- పారిశ్రామికవేత్తలకు మంత్రి జూపల్లి పిలుపు
- ‘వైబ్రంట్ గుజరాత్’లో తెలంగాణ స్టాల్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని అమలుచేస్తున్నతెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల తో రావలసిందిగా జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను రాష్ట్ర పరిశ్రమల మంత్రి జూపల్లి కృష్ణారావు ఆహ్వానించారు. గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్‌లోని మహాత్మామందిర్ కన్వెన్షన్ సెంటర్‌లో ఆదివారం ప్రారంభమైన ‘7వ వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్’ కార్యక్ర మానికి సోమవారం హాజరైన ఆయన అక్కడ ఏర్పాటు చేసిన తెలంగాణ పరిశ్రమల స్టాల్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో పెట్టుబడులకు భద్రతను కల్పించడంతో పాటు ఆకర్షణీయమైన లాభాలకు అనువుగా ఉండే పారిశ్రామిక విధానం ఉందన్నారు.
స్పెషల్ చేజింగ్ సెల్ ద్వారా ఒక్క దరఖాస్తుతో పరిశ్రమలకు అన్ని రకాల అనుమతులిచ్చేలా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని చెప్పారు. తెలంగాణలో ఉన్న ప్రభుత్వ నాయకత్వం కూడా పెట్టుబడుదారులకు అండగా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానం బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గుజరాత్‌తో పాటు దేశంలోని పారిశ్రామికవేత్తలు, అమెరికా, ఇజ్రాయిల్, చైనా, సింగపూర్, స్వీడన్, జపాన్ తదితర దేశాల ప్రతి నిధులు పాల్గొన్నారు.
పారిశ్రామికవేత్తలతో సమావేశం
గుజరాత్‌లో జరుగుతున్న సమ్మిట్‌లో పాల్గొన్న పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం మధ్యాహ్నం గుజరాత్‌లోని ప్రముఖ పరిశ్రమలైన కల్పతరు ట్రాన్స్‌మిషన్ కంపెనీ, సహజానంద లేజర్ టెక్నాలజీస్‌ను సందర్శించి ఆయా పరిశ్రమల తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. ఈ రెండు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. కాగా సాయంత్రం తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు ఆసక్తి చూపిన పారిశ్రామిక వేత్తలతో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. మంత్రి వెంట ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ప్రదీప్ చంద్ర, ఫ్యాప్సీ, ఇతర పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు ఉన్నారు.