వలసలో పడొద్దు | migrant workers protection society | Sakshi
Sakshi News home page

వలసలో పడొద్దు

Published Mon, Jan 12 2015 11:02 PM | Last Updated on Sat, Sep 2 2017 7:36 PM

వలసలో పడొద్దు

వలసలో పడొద్దు

బహ్రెయిన్ మైగ్రెంట్ వర్కర్స్ ప్రొటెక్షన్ సొసైటీ ద్వారా వలస కార్మికులకు అందిస్తున్న  సేవలకు గాను ఇటీవల భారతీయ ప్రవాసీ దివస్ వేదికపై మెహ్రూ వేసువాల ‘బెస్ట్ సోషల్‌వర్కర్ అవార్డ్’ అందుకున్నారు. ఆ సందర్భంగా ఆమెతో మాట కలిపినప్పటి విశేషాలు ఆమె మాటల్లో...

పుట్టి పెరిగిందంతా ఇండియాలోనే అయినా మావారి వృత్తిరీత్యా బెహ్రెయిన్‌లో స్థిరపడ్డాం. పదకొండేళ్ల కిందట... పనమ్మాయిని హింసలు పెడుతున్న కేసు ఒకటి వచ్చింది. ఆమెకు సహాయం చేసేందుకు ఆ కేసులో చొరవ చూపాను. ఆ కేసు జటిలమవడంతో  పూర్తి సమయం కేటాయిస్తే తప్ప ఆమెకు సహాయం చేయలేమనిపించింది. ఆ ఆలోచనతోనే ఇలాంటి వాళ్లను ఆదుకోవడానికి వ్యక్తిగా పోరాడేకన్నా సంస్థగా కదిలితే ఫలితం ఉంటుందని బెహ్రెయిన్‌లో ఉన్న కొంతమంది స్నేహితులం కలిసి మైగ్రెంట్ వర్కర్స్ ప్రొటెక్షన్ సొసైటీ ని స్థాపించాం.

80 శాతం తెలుగువాళ్ల కేసులే
మహిళా పనిపనుషులకు సంబంధించిన కేసుల్లో దాదాపు 80 శాతం తెలుగు రాష్ట్రాలనుంచే ఉంటున్నాయి.  తెలుగువాళ్లలో సొంతూరి నుంచి తొలిసారి కాలు బయటపెడుతున్న వాళ్లే ఎక్కువ. బయటి ప్రపంచం గురించి అసలేమీ తెలియని అమాయకులు వాళ్లు. ఒక్కసారిగా విమానం ఎక్కి భాష తెలియని, తన సంస్కృతి కాని దేశంలోకి వచ్చిపడుతున్నారు. ఇక్కడి పద్ధతులు, వ్యవహారాలు తెలియవు. అవగాహన ఉండదు. ఇవన్నీ సాంకేతికంగా సంపన్న దేశాలు. వాళ్లు పనిచేయడానికి వచ్చే ఇళ్లన్నీ ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగించుకుంటున్నవే. కనీసం ఏసీ, మైక్రోవేవ్ ఓవెన్, వాషింగ్ మెషీన్‌ను ఎలా ఆపరేట్ చేయాలో కూడా మనవాళ్లకు తెలియదు.

తెలియకపోవడం తప్పుకాదు.. కాని అదే అమాయకత్వంతో ఈ దేశాలకు వచ్చి పనిచేయాలనుకోవడం తప్పు. ఎందుకంటే దానికి వాళ్లు జీవితకాల మూల్యం చెల్లించాల్సి వస్తోంది. ఏమీ తెలుసుకోకుండా పనిలో కుదరడం వల్ల  యజమానుల దగ్గర అవమానాలు పాలవడం, ఇంకొన్ని  చోట్ల హింసను భరించడం, వల్లకాక పారిపోవడం సర్వసాధారణ మవుతున్నాయి. అలాంటి కేసులు కొన్ని వందల్లో కనిపిస్తాయి. ఒక్క సంస్కృతికి, భాషకు సంబంధించిన సమస్యలు మాత్రమే కాదు, అంతంతపెద్ద ఇళ్లల్లో పనిచేసే శక్తి కూడా వీళ్లకు ఉండడం లేదు. కారణం పౌష్ఠికాహార లోపం. శారీరకంగా బలహీనంగా ఉంటారు.

అందుకే నేను చెప్పేది ఒకటే.. ఏ దేశానికి అయితే వెళ్లాలనుకుంటున్నారో.. ఆ దేశానికి సంబంధించిన ఆచారవ్యవహారాలు, భాషతో పాటు పనికి సంబంధించిన శిక్షణా తప్పకుండా తీసుకోవాలి. విస్మయం కలిగించే ఒక విషయం ఏమిటంటే.. నెలరోజుల పసిబిడ్డలను వదిలి వస్తున్న తల్లులూ ఉన్నారు. ఇలాంటి వాళ్లను వాళ్ల భర్తలే దగ్గరుండి పంపిస్తున్నారు. ఇంతాచేసి, ఇన్నికష్టాలుపడి వాళ్లు సంపాదించే జీతమెంతో తెలుసా నెలకు  కేవలం పదివేల రూపాయలు.

ప్రేమకు అనాథలు
ఇవన్నీ సరే.. మనసు మెలిపెట్టే ఇంకొన్ని సంఘటనలుంటాయి. నాలుగైదేళ్లు సొంతవాళ్లకు దూరంగా ఉండి ప్రేమ, ఆప్యాయతలకు మొహంవాచి పోయుంటారు కొంతమంది. అలాంటి వాళ్లు తోటి మేల్‌వర్కర్స్‌తో ప్రేమలో పడ్తారు. సహజీవనం చేస్తుంటారు. పిల్లల్నీ కంటారు. తర్వాత ఏమవుతుందో తెలుసా? వాళ్ల వీసా పరిమితి ముగియగానే ఎవరికివాళ్లు వాళ్లవాళ్ల ఊళ్లకు వెళ్లిపోతారు. ఇక్కడ వాళ్లు కన్న పిల్లలు ఏ నేషనాలిటీ లేక, రాక అనాథలుగా మిగిలిపోతారు. కొన్నాళ్లు అనాథశరణాలయాల్లో పెరుగుతారు. తర్వాత ఏమవుతారో తెలియదు. ఇంత హృదయవిదారకంగా ఉంటాయి ఈ గల్ఫ్ వ్యథలన్నీ!

చెప్పేదొక్కటే..
నా సిన్సియర్ అడ్వయిజ్ ఒక్కటే. కేవలం పదివేల రూపాయలకు ఇంత బాధను అనుభవించాల్సిన అవసరంలేదు. పొట్ట చేతబట్టుకొని గల్ఫ్ విమానం ఎక్కే బదులు అక్కడే ఉన్న పట్టణాలకు వెళ్లండి. ఎలాగూ కష్టపడాలి అని నిర్ణయించుకున్నప్పుడు ఆ కాయకష్టమేదో అయినవాళ్ల దగ్గరే చేస్తేపోతుంది కదా! అయినా గల్ఫ్ సంపాదన మీద మోజు తగ్గకపోతే.. లేక అనివార్యమైతే ట్రైనింగ్ తీసుకొండి. భాష, సంస్కృతి దగ్గర్నుంచి ఎలా పనిచేయాలో వరకు అన్నిట్లో. ఇక్కడికి వచ్చే ముందు అక్కడే ఉన్న పెద్దవాళ్లిల్లో కొన్ని రోజులు పనిచేయండి. ఎంతోకొంత నైపుణ్యం సంపాదించాకే గల్ఫ్ వీసా తీసుకోండి.

-సరస్వతి రమ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement