మేఘా రావత్
పాదాలకు అందమైన నాణ్యమైన ఫ్యాషనబుల్ చెప్పులు, షూస్‌ను అందరూ ఇష్టపడతారు. అందుకే డబ్బు కాస్త ఎక్కువైనా ఖర్చుకు వెనకాడరు. రాజస్థాన్‌కు చెందిన మేఘా రావత్ వాడి పడేసిన వస్తువులతో అందమైన చెప్పులను తయారుచేస్తోంది. .
ఫ్యాషనబుల్‌గా ఉండేవి, నాణ్యమైన, సరసమైన ధరలలో లభించే పాదరక్షల తయారీని ప్రారంభించడమే కాకుండా వాటికో బ్రాండ్‌ను క్రియేట్ చేసింది మేఘారావత్. ఇవి పూర్తిగా రీసైక్లింగ్ వస్తువులతో తయారు చేసినవి. వనరుల విలువ తెలుసుకున్నప్పుడు మేఘా రావత్ చాలా చిన్నది. 28 ఏళ్ల మేఘా రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో పెరిగారు. ‘నా చిన్నతనంలో నీళ్లు, కరెంట్ సరఫరా సరిగా ఉండేది కాదు. నా తమ్ముడు, నేను స్కూల్ నుంచి వచ్చాక ఇంటి పనులకు నీళ్ల కోసం దగ్గరలోని కాలువకు వెళ్లి తెచ్చుకునేవాళ్లం. వాడి పడేసిన సీసాలను దీపానికి ఉపయోగించేది అమ్మ’ అని గుర్తు చేసుకుంటుంది మేఘ. తండ్రి ఆర్మీలో ఉద్యోగి. తల్లి స్థానిక పాఠశాలలో టీచర్. తక్కువ వస్తువులతో ఎలా జీవించాలో నేర్పేది తల్లి. అవసరమైన వాటిని మాత్రమే కొనుగోలు చేయడం అలవాటు చేసింది. వాడిన వస్తువులను తిరిగి ఉపయోగించడం సాధ్యమైనంతవరకు ప్రయత్నించేవారు. ‘మా అమ్మ తన పాత చీరలతో నాకు గౌన్లు కుట్టేది. అవి చిరిగాక దిండు కవర్లుగా, టేబుల్ క్లాత్‌గా, దుమ్ము దులపడానికి ఉపయోగించే డస్టర్లుగా వాటిని చూసేదాన్ని’ అని మేఘా తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటుంది.
స్క్రాప్‌తో స్ట్రాప్స్
మేఘా 2014లో కురుక్షేత్రలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసింది. పై చదువుల కోసం తను ఉంటున్న పట్టణం నుండి నగరానికి వెళ్ళినప్పుడు, అక్కడ చాలామంది ఏవీ ఆలోచించకుండా వస్తువులను కొనడం గమనించేది. ‘వాటిని వాళ్లు ఎంతోకాలం వాడరు. కొంత కాలానికి వాటిని నిర్లక్ష్యంగా పడేస్తారు. వాటన్నిటి అసలు ఖర్చు మాత్రమే కాదు, ప్రకృతికి జరిగే నష్టాన్ని కూడా అదే టైమ్‌లో అంచనా వేసుకునేదాన్ని’ అని చెబుతారు మేఘా. ఆ ఆలోచనతోనే మేఘా 2015లో రీ సైక్లింగ్ మెటీరియల్‌తో ఫుట్‌వేర్‌ను డిజైన్ చేయడం కనుక్కుంది. దానికి ‘కురియో’ అని నామకరణం చేసింది. దీనికి ముందు మేఘా ముంబయ్‌లోని ఒక ఐటి సంస్థ, ఎక్స్‌పోర్ట్ కంపెనీలలో పనిచేసింది. అక్కడ తనకా ఉద్యోగం సంతృప్తిని ఇవ్వడం లేదని అర్థమయ్యాక పర్యావరణ స్పృహ కలిగిన పాదరక్షలను తయారు చేయడం మొదలుపెట్టింది. వీటి తయారీలో నైపుణ్యం కలిగిన 200 మంది చేతివృత్తులవారిని, మహిళలను ఎన్జీవోల సాయంతో నియమించుకుంది.
టైర్లతో చెప్పుల అడుగు భాగం
‘చిన్నప్పటి నుండి సొంతంగా రకరకాల వస్తువులను తయారు చేయడం సరదాగా చేసేదాన్ని. మా అమ్మ టైలరింగ్ పనిచేస్తుంటే నేను పాత పేపర్‌లతో కటింగ్ నేర్చుకునేదాన్ని. క్లాత్ ముక్కలతో రకరకాల బొమ్మలను తయారుచేసేదాన్ని. రీ సైకిల్ ద్వారా కొత్తవస్తువును తయారు చేసినప్పుడల్లా చాలా ఆనందించేదాన్ని. అదే ఈ చెప్పుల తయారీకి పురికొల్పింది. సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించడంతో బాధ్యత పెరిగింది. ఏ పని చేసినా పర్యావరణ స్పృహతో చేయాలనే ఆలోచన కలిగింది’ అంటుంది మేఘా. కురియో బ్రాండ్ ద్వారా పాదరక్షలు, కేశాలంకరణ వస్తువులు, బ్రోచెర్స్, ఫోల్డర్లు, ఫ్రిజ్ మాగ్నెట్స్, పర్సులు, కోస్టర్స్ వంటి ఉత్పత్తులను తయారుచేస్తుంది మేఘా. వీటిలో బాగా పేరొందినవి కొల్హాపురీ చెప్పులు. అలాగే కవర్ బూట్లు. పాదరక్షలకు ఉపయోగించే పట్టీలు పూర్తిగా చేనేత దారుల నుండి సేకరించిన బట్టతో, టైలరింగ్ యూనిట్ల నుండి సేకరించిన వ్యర్థ వస్త్ర పదార్థాలను ఉపయోగిస్తారు. దానికి తోడు పాదరక్షల అడుగు భాగానికి రీసైకిల్ టైర్లను వాడుతారు.
వ్యర్థాల కోసం నెట్‌వర్క్
‘కొని వాడిన నాణ్యమైన బట్టలను దేశంలోని వివిధ మూలల నుండి సేకరిస్తాం. ఇవి సహజమైన రంగులు, చేతితో నేసిన క్లాత్స్ అయి ఉంటాయి. వాటిలో ‘ఖాదీ, అజ్రఖ్, కలాంకారి, ఇండీ ఫాబ్రిక్స్ మొదలైనవి. దీనికి స్థానిక చేతివృత్తులు, చేనేత కార్మికులూ సహకరిస్తారు. ఇప్పటివరకు ఎదుర్కొంటున్న సవాళ్లు ఏమైనా ఉన్నాయా అంటే రీసైక్లింగ్ పదార్థాల కోసం నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడమే. ఇందుకు సమయం, అనుభవం చాలా అవసరం ఉంటుంది..’ అని వివరిస్తుంది మేఘా.
కాలుష్యకారకాలలో అతిపెద్దది ఫ్యాషన్ ప్రపంచం. మేఘా చేసే రీ సైక్లింగ్ ఉత్పత్తులు కాలుష్యాన్ని తగ్గించడానికి దోహదం చేస్తున్నాయి. ఈ రీ సైక్లింగ్ తయారీ ఉత్పత్తులు ప్రజలకు మరింత అందుబాటులోకి రాగలిగితే పర్యావరణ నష్టాన్ని బాగా తగ్గించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment