవైపే. రెండో వైపు చూస్తే... ఐదారేళ్ల పిల్లాడిని శారీరకంగా హింసిస్తున్నారు. అసలు ఆ ఆట ఎందుకు ఆడాలో తెలియని పిల్లల్ని కూడా బలవంతంగా క్రీడల్లోకి దించుతున్నారు. అసలు చైనాలో ఏం జరుగుతోంది..?
50వ దశకంలోనే...
లక్ష్యాన్ని చేరుకోవడం అంత సులువు కాదు. అందుకు తగ్గ సాధన ఉండాలి. అప్పుడే అంతర్జాతీయంగా మంచి ఫలితాలు సాధించవచ్చు. ఈ విషయాన్ని చైనా 50వ దశకంలోనే గ్రహించింది. ఓ వైపు దేశం ఆర్థిక సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నా ఏమాత్రం వెనకడుగు వేయకుండా పెద్ద లక్ష్యాన్ని ఎంచుకుంది. అనుకున్నదే తడవుగా దేశంలో క్రీడా పాఠశాలలను స్థాపించింది. ఆ క్రీడా బీజాలు ఇప్పుడు ఇంతింతై అన్నట్లు అద్భుతమైన క్రీడాకారులను దేశానికి అందిస్తున్నాయి. చైనాలో మూడు వేలకు పైగా స్పోర్ట్స్ స్కూళ్లు ఉన్నాయి. ప్రతీ జిల్లాలో ఒక స్పోర్ట్స్ స్కూల్ ఉందంటే టాలెంట్‌ను చైనా ఏ రకంగా ఒడిసిపడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జిమ్నాస్టిక్స్, బ్యాడ్మింటన్, వాలీబాల్, అథ్లెటిక్స్, ఫెన్సింగ్, స్విమ్మింగ్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్ లాంటి క్రీడాంశాల్లో పిల్లలకు శిక్షణ ఇస్తారు. ఇందులో మంచి ప్రతిభ కనబర్చిన వారిని ప్రొఫెషనల్ స్కూల్స్‌కు పంపిస్తారు. పతకాలు సాధిస్తారని అంచనాకు వచ్చిన తర్వాతే క్రీడాకారులను జాతీయ జట్టుకు ఎంపిక చేస్తారు. ఆ మెరికల్లాంటి క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపై ఎలా రాణిస్తారో చూస్తూనే ఉన్నాం.
కష్టమే విస్తుపోయేలా...
మెరికల్లాంటి క్రీడాకారులను తయారు చేయడంలో చైనా తీరే వేరు. నాలుగు నుంచి ఆరేళ్ల వయసున్న పిల్లలకు చైనా స్పోర్ట్స్ స్కూళ్లలో శిక్షణ ఇస్తారు. ఉదయం 6.30కు మొదలయ్యే శిక్షణ పలు దఫాలుగా కొనసాగుతూ రాత్రి 9.30 గంటలకు ముగుస్తుంది. మధ్యలో పిల్లలకు విద్యాబుద్ధులు కూడా నేర్పుతారు. అయితే స్పోర్ట్స్ స్కూళ్లలో విద్యకు అంతగా ప్రాధాన్యత ఉండదు. కంటితుడుపు మాత్రమే. కోచ్‌ల దృష్టంతా శిక్షణపైనే. వారిచ్చే శిక్షణ కఠినాతి కఠినంగా ఉంటుంది. చిన్నారులను స్ప్రింగుల్ని వంచినట్లుగా వంచేస్తారు. పిల్లల భుజాలపైకి కోచ్‌లు ఎక్కేస్తారు. పిల్లల కాళ్లను తొక్కేస్తారు. ఏడ్చినా పట్టించుకోరు. ఒకానొక సమయంలో వారికిచ్చేది ‘శిక్ష’ణేనా అనిపిస్తుంది. వారిని దారిలోకి తెచ్చేందుకు తిడతారు. అవసరమైతే భయపెడతారు. ఇదంతా శిక్షణలో భాగమే. ఇక పిల్లలు ఆరంభంలో శిక్షణ తీసుకోవడంలో నానాకష్టాలు పడ్డా కొద్ది రోజుల్లోనే వారు అలవాటు పడిపోతారు.
ఇదేం ‘శిక్ష’ణ?
స్పోర్ట్స్ స్కూళ్లతో చైనా మంచి ఫలితాలు సాధిస్తున్నా.. అక్కడ ఇచ్చే శిక్షణపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. పిల్లలకు సాధన ఇచ్చే తీరును చాలా దేశాలు తప్పు పడుతున్నాయి. శిక్షణ పద్ధతులను మార్చుకోవాల్సిందిగా సూచిస్తున్నాయి. పిల్లలకు ఇచ్చేది శిక్షణా లేక శిక్షా అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. కొందరైతే పిల్లల్ని పశువుల్లా చూస్తున్నారంటూ మండిపడుతున్నారు. అయితే చైనాలో మాత్రం ఈ తరహా శిక్షణపై తల్లిదండ్రుల నుంచి ఎటువంటి వ్యతిరేకత రావడం లేదు. దేశానికి తమ ఇంటి నుంచి క్రీడాకారుడిని అందించినట్లుగానే భావిస్తారట.
పతకాలు సాధించని వారి సంగతేంటి...?
చైనా స్పోర్ట్స్ స్కూళ్లలో కొన్ని వేల మందికి శిక్షణనిస్తారు. అయితే వారిలో పతకాలు సాధించే వరకు వెళ్లేవారు వందల సంఖ్యలోనే ఉంటారు. దేశానికి పతకాలు సాధించే వారికి అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. స్పాన్సర్లు వారి వెంట పడతారు. మరి పతకాలు సాధించలేని వారికి, స్పోర్ట్స్ స్కూళ్ల నుంచి మధ్యలోనే తిరిగొచ్చిన వారి పరిస్థితి ఏంటి ? ఈ ప్రశ్నకు సరైన సమాధానం లేదు. ఎందుకంటే స్పోర్ట్స్ స్కూళ్ల నుంచి బయకొచ్చిన వారికి క్రీడల గురించి తప్ప మరే ప్రావీణ్యం ఉండదు. ఇక పతకాలు సాధించలేని వారికి స్థానిక స్పోర్ట్స్ కమిషన్లు కొన్ని సార్లు ఉద్యోగాలు కల్పిస్తాయి. ఒకవేళ ఉద్యోగం దొరక్కపోతే ఫ్యాక్టరీల్లో శ్రామికులుగా స్థిరపడిపోతున్నారు. ఇలా 80 శాతం మంది చైనాలో క్రీడాకారులు నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారు. పేదరికంలో మగ్గిపోతున్నారు. అపరిమితమైన సాధన కారణంగా చాలా మంది ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు.
పతకం దక్కాలంటే తప్పదు మరి..!
ఓ వైపు చైనా శిక్షణపై విమర్శలు వస్తున్నా... క్రీడాకారులు మాత్రం పతకం సాధించడానికి ఇదే సరైన విధానమంటున్నారు. ‘ఈ స్థాయిలో శిక్షణ తీసుకుంటేనే అంతర్జాతీయంగా విజయం సాధిస్తాం. నేను కూడా స్పోర్ట్స్ స్కూల్‌లో కఠినమైన శిక్షణనే తీసుకున్నా. బంగారు పతకం సాధించడానికి ఈ శిక్షణే కారణమైంది’ అని లండన్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, స్విమ్మర్ యె షివెన్ చెప్పింది.