పాల పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ | milky mushroom cultivation training | Sakshi
Sakshi News home page

పాల పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ

Published Tue, Sep 17 2019 5:56 AM | Last Updated on Tue, Sep 17 2019 5:56 AM

milky mushroom cultivation training - Sakshi

రైతులకు ఏడాది పొడవునా మంచి ఆదాయాన్నిచ్చే వ్యవసాయ అనుబంధ వ్యాపకంగా పాల పుట్టగొడుగుల(మిల్కీ మష్రూమ్స్‌) పెంపకాన్ని చేపట్టవచ్చని హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త సూచిస్తున్నారు. అధిక దిగుబడినిచ్చే పాల పుట్టగొడుగుల పెంపకం ద్వారా రైతులు నిరంతరాయంగా మంచి ఆదాయాన్ని పొందవచ్చని, తమకు అందుబాటులో ఉన్న వనరులతో తక్కువ పెట్టుబడితోనే పుట్టగొడుగుల సాగును చేపట్టవచ్చని రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ కళాశాల మొక్కల తెగుళ్ల శాస్త్ర విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ ప్రమీల తెలిపారు. తమ కళాశాల ఆవరణలో రైతులకు ప్రతి నెలా మూడో శనివారం ఆమె శిక్షణ ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రభుత్వపరంగా పుట్టగొడుగుల సాగుపై సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకునేందుకు తగిన శిక్షణ ఇస్తున్నది ఈ ఒక్క చోట మాత్రమే.

శిక్షణ పొందిన వారు తమ ప్రాంతంలో పుట్టగొడుగుల అమ్మకం ద్వారా స్వయం ఉపాధిని పొందవచ్చు. రైతులు, ఇతర స్వయం ఉపాధి మార్గాలను అనుసరించే వారు దీన్ని ఉప వ్యాపకంగా చేపట్టవచ్చు.
ఆసక్తి గల వారు ప్రతి నెలా మూడో శనివారం నేరుగా తమ కళాశాలకు వచ్చి రూ. 500 చెల్లించి శిక్షణ పొందవచ్చని డా. ప్రమీల వివరించారు. ముందుగా పేర్లు నమోదు చేయించుకోవాల్సిన అవసరం లేదు, నేరుగా వచ్చి.. ప్రతి నెలా మూడో శనివారం ఉదయం 10 గం. నుంచి సాయంత్రం 4 గం. వరకు శిక్షణ పొందవచ్చు. సర్టిఫికెట్‌ను కూడా అందజేస్తారు. గ్రామాల్లో స్థానికంగా అందుబాటులో ఉండే వరి గడ్డి, వెదురు కర్రలు తదితరాలను వినియోగించి.. రూ. వెయ్యి పెట్టుబడితో కూడా పాల పుట్టగొడుగుల సాగును ప్రారంభించవచ్చని డా. ప్రమీల వివరించారు.

శిక్షణ పొందిన వారిని ప్రత్యేక వాట్సాప్‌ గ్రూప్‌లో సభ్యులుగా చేర్చి.. తదనంత కాలంలో పుట్టగొడుగుల సాగులో వచ్చే సమస్యలు, సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తామన్నారు. పుట్టగొడుగుల పెంపకానికి కావాల్సిన విత్తనం ధర కిలో రూ. 100 ఉంటుంది. కిలో విత్తనంతో సుమారు రూ. 2 వేల ఖరీదైన పుట్టగొడుగుల దిగుబడి పొందవచ్చన్నారు. మెలకువలు పాటిస్తే ప్రతి పుట్టగొడుగునూ 130 నుంచి 230 గ్రాముల బరువు వరకు పెంచవచ్చన్నారు. మామూలుగా 3–4 రోజులు నిల్వ ఉంటాయి. ఫ్రిజ్‌లో పెడితే 15–20 రోజులుంటాయి.

పుట్టగొడుగులు అచ్చమైన శాకాహారం!
పుట్టగొడుగులు అచ్చమైన శాకాహారమని, అయినా మాంసాహారంలో ఎక్కువగా ఉండే బి12తోపాటు విటమిన్‌ డి, బి, నియాసిన్‌ వంటి విటమిన్లు.. కాల్షియం, సెలీనియం, పొటాషియం, సోడియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉన్నాయని డా. ప్రమీల తెలిపారు. బి12 విటమిన్‌ కేన్సర్‌ రాకుండా చేస్తుందని, కేన్సర్‌ను నయం చేస్తుందన్నారు. పుట్టగొడుగులను క్రమం తప్పకుండా తింటే చర్మ సమస్యలు ఉపశమిస్తాయని, బీపీ నియంత్రణలో ఉంటుందని, పీచు పుష్కలంగా ఉండటం మూలాన ఊబకాయాన్ని తగ్గించడంలోనూ ఉపకరిస్తాయన్నారు. ఎండబెట్టిన పుట్టగొడుగుల పొడితో జావ చేసుకొని తాగినా, ఎండబెట్టిన పుట్టగొడుగులను నానబెట్టుకొని కూర వండుకొని తిన్నా విటమిన్‌ డి లోపం తగ్గిపోతుందని ఆమె వివరించారు. ఎండబెట్టుకోవడానికి ఆయిస్టర్‌ మష్రూమ్స్‌ అనువుగా ఉంటాయన్నారు.
వివరాలకు.. డా. ప్రమీలను 040–24015011 నంబరు ద్వారా సంప్రదించవచ్చు.
∙ఎండిన పుట్టగొడులతో డా. ప్రమీల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement