ఇది హేమంత ఋతువు...
ఆకలి, జీర్ణశక్తి ఎక్కువగా ఉండే ఋతువు...
శరీరానికి జీర్ణశక్తి అధికంగా ఉన్నప్పుడు తక్కువ శక్తినిచ్చే పదార్థాలు సరిపోవు.
అధిక జీర్ణశక్తికి అనుగుణంగా ఆహారం తీసుకోవాలి.
నూనెపదార్థాలు కలిగిన ఆహారం అందించాలి.
అలాగని నూనె నేరుగా తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉండదు...
అధికంగా నూనె ఉండే నువ్వులను నేరుగా తీసుకోవడం వల్ల
జీర్ణశక్తి బావుంటుంది.
పోషకాలు, ఖనిజాలు అధికంగా అందుతాయి.
నువ్వులుంటే ఆనందాల పువ్వులు... ఆరోగ్యాల నవ్వులు...
నువ్వుల అన్నం
కావలసినవి: బియ్యం – అర కేజీ; నువ్వులు – 100 గ్రా.; జీడి పప్పులు – కొద్దిగా; కిస్‌మిస్ – కొద్దిగా; ఉల్లిపాయ – 1; వెల్లుల్లి – 2 రేకలు; పోపు కోసం: పచ్చి మిర్చి – 4; పచ్చి సెనగపప్పు – టీ స్పూను; మినప్పప్పు – టీ స్పూను; ఆవాలు – టీ స్పూను; జీలకర్ర – టీ స్పూను; ఎండు మిర్చి – 4; నెయ్యి – తగినంత; ఉప్పు – తగినంత.
తయారి: ∙ముందుగా బియ్యం శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించాలి ∙బాణలిలో నూనె లేకుండా నువ్వులు వేసి దోరగా వేయించి, చల్లారాక మిక్సీలో వేసి పొడి చేయాలి ∙బాణలిలో నెయ్యి వేసి కరిగాక జీడి పప్పులు, కిస్‌మిస్ వేసి వేయించి తీసేయాలి ∙అదే బాణలిలో పచ్చి సెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి వేయించాక ఉల్లి తరుగు జత చేసి దోరగా వేయించాలి ∙ఒక పాత్రలో అన్నం వేసి పొడిపొడిగా చేయాలి ∙నువ్వుల పొడి, వేయించిన డ్రైఫ్రూట్స్, వేయించిన పోపు, ఉప్పు వేసి బాగా కలపాలి ∙టొమాటో పచ్చడితో తింటే రుచిగా ఉంటుంది.
నువ్వుల చపాతీ
కావలసినవి: గోధుమ పిండి – కప్పు; క్రీమ్ – కప్పు; గోరువెచ్చటి పాలు – 4 టేబుల్ స్పూన్లు; తెల్ల నువ్వులు – టేబుల్ స్పూను (నూనె లేకుండా బాణలిలో వేయించాలి); నల్ల నువ్వులు – టేబుల్ స్పూను; నెయ్యి – టీ స్పూను; ఉప్పు – తగినంత.
తయారి: ∙ముందుగా ఒక పాత్రలో గోధుమ పిండి, క్రీమ్, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు, ఉప్పు వేసి బాగా కలపాలి ∙పాలు జత చేస్తూ, చపాతీ పిండిలా కలిపి అర గంటసేపు పక్కన ఉంచాలి. (అవసరమనుకుంటే కొద్దిగా నీళ్లు జత చేయొచ్చు) ∙పిండిని ఉండలుగా చేసుకుని, నెయ్యి అద్దుతూ చపాతీలా ఒత్తాలి ∙స్టౌ మీద పెనం వేడయ్యాక ఒక్కో చపాతీని వేసి నేతితో కాల్చాలి ∙క్యాలీఫ్లవర్ కూరతో తింటే రుచిగా ఉంటాయి.
నువ్వుల పులుసు
కావలసినవి: నువ్వులు – 100 గ్రా. (బాణలిలో నూనె లేకుండా వేయించాలి); ఉల్లికాడలు – 2 (సన్నగా తరగాలి); చింతపండు – కొద్దిగా (నీళ్లలో నానబెట్టి, చిక్కగా పులుసు తీసి పక్కన ఉంచాలి); ఉప్పు – తగినంత; పసుపు – కొద్దిగా; బెల్లం పొడి – టేబుల్ స్పూను; బియ్యప్పిండి – టేబుల్ స్పూను; పోపు కోసం: ఆవాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; ఎండు మిర్చి – 5; ఇంగువ – చిటికెడు; కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర – కొద్దిగా
తయారి: ∙బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, ఇంగువ వేసి వేయించాలి ∙ఉల్లికాడలు జత చేసి కొద్దిగా వేయించాలి ∙చింతపండు పులుసు జత చేసి బాగా కలపాలి ∙రెండు గ్లాసుల నీరు, ఉప్పు, పసుపు, నువ్వుల పొడి వేసి ఉడికించాలి ∙బియ్యప్పిండిని చిన్న గ్లాసుడు నీళ్లలో ఉండలు లేకుండా కలిపి, ఉడుకుతున్న పులుసులో వేసి మరోమారు ఉడికించి దింపేయాలి ∙అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది.
నువ్వుల స్వీట్ చట్నీ
కావలసినవి: నువ్వులు – 100 గ్రా.; చింతపండు – 100 గ్రా.; బెల్లం పొడి – 100 గ్రా.; ఉప్పు – తగినంత; పోపు కోసం: ఎండు మిర్చి – 20; పచ్చి సెనగపప్పు – టేబుల్ స్పూను; మినప్పప్పు – టేబుల్ స్పూను; ఆవాలు – టీ స్పూను; జీలకర్ర – టీ స్పూను; ఇంగువ – అర టీ స్పూను; నువ్వుల నూనె – 2 టేబుల్ స్పూన్లు
తయారి: ∙ముందుగా బాణలిలో నూనె లేకుండా నువ్వులను దోరగా వేయించి తీసి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ∙అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండు మిర్చి వరుసగా వేసి వేయించి తీసేసి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ∙చింతపండుకు కొద్దిగా నీళ్లు జత చేసి ఉడికించి, చల్లారాక చేతితో మెత్తగా చేసి, గింజలు, ఈనెలు పక్కకు తీసేయాలి ∙ఒక పాత్రలో ఈ పదార్థాలన్నిటినీ వేసి బాగా కలిపాక, మిక్సీలో మరోమారు వేసి అన్నీ కలిసేవరకు మిక్సీ పట్టి తీసేయాలి ∙బాణలిలో నువ్వుల నూనె వేసి గోరు వెచ్చనయ్యాక ఇంగువ వేసి కొద్దిగా వేడి చేసి, దింపేసి, తయారుచేసి ఉంచుకున్న పచ్చడిలో వేసి కలపాలి దోసెలు, ఇడ్లీలు, గారెలలో చాలా రుచిగా ఉంటుంది.
సెసేమ్ క్రిస్ప్స్
కావలసినవి: కోడి గుడ్డు – 1 (తెల్లసొన మాత్రమే); పంచదార – 30 గ్రా.; మైదా పిండి – 30 గ్రా.; బటర్ – 20 గ్రా. (ఉప్పు లేని బటర్); నువ్వులు – 90 గ్రా. (దోరగా వేయించాలి); నెయ్యి – కొద్దిగా.
తయారి: ∙ఒక పాత్రలో కోడిగుడ్డు తెల్ల సొన వేసి బాగా గిలకొట్టాలి ∙పంచదార జత చేసి, కరిగే వరకు మరోమారు గిలకొట్టాలి ∙కరిగించిన బటర్ జత చేయాలి జల్లించిన మైదా పిండి జత చేసి ఉండలు లేకుండా బాగా కలపాలి ∙వేయించిన నువ్వులు జత చేయాలి బేకింగ్ ట్రేకి నెయ్యి పూయాలి ∙కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని స్పూనుతో కొద్దికొద్దిగా దూరం దూరంగా పరచాలి ∙ఫోర్క్ సహాయంతో గుండ్రంగా వచ్చేలా సరిచేయాలి ∙170 డిగ్రీల దగ్గర వేడి చేసి ఉంచుకున్న అవెన్‌లో ఉంచి సుమారు 10 నిమిషాల తరవాత తీసేయాలి ∙మరో రెండు నిమిషాలు ఉందనగా సెసేమ్ క్రిస్ప్స్‌ను తిరగేయాలి ∙రెండు నిమిషాలయ్యాక బయటకు తీసేయాలి ∙కొద్దిగా చల్లారాక అందించాలి.
నువ్వులలో ఔషధ గుణాలు...
సూర్యుడు ధనుస్సు నుంచి మకరంలోకి ప్రవేశించే కాలం ఉత్తరాయణ పుణ్యకాలం. ఈ మాసంలో చలి వెనుకబడి నెమ్మదిగా వే పెరుగుతూ వస్తుంది. ఈ సమయంలో నువ్వులు తినడం ద్వారా వాతావరణంలో వచ్చే మార్పుల నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు. మహారాష్ట్రలో ‘తిల్ గుడ్’ పేరుతో అందరూ ఒకరికి ఒకరు ఇచ్చి పుచ్చుకుంటారు. నువ్వులలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.
∙నువ్వుల ద్వారా లభించే క్యాల్షియమ్ పూర్తిగా జీర్ణమవుతుంది. వీటిలో 20 శాతం ప్రోటీన్లు ఉన్నాయి. నువ్వుల్లో ఉండే ఫైటో స్టెరాల్స్ వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ ఉత్పత్తి తగ్గుతుంది.
∙నువ్వులు జీర్ణశక్తిని పెంచడంలోను, రక్తపోటును తగ్గించడంలోనూ ఉపయోగపడతాయి.
∙నువ్వులలో యాంటీ ఆక్సిడెంట్లు, అనేక ఖనిజ లవణాలు అధికంగా ఉంటాయి. అవన్నీ క్యాన్సర్ రాకుండా నిరోధిస్తాయి.
∙నువ్వులు ఎముకలను పటిష్టం చేయడం ద్వారా ఎముకలను గుల్లబరిచే ఆస్టియో పోరోసిస్ వ్యాధి రాకుండా కాపాడతాయి. కీళ్లను, రక్తనాళాలను శక్తివంతం చేసే లక్షణం నువ్వుల్లో ఎక్కువగా ఉంది.
∙కాలేయపు పనితనాన్ని మెరుగుపరుస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment