దేశం కోసం... పతకం, ప్రాణం...
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటిదాకా ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే 1939 నుంచి 1945 వరకు ఆరేళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన రెండో ప్రపంచ యుద్ధం రక్తపాతాన్ని సృష్టించింది. రక్తం ఏరులై పారిన ఈ యుద్ధంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కొందరు శాశ్వత వైకల్యం పొందారు. అయితే ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో తమ దేశానికి పతకాలు అందించిన ఒలింపియన్లు కూడా ఉన్నారు. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. ఒలింపిక్స్‌లో పాల్గొని తమ దేశ ఖ్యాతిని అంతర్జాతీయంగా రెపరెపలాడించిన క్రీడాకారులు దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడారు.. స్ఫూర్తిని నింపిన అలాంటి వారిలో కొందరి గురించి తెలుసుకుందాం...
ఫాయ్ డ్రాపర్.. అమెరికా అథ్లెట్... ఒలింపిక్స్‌లో అమెరికా జాతీయ పతకం రెపరెపలాడించడంలో తనవంతు పాత్ర పోషించాడు. 1936లో బెర్లిన్ ఆతిథ్యమిచ్చిన ఒలింపిక్స్‌లో స్టార్ అథ్లెట్ జెస్సీ ఒవెన్స్‌తో కలిసి 4ఁ100 మీటర్ల రిలేలో బంగారు పతకం అందించాడు. ఈ ఒలింపిక్స్ ముగిసిన రెండేళ్ల తర్వాత రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. అప్పటికే అమెరికా రక్షణ దళంలో ఆర్మీ ఎయిర్ కార్ప్స్ పెలైట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. 1943లో శత్రుదేశాల దాడిలో... 32 ఏళ్లకే డ్రాపర్ ప్రాణాలు విడిచాడు.
కార్ల్ లుజ్ లాంగ్... ఒలింపిక్ లాంగ్ జంపర్.. జర్మనీ ఆర్మీలో ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహించిన లాంగ్ 1943లో ఆర్మీ చేపట్టిన చర్యలో మరణించాడు. 30 ఏళ్లకే అసువులు బాసిన లాంగ్‌ను... అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) 1964లో డి కూబర్టిన్ మెడల్‌తో (క్రీడాస్ఫూర్తి ప్రదర్శిం చినందుకు) సత్కరించింది. 1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో లాంగ్ రజత పతకం సాధించాడు. నిజానికి ఆ ఒలింపిక్స్‌లో లాంగ్ జంప్‌లో లుజ్ లాంగే స్వర్ణం గెలవాల్సింది. కానీ తన ప్రత్యర్థి, అమెరికా లాంగ్ జంపర్ జెస్సీ ఒవెన్స్ తడబాటుకు గురవడంతో ఫైనల్ చేరేందుకు సలహాలు ఇచ్చాడు. లాంగ్ ఇచ్చిన సలహాతో ఫైనల్స్‌లో ఒవెన్స్ సత్తా చాటాడు. లాంగ్‌ను వెనక్కినెట్టి బంగారు పతకం గెల్చుకున్నాడు.
టకిచి నిషి.... 1932 లాస్‌ఎంజిలిస్ ఒలింపిక్స్‌లో జపాన్ తరఫున ఈక్వెస్ట్రియన్ వ్యక్తిగత జంపింగ్ విభాగంలో పాల్గొని స్వర్ణం సాధించాడు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 1945లో ఇవో జిమా ఐలాండ్‌లో అమెరికా- జపాన్ సైన్యాల మధ్య యుద్ధం జరిగింది. జపాన్ ఆర్మీలో కల్నల్ హోదాలో ఉన్న టకిచి నిషి యుద్ధంలో పాల్గొన్నాడు. అమెరికా సేనలు జరిపిన దాడిలో నిషి మరణించాడు.
జూలీ దర్శకత్వంలో జంపరిని జీవిత గాథ...
లూయిస్ జంపరిని (అమెరికా)... ప్రస్తుత వయసు 97. లాంగ్ డిస్టెన్స్ రన్నర్ అయిన జంపరిని 1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో పాల్గొన్నాడు. పతకం చేజారినా జంపరిని తన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ నుంచి ప్రశంసలు కూడా పొందాడు. ఆ తర్వాత అమెరికా వాయుసేనలో చేరిన జంపరిని రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాడు. పసిఫిక్ మహాసముద్రంలో అమెరికా యుద్ధవిమానం కూలిపోవడం... శకలాల సాయంతో 47 రోజుల పాటు సముద్రంలోనే గడపడం.. ఆ తర్వాత యుద్ధ ఖైదీగా పట్టుబడటం... అష్టకష్టాలు పడి చివరికి క్షేమంగా బయటపడటం.. ఇదే ఇతివృత్తంగా హాలీవుడ్ స్టార్ అంజె లీనా జూలీ ‘అన్ బ్రోకెన్’ అనే సినిమాకు దర్శకత్వం వహించింది. ఈ సినిమా ఇదే ఏడాది విడుదలయ్యే అవకాశాలున్నాయి.
చార్లెస్ పదోక్... అమెరికా ట్రిపుల్ ఒలింపియన్...మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో యూఎస్ మెరైన్స్‌లో లెఫ్టినెంట్‌గా బాధ్యతలు చేపట్టి దేశం కోసం పోరాడాడు. ఆ తర్వాత చదువుపై ఆసక్తి కనబరిచి... చివరికి క్రీడలపై దృష్టిపెట్టాడు... స్ప్రింటర్‌గా భేష్ అనిపించుకున్న పదోక్... ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో హీరోగా మారిపోయాడు. 20 ఏళ్లకే ఒలింపిక్స్‌లో అడుగుపెట్టిన పదోక్ 1920 ఆంట్వెర్ప్ (బెల్జియం) ఒలింపిక్స్‌లో 100 మీటర్లు, 4ఁ100 మీటర్ల రిలేలో బంగారు పతకాలు సాధించాడు. అంతేకాదు 200 మీటర్ల పరుగులో రజతం కైవసం చేసుకున్నాడు. తదుపరి 1924 పారిస్ ఒలింపిక్స్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. 200 మీటర్ల పరుగులో రజత పతకం కైవసం చేసుకున్నాడు. ఇక 1928 ఒలింపిక్స్‌లో పాల్గొన్నా పతకం మాత్రం దక్కలేదు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 1943లో సిట్కా (అలస్కా) సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో మేజర్ జనరల్ విలియమ్‌తో కలిసి ప్రాణాలు విడిచాడు.