వాళ్లది ‘కామ్’ లవ్‌స్టోరీ | Olympic medalist, boxer MC Mary Kom love story | Sakshi
Sakshi News home page

వాళ్లది ‘కామ్’ లవ్‌స్టోరీ

Published Fri, Jan 31 2014 11:21 PM | Last Updated on Sat, Sep 2 2017 3:13 AM

Olympic medalist, boxer MC Mary Kom love story

 ప్రతి మగాడి విజయం వెనక ఓ స్త్రీ ఉంటుందంటారు...
 మరి స్త్రీ విజయం వెనక ఓ మగాడు ఉండి తీరాలి కదా...
 లాజిక్ ప్రకారమే కాదు... వాస్తవం కూడా అదేనంటోంది మేరీకామ్.
 భారత స్టార్ బాక్సర్, ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళా బాక్సర్ మేరీకామ్... తన విజయాలన్నీ వాళ్లాయన ఓన్లర్ పుణ్యమేనంటోంది. మేరీకామ్‌ది కూడా ప్రేమ వివాహం.

 
 అది 2000వ సంవత్సరం...
 ఓన్లర్‌కామ్... ఢిల్లీ యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడు. తమ ప్రాంతానికి చెందిన వాళ్లందరికీ సాయం చేస్తాడని మంచి పేరు.  మేరీ 19 ఏళ్ల బాక్సర్. మణిపూర్ నుంచి భవిష్యత్‌లో వెలుగులోకి వస్తుందని బాక్సింగ్ కమ్యూనిటీ నమ్మిన అమ్మాయి.
 
బెంగళూరులో జరిగే జాతీయ బాక్సింగ్ శిబిరం కోసం ట్రెయిన్‌లో వెళుతుండగా మేరీ సూట్‌కేస్ పోయింది. డబ్బు, పాస్‌పోర్ట్ అందులో ఉన్నాయి. నెల రోజుల్లోనే విదేశాలకు వెళ్లి బాక్సింగ్ పోటీల్లో పాల్గొనాలి. ఎలా?
 

అన్యమస్కంగా క్యాంప్‌ను ముగించుకుని ఢిల్లీ చేరింది. అక్కడెవరో చెప్పారు. ‘ఓన్లర్ అని మన ప్రాంతం వ్యక్తే. అందరికీ సాయం చేస్తాడు. ప్రస్తుతం ఇక్కడే ఢిల్లీలో ఉన్నాడు. ఓసారి కలువు’.
 
 నెహ్రూ స్టేడియంలో మేరీ ప్రాక్టీస్ చేస్తోంది. ఓ స్నేహితుడిని కలవడానికి ఓన్లర్ అక్కడకి వచ్చాడు. మేరీకామ్ ప్రాక్టీస్ చేస్తుంటే చూశాడు. ఆమె పంచ్ పవర్‌ని గమనించాడు. ‘ఫర్వాలేదు... భవిష్యత్ ఉంది’ అనుకున్నాడు. పది నిమిషాల తర్వాత మేరీ ఓన్లర్ దగ్గరకి వచ్చింది. ‘నా పాస్‌పోర్ట్ పోయింది. కాస్త తొందరగా తెచ్చుకోవడానికి సహాయం చేస్తారా?’ అని అడిగింది.
 
 ఆ రోజు స్నేహం మొదలైంది. ఐదేళ్లు గడిచాయి. ఈలోగా ఎప్పుడు ఇద్దరి మధ్య ప్రేమ మొదలైందో తెలియదు. ఒక రోజు ఓన్లర్ వచ్చి ‘మేరీ... విల్ యూ మ్యారీ మీ’ అని అడిగాడు. అప్పటికే తన గుండెల్లో ఉన్న వ్యక్తి నుంచి ఈ ప్రతిపాదన వస్తే ఎవరైనా ఏం చేస్తారు..? మేరీ కూడా అదే చేసింది.
 
 మార్చి, 2005... ఓన్లర్ కామ్, మేరీకామ్‌ల పెళ్లయింది. బాక్సింగ్ కమ్యూనిటీ పెదవి విరిచింది. ‘ఇక ఓ గొప్ప బాక్సర్ కెరీర్ ముగిసిపోయింది. పెళ్లయ్యాక మహిళలు బాక్సింగ్‌లో రాణించడం కష్టం’... ఇదీ నాటి అభిప్రాయం.
 
 కానీ ఆ అభిప్రాయం తప్పు అని ఈ జంట నిరూపించింది. మేరీకామ్ జీవితంలో అతి పెద్ద విజయాలన్నీ పెళ్లయ్యాకే వచ్చాయి. కవల పిల్లలకు జన్మనిచ్చాక... బాక్సింగ్  రింగ్‌లోకి దిగి పతకాలు గెలవడం... అది కూడా ఒలింపిక్ పతకం గెలవడం... వాహ్ మేరీకామ్.. హ్యాట్సాఫ్..! కవలలతో సహా ముగ్గురు పిల్లల్ని పెంచడం... భార్య కెరీర్‌కు సహకరించడం... ఓన్లర్ కామ్... డబుల్ హ్యాట్సాఫ్..!             
 -ఎల్లా రమేష్ (సాక్షి స్పోర్ట్స్)
 
‘మేరీలో చాలా ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. మాది లవ్ అనడం కంటే... ఆమెను నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించానని అనడం కరెక్ట్. ఆమె విషయంలో బాధ్యత తీసుకోవాలని అనిపించింది. కెరీర్ ఎలా ఉంటుందో తెలియదు. కానీ తనలోని తపన చూస్తే ముచ్చటేస్తుంది. పిల్లల విషయంలో తను నన్ను ఆకాశానికి ఎత్తేస్తుంది. కానీ తను రింగ్‌లో ఉన్నంతసేపు ఇంటి సమస్యలు, బాధ్యతలు తనకు గుర్తు రాకూడదు. అందుకే నేను పిల్లల గురించి ఎక్కువ కేర్ తీసుకుంటాను’    
- ఓన్లర్‌కామ్
 
‘ఓన్లర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన గురించి ఆగకుండా వారం రోజులు చెప్పమన్నా చెబుతా. మా పెళ్లయిన కొత్తలో నా కెరీర్ అయిపోయిందని అందరూ అన్నారు. కానీ నన్ను నమ్మిన ఒకే ఒక్క వ్యక్తి ఓన్లర్. నా కెరీర్ కోసం తను చాలా త్యాగాలు చేశాడు. తను పరిచయమైనప్పటి నుంచి ఎందుకో తనంటే తెలియని ప్రేమ. పెళ్లి చేసుకుందాం అనగానే ఎగిరి గంతేశాను. పిల్లల్ని పెంచడం ఎంత కష్టమో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కవలల్ని పెంచడం మరీ కష్టం. కానీ అలాంటి ఇబ్బందీ నాకు మాత్రం ఇప్పటిదాకా తెలియదు. ఓన్లర్ మొత్తం చూసుకుంటాడు. నా విజయాల్లో... ఓన్లర్ త్యాగం, తను ఇచ్చిన స్ఫూర్తిదే అగ్రస్థానం’    
- మేరీకామ్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement