the Olympics
-
అనంతలో షూటింగ్ సందడి
అనంతపురం కల్చరల్: ‘ప్రత్యక్షదైవం షిరిడీ సాయిబాబా’ సినిమా షూటింగ్ నగరంలోని పలుచోట్ల సందడిగా జరిగింది. గురువారం ఉదయం స్థానిక మూడో రోడ్డులోని సాయిబాబా మందిరంలో చిత్రంలోని ఓ పాటను ప్రధాన పాత్రధారులపై చిత్రీకరించారు. రాష్ట్ర ఒలపింక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జేసీ పవన్‌కుమార్‌రెడ్డి క్లాప్ కొట్టి షూటింగ్‌ను ప్రారంభించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో చిత్ర దర్శకుడు కొండవీటి సత్యం, మచ్చా రామలింగారెడ్డి తదితరులు చిత్ర విశేషాలు తెలియజేశారు. శ్రీ దత్త క్రియేషన్ బ్యానర్‌పై ఈ చిత్రం తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో నిర్మాణమవుతోందన్నారు. స్థానిక కళాకారులకు అవకాశమివ్వడం కోసం అనంతలో చిత్ర షూటింగ్ జరిపామన్నారు. 3,4 తేదీల్లో పెన్నోహబిళం తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుందని, జూలైలో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మందిరం నిర్వాహకులు గంగిరెడ్డి, కార్పొరేటర్ లక్ష్మీరెడ్డి, సీనియర్ నటులు కొండయ్య, తరిమెల రాజు, వన్నూర్కుమార్ పాల్గొన్నారు. -
దేశం కోసం... పతకం, ప్రాణం...
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటిదాకా ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే 1939 నుంచి 1945 వరకు ఆరేళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన రెండో ప్రపంచ యుద్ధం రక్తపాతాన్ని సృష్టించింది. రక్తం ఏరులై పారిన ఈ యుద్ధంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కొందరు శాశ్వత వైకల్యం పొందారు. అయితే ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో తమ దేశానికి పతకాలు అందించిన ఒలింపియన్లు కూడా ఉన్నారు. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. ఒలింపిక్స్‌లో పాల్గొని తమ దేశ ఖ్యాతిని అంతర్జాతీయంగా రెపరెపలాడించిన క్రీడాకారులు దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడారు.. స్ఫూర్తిని నింపిన అలాంటి వారిలో కొందరి గురించి తెలుసుకుందాం... ఫాయ్ డ్రాపర్.. అమెరికా అథ్లెట్... ఒలింపిక్స్‌లో అమెరికా జాతీయ పతకం రెపరెపలాడించడంలో తనవంతు పాత్ర పోషించాడు. 1936లో బెర్లిన్ ఆతిథ్యమిచ్చిన ఒలింపిక్స్‌లో స్టార్ అథ్లెట్ జెస్సీ ఒవెన్స్తో కలిసి 4ఁ100 మీటర్ల రిలేలో బంగారు పతకం అందించాడు. ఈ ఒలింపిక్స్ ముగిసిన రెండేళ్ల తర్వాత రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. అప్పటికే అమెరికా రక్షణ దళంలో ఆర్మీ ఎయిర్ కార్ప్స్ పెలైట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. 1943లో శత్రుదేశాల దాడిలో... 32 ఏళ్లకే డ్రాపర్ ప్రాణాలు విడిచాడు. కార్ల్ లుజ్ లాంగ్... ఒలింపిక్ లాంగ్ జంపర్.. జర్మనీ ఆర్మీలో ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహించిన లాంగ్ 1943లో ఆర్మీ చేపట్టిన చర్యలో మరణించాడు. 30 ఏళ్లకే అసువులు బాసిన లాంగ్‌ను... అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) 1964లో డి కూబర్టిన్ మెడల్‌తో (క్రీడాస్ఫూర్తి ప్రదర్శిం చినందుకు) సత్కరించింది. 1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో లాంగ్ రజత పతకం సాధించాడు. నిజానికి ఆ ఒలింపిక్స్‌లో లాంగ్ జంప్‌లో లుజ్ లాంగే స్వర్ణం గెలవాల్సింది. కానీ తన ప్రత్యర్థి, అమెరికా లాంగ్ జంపర్ జెస్సీ ఒవెన్స్ తడబాటుకు గురవడంతో ఫైనల్ చేరేందుకు సలహాలు ఇచ్చాడు. లాంగ్ ఇచ్చిన సలహాతో ఫైనల్స్‌లో ఒవెన్స్ సత్తా చాటాడు. లాంగ్‌ను వెనక్కినెట్టి బంగారు పతకం గెల్చుకున్నాడు. టకిచి నిషి.... 1932 లాస్‌ఎంజిలిస్ ఒలింపిక్స్‌లో జపాన్ తరఫున ఈక్వెస్ట్రియన్ వ్యక్తిగత జంపింగ్ విభాగంలో పాల్గొని స్వర్ణం సాధించాడు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 1945లో ఇవో జిమా ఐలాండ్‌లో అమెరికా- జపాన్ సైన్యాల మధ్య యుద్ధం జరిగింది. జపాన్ ఆర్మీలో కల్నల్ హోదాలో ఉన్న టకిచి నిషి యుద్ధంలో పాల్గొన్నాడు. అమెరికా సేనలు జరిపిన దాడిలో నిషి మరణించాడు. జూలీ దర్శకత్వంలో జంపరిని జీవిత గాథ... లూయిస్ జంపరిని (అమెరికా)... ప్రస్తుత వయసు 97. లాంగ్ డిస్టెన్స్ రన్నర్ అయిన జంపరిని 1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో పాల్గొన్నాడు. పతకం చేజారినా జంపరిని తన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ నుంచి ప్రశంసలు కూడా పొందాడు. ఆ తర్వాత అమెరికా వాయుసేనలో చేరిన జంపరిని రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాడు. పసిఫిక్ మహాసముద్రంలో అమెరికా యుద్ధవిమానం కూలిపోవడం... శకలాల సాయంతో 47 రోజుల పాటు సముద్రంలోనే గడపడం.. ఆ తర్వాత యుద్ధ ఖైదీగా పట్టుబడటం... అష్టకష్టాలు పడి చివరికి క్షేమంగా బయటపడటం.. ఇదే ఇతివృత్తంగా హాలీవుడ్ స్టార్ అంజె లీనా జూలీ ‘అన్ బ్రోకెన్’ అనే సినిమాకు దర్శకత్వం వహించింది. ఈ సినిమా ఇదే ఏడాది విడుదలయ్యే అవకాశాలున్నాయి. చార్లెస్ పదోక్... అమెరికా ట్రిపుల్ ఒలింపియన్...మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో యూఎస్ మెరైన్స్లో లెఫ్టినెంట్‌గా బాధ్యతలు చేపట్టి దేశం కోసం పోరాడాడు. ఆ తర్వాత చదువుపై ఆసక్తి కనబరిచి... చివరికి క్రీడలపై దృష్టిపెట్టాడు... స్ప్రింటర్‌గా భేష్ అనిపించుకున్న పదోక్... ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో హీరోగా మారిపోయాడు. 20 ఏళ్లకే ఒలింపిక్స్‌లో అడుగుపెట్టిన పదోక్ 1920 ఆంట్వెర్ప్ (బెల్జియం) ఒలింపిక్స్‌లో 100 మీటర్లు, 4ఁ100 మీటర్ల రిలేలో బంగారు పతకాలు సాధించాడు. అంతేకాదు 200 మీటర్ల పరుగులో రజతం కైవసం చేసుకున్నాడు. తదుపరి 1924 పారిస్ ఒలింపిక్స్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. 200 మీటర్ల పరుగులో రజత పతకం కైవసం చేసుకున్నాడు. ఇక 1928 ఒలింపిక్స్‌లో పాల్గొన్నా పతకం మాత్రం దక్కలేదు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 1943లో సిట్కా (అలస్కా) సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో మేజర్ జనరల్ విలియమ్‌తో కలిసి ప్రాణాలు విడిచాడు. -
పతకాలు సరే... ‘పసితనం’ సంగతేంటి?
అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో చైనాను మించిన దేశం మరొకటి లేదంటే అతిశయోక్తి కాదేమో. ఆర్థిక సంస్కరణలతో అభివృద్ధిలో దూసుకుపోతున్న ఆ దేశం, ఇప్పుడు ఒక్కో అగ్ర రాజ్యాన్ని వెనక్కి నెట్టేస్తోంది. అన్నింటా తానే ముందుండాలని లక్ష్యం పెట్టుకున్న చైనా ఇప్పుడు మరో అడుగు ముందుకు వేయాలనే దిశగా సాగుతోంది. ఒలింపిక్స్‌లో కాకలు తీరిన దేశాలకు చెక్ పెట్టి పతకాల పట్టికలో స్థిరంగా ఆధిపత్యాన్ని చాటాలన్నదే దానికి ఏకైక లక్ష్యం. దాన్ని చేరుకునేందుకు ఎంతో శ్రమిస్తోంది. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆ దిశగా దూసుకెళుతోంది. అమెరికా, రష్యా, బ్రిటన్, ఆస్ట్రేలియా లాంటి పతకాలు కొల్లగొట్టే దేశాలను వెనక్కి నెట్టేస్తోంది. అన్ని రంగాల్లోలాగే క్రీడల్లోనూ ఎప్పటికీ సూపర్ పవర్ అని నిరూపించుకోవాలనుకుంటోంది. - శ్యామ్ తిరుక్కోవళ్లూరు ప్రపంచ క్రీడల్లో చైనా తిరుగులేని ఆధిపత్యం సాధనకు చేరువైంది. ఒలింపిక్స్‌లో అమెరికాను సవాల్ చేస్తోంది. దీనికోసం చిన్నప్పటి నుంచే పిల్లలకు కఠినమైన శిక్షణను ఇస్తున్నారు. అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారు. ఇవన్నీ నాణేనికి ఒకవైపే. రెండో వైపు చూస్తే... ఐదారేళ్ల పిల్లాడిని శారీరకంగా హింసిస్తున్నారు. అసలు ఆ ఆట ఎందుకు ఆడాలో తెలియని పిల్లల్ని కూడా బలవంతంగా క్రీడల్లోకి దించుతున్నారు. అసలు చైనాలో ఏం జరుగుతోంది..? 50వ దశకంలోనే... లక్ష్యాన్ని చేరుకోవడం అంత సులువు కాదు. అందుకు తగ్గ సాధన ఉండాలి. అప్పుడే అంతర్జాతీయంగా మంచి ఫలితాలు సాధించవచ్చు. ఈ విషయాన్ని చైనా 50వ దశకంలోనే గ్రహించింది. ఓ వైపు దేశం ఆర్థిక సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నా ఏమాత్రం వెనకడుగు వేయకుండా పెద్ద లక్ష్యాన్ని ఎంచుకుంది. అనుకున్నదే తడవుగా దేశంలో క్రీడా పాఠశాలలను స్థాపించింది. ఆ క్రీడా బీజాలు ఇప్పుడు ఇంతింతై అన్నట్లు అద్భుతమైన క్రీడాకారులను దేశానికి అందిస్తున్నాయి. చైనాలో మూడు వేలకు పైగా స్పోర్ట్స్ స్కూళ్లు ఉన్నాయి. ప్రతీ జిల్లాలో ఒక స్పోర్ట్స్ స్కూల్ ఉందంటే టాలెంట్‌ను చైనా ఏ రకంగా ఒడిసిపడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జిమ్నాస్టిక్స్, బ్యాడ్మింటన్, వాలీబాల్, అథ్లెటిక్స్, ఫెన్సింగ్, స్విమ్మింగ్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్ లాంటి క్రీడాంశాల్లో పిల్లలకు శిక్షణ ఇస్తారు. ఇందులో మంచి ప్రతిభ కనబర్చిన వారిని ప్రొఫెషనల్ స్కూల్స్‌కు పంపిస్తారు. పతకాలు సాధిస్తారని అంచనాకు వచ్చిన తర్వాతే క్రీడాకారులను జాతీయ జట్టుకు ఎంపిక చేస్తారు. ఆ మెరికల్లాంటి క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపై ఎలా రాణిస్తారో చూస్తూనే ఉన్నాం. కష్టమే విస్తుపోయేలా... మెరికల్లాంటి క్రీడాకారులను తయారు చేయడంలో చైనా తీరే వేరు. నాలుగు నుంచి ఆరేళ్ల వయసున్న పిల్లలకు చైనా స్పోర్ట్స్ స్కూళ్లలో శిక్షణ ఇస్తారు. ఉదయం 6.30కు మొదలయ్యే శిక్షణ పలు దఫాలుగా కొనసాగుతూ రాత్రి 9.30 గంటలకు ముగుస్తుంది. మధ్యలో పిల్లలకు విద్యాబుద్ధులు కూడా నేర్పుతారు. అయితే స్పోర్ట్స్ స్కూళ్లలో విద్యకు అంతగా ప్రాధాన్యత ఉండదు. కంటితుడుపు మాత్రమే. కోచ్‌ల దృష్టంతా శిక్షణపైనే. వారిచ్చే శిక్షణ కఠినాతి కఠినంగా ఉంటుంది. చిన్నారులను స్ప్రింగుల్ని వంచినట్లుగా వంచేస్తారు. పిల్లల భుజాలపైకి కోచ్‌లు ఎక్కేస్తారు. పిల్లల కాళ్లను తొక్కేస్తారు. ఏడ్చినా పట్టించుకోరు. ఒకానొక సమయంలో వారికిచ్చేది ‘శిక్ష’ణేనా అనిపిస్తుంది. వారిని దారిలోకి తెచ్చేందుకు తిడతారు. అవసరమైతే భయపెడతారు. ఇదంతా శిక్షణలో భాగమే. ఇక పిల్లలు ఆరంభంలో శిక్షణ తీసుకోవడంలో నానాకష్టాలు పడ్డా కొద్ది రోజుల్లోనే వారు అలవాటు పడిపోతారు. ఇదేం ‘శిక్ష’ణ? స్పోర్ట్స్ స్కూళ్లతో చైనా మంచి ఫలితాలు సాధిస్తున్నా.. అక్కడ ఇచ్చే శిక్షణపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. పిల్లలకు సాధన ఇచ్చే తీరును చాలా దేశాలు తప్పు పడుతున్నాయి. శిక్షణ పద్ధతులను మార్చుకోవాల్సిందిగా సూచిస్తున్నాయి. పిల్లలకు ఇచ్చేది శిక్షణా లేక శిక్షా అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. కొందరైతే పిల్లల్ని పశువుల్లా చూస్తున్నారంటూ మండిపడుతున్నారు. అయితే చైనాలో మాత్రం ఈ తరహా శిక్షణపై తల్లిదండ్రుల నుంచి ఎటువంటి వ్యతిరేకత రావడం లేదు. దేశానికి తమ ఇంటి నుంచి క్రీడాకారుడిని అందించినట్లుగానే భావిస్తారట. పతకాలు సాధించని వారి సంగతేంటి...? చైనా స్పోర్ట్స్ స్కూళ్లలో కొన్ని వేల మందికి శిక్షణనిస్తారు. అయితే వారిలో పతకాలు సాధించే వరకు వెళ్లేవారు వందల సంఖ్యలోనే ఉంటారు. దేశానికి పతకాలు సాధించే వారికి అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. స్పాన్సర్లు వారి వెంట పడతారు. మరి పతకాలు సాధించలేని వారికి, స్పోర్ట్స్ స్కూళ్ల నుంచి మధ్యలోనే తిరిగొచ్చిన వారి పరిస్థితి ఏంటి ? ఈ ప్రశ్నకు సరైన సమాధానం లేదు. ఎందుకంటే స్పోర్ట్స్ స్కూళ్ల నుంచి బయకొచ్చిన వారికి క్రీడల గురించి తప్ప మరే ప్రావీణ్యం ఉండదు. ఇక పతకాలు సాధించలేని వారికి స్థానిక స్పోర్ట్స్ కమిషన్లు కొన్ని సార్లు ఉద్యోగాలు కల్పిస్తాయి. ఒకవేళ ఉద్యోగం దొరక్కపోతే ఫ్యాక్టరీల్లో శ్రామికులుగా స్థిరపడిపోతున్నారు. ఇలా 80 శాతం మంది చైనాలో క్రీడాకారులు నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారు. పేదరికంలో మగ్గిపోతున్నారు. అపరిమితమైన సాధన కారణంగా చాలా మంది ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. పతకం దక్కాలంటే తప్పదు మరి..! ఓ వైపు చైనా శిక్షణపై విమర్శలు వస్తున్నా... క్రీడాకారులు మాత్రం పతకం సాధించడానికి ఇదే సరైన విధానమంటున్నారు. ‘ఈ స్థాయిలో శిక్షణ తీసుకుంటేనే అంతర్జాతీయంగా విజయం సాధిస్తాం. నేను కూడా స్పోర్ట్స్ స్కూల్లో కఠినమైన శిక్షణనే తీసుకున్నా. బంగారు పతకం సాధించడానికి ఈ శిక్షణే కారణమైంది’ అని లండన్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, స్విమ్మర్ యె షివెన్ చెప్పింది. -
వాళ్లది ‘కామ్’ లవ్‌స్టోరీ
ప్రతి మగాడి విజయం వెనక ఓ స్త్రీ ఉంటుందంటారు... మరి స్త్రీ విజయం వెనక ఓ మగాడు ఉండి తీరాలి కదా... లాజిక్ ప్రకారమే కాదు... వాస్తవం కూడా అదేనంటోంది మేరీకామ్. భారత స్టార్ బాక్సర్, ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళా బాక్సర్ మేరీకామ్... తన విజయాలన్నీ వాళ్లాయన ఓన్లర్ పుణ్యమేనంటోంది. మేరీకామ్ది కూడా ప్రేమ వివాహం. అది 2000వ సంవత్సరం... ఓన్లర్కామ్... ఢిల్లీ యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడు. తమ ప్రాంతానికి చెందిన వాళ్లందరికీ సాయం చేస్తాడని మంచి పేరు. మేరీ 19 ఏళ్ల బాక్సర్. మణిపూర్ నుంచి భవిష్యత్‌లో వెలుగులోకి వస్తుందని బాక్సింగ్ కమ్యూనిటీ నమ్మిన అమ్మాయి. బెంగళూరులో జరిగే జాతీయ బాక్సింగ్ శిబిరం కోసం ట్రెయిన్లో వెళుతుండగా మేరీ సూట్‌కేస్ పోయింది. డబ్బు, పాస్‌పోర్ట్ అందులో ఉన్నాయి. నెల రోజుల్లోనే విదేశాలకు వెళ్లి బాక్సింగ్ పోటీల్లో పాల్గొనాలి. ఎలా? అన్యమస్కంగా క్యాంప్‌ను ముగించుకుని ఢిల్లీ చేరింది. అక్కడెవరో చెప్పారు. ‘ఓన్లర్ అని మన ప్రాంతం వ్యక్తే. అందరికీ సాయం చేస్తాడు. ప్రస్తుతం ఇక్కడే ఢిల్లీలో ఉన్నాడు. ఓసారి కలువు’. నెహ్రూ స్టేడియంలో మేరీ ప్రాక్టీస్ చేస్తోంది. ఓ స్నేహితుడిని కలవడానికి ఓన్లర్ అక్కడకి వచ్చాడు. మేరీకామ్ ప్రాక్టీస్ చేస్తుంటే చూశాడు. ఆమె పంచ్ పవర్‌ని గమనించాడు. ‘ఫర్వాలేదు... భవిష్యత్ ఉంది’ అనుకున్నాడు. పది నిమిషాల తర్వాత మేరీ ఓన్లర్ దగ్గరకి వచ్చింది. ‘నా పాస్‌పోర్ట్ పోయింది. కాస్త తొందరగా తెచ్చుకోవడానికి సహాయం చేస్తారా?’ అని అడిగింది. ఆ రోజు స్నేహం మొదలైంది. ఐదేళ్లు గడిచాయి. ఈలోగా ఎప్పుడు ఇద్దరి మధ్య ప్రేమ మొదలైందో తెలియదు. ఒక రోజు ఓన్లర్ వచ్చి ‘మేరీ... విల్ యూ మ్యారీ మీ’ అని అడిగాడు. అప్పటికే తన గుండెల్లో ఉన్న వ్యక్తి నుంచి ఈ ప్రతిపాదన వస్తే ఎవరైనా ఏం చేస్తారు..? మేరీ కూడా అదే చేసింది. మార్చి, 2005... ఓన్లర్ కామ్, మేరీకామ్ల పెళ్లయింది. బాక్సింగ్ కమ్యూనిటీ పెదవి విరిచింది. ‘ఇక ఓ గొప్ప బాక్సర్ కెరీర్ ముగిసిపోయింది. పెళ్లయ్యాక మహిళలు బాక్సింగ్‌లో రాణించడం కష్టం’... ఇదీ నాటి అభిప్రాయం. కానీ ఆ అభిప్రాయం తప్పు అని ఈ జంట నిరూపించింది. మేరీకామ్ జీవితంలో అతి పెద్ద విజయాలన్నీ పెళ్లయ్యాకే వచ్చాయి. కవల పిల్లలకు జన్మనిచ్చాక... బాక్సింగ్ రింగ్‌లోకి దిగి పతకాలు గెలవడం... అది కూడా ఒలింపిక్ పతకం గెలవడం... వాహ్ మేరీకామ్.. హ్యాట్సాఫ్..! కవలలతో సహా ముగ్గురు పిల్లల్ని పెంచడం... భార్య కెరీర్‌కు సహకరించడం... ఓన్లర్ కామ్... డబుల్ హ్యాట్సాఫ్..! -ఎల్లా రమేష్ (సాక్షి స్పోర్ట్స్) ‘మేరీలో చాలా ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. మాది లవ్ అనడం కంటే... ఆమెను నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించానని అనడం కరెక్ట్. ఆమె విషయంలో బాధ్యత తీసుకోవాలని అనిపించింది. కెరీర్ ఎలా ఉంటుందో తెలియదు. కానీ తనలోని తపన చూస్తే ముచ్చటేస్తుంది. పిల్లల విషయంలో తను నన్ను ఆకాశానికి ఎత్తేస్తుంది. కానీ తను రింగ్‌లో ఉన్నంతసేపు ఇంటి సమస్యలు, బాధ్యతలు తనకు గుర్తు రాకూడదు. అందుకే నేను పిల్లల గురించి ఎక్కువ కేర్ తీసుకుంటాను’ - ఓన్లర్కామ్ ‘ఓన్లర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన గురించి ఆగకుండా వారం రోజులు చెప్పమన్నా చెబుతా. మా పెళ్లయిన కొత్తలో నా కెరీర్ అయిపోయిందని అందరూ అన్నారు. కానీ నన్ను నమ్మిన ఒకే ఒక్క వ్యక్తి ఓన్లర్. నా కెరీర్ కోసం తను చాలా త్యాగాలు చేశాడు. తను పరిచయమైనప్పటి నుంచి ఎందుకో తనంటే తెలియని ప్రేమ. పెళ్లి చేసుకుందాం అనగానే ఎగిరి గంతేశాను. పిల్లల్ని పెంచడం ఎంత కష్టమో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కవలల్ని పెంచడం మరీ కష్టం. కానీ అలాంటి ఇబ్బందీ నాకు మాత్రం ఇప్పటిదాకా తెలియదు. ఓన్లర్ మొత్తం చూసుకుంటాడు. నా విజయాల్లో... ఓన్లర్ త్యాగం, తను ఇచ్చిన స్ఫూర్తిదే అగ్రస్థానం’ - మేరీకామ్