ఆదివారం, 24. జూన్ 2018. సౌదీలో వీధులన్నీ కోలాహలంతో నిండిపోయాయి. ఎక్కడ చూసినా పండుగ వాతావరణమే. న్యూ ఇయర్‌లా! అంతకన్నా ఎక్కువే. ఓ కొత్త శకంలా.
అసలు శనివారం అర్ధరాత్రి గడియారం ముళ్లు 12 మీదకు రాగానే, వీధులన్నీ హర్షాతిరేకపు జల్లులతో నిండిపోయాయి. రియాద్, జెడ్డా, దమ్మమ్‌లలో మహిళలంతా దీపాలు పట్టుకుని తిరిగారు. ‘‘నేను మా వారి కారును ఈ రోజు ఉపయోగించుకున్నాను. త్వరలోనే నా కారు నేను కొనుక్కుందామనుకుంటున్నాను. ఈ రోజు ఇక్కడ అంతా వింతగా, కొత్తగా కనిపిస్తోంది. ఇది నిజంగానే సౌదీ మహిళలకు పండుగరోజు’’ అన్నారు సౌదీ మహిళ బయన్. సౌదీ మీడియా వీరిని అనుసరించి ప్రపంచానికి వీరి ఆనందాన్ని పంచింది. స్టీరింగ్ తమ చేతికి రావడాన్ని స్వాతంత్య్రానికి తొలి అడుగు పడినట్లు భావిస్తున్నారు సౌదీ మహిళలు. సుమారు 30 సంవత్సరాల తరవాత నిషేధాన్ని ఎత్తివేయడమే ఇంత ఆనందానికీ కారణం. 1990లో పోలీసులు, లైసెన్స్ ఏజెన్సీలు కలిసి మహిళల డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేసి, మహిళలు డ్రైవింగ్ చేయడాన్ని నిషేధించిన రోజు నుంచి అక్కడి మహిళలు తిరుగుబాటు చేయడం ప్రారంభించారు.
ఇటీవలే పట్టాభిషిక్తుడైన మొహమ్మద్ బిన్ సల్మాన్ సౌదీలో సంస్కరణలకు నడుం బిగించారు. సాంఘిక, ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టాడు. ఇందులో భాగంగానే మహిళలు స్వేచ్ఛగా వాహనాలు నడుపుకునేలా చట్టం తీసుకొచ్చారు. ‘‘ఇక్కడ జీవితం ఒక్కోసారి దుర్భరంగా అనిపిస్తుంది’ అంటారు బయాన్. సిరియాకి చెందిన బయాన్, డమస్కస్‌లో చదువుకుంటున్న రోజుల్లో డ్రైవింగ్ నేర్చుకున్నారు.‘‘సూపర్ మార్కెట్‌కి వెళ్లడానికి కూడా ఇతరుల మీద ఆధారపడటం చాలా చిరాకుగా ఉండేది. కనీసం పది నిమిషాల దూరానికి కూడా స్వేచ్ఛగా ప్రయాణించ లేకపోవడం బాధాకరం. ఇప్పుడు ఒక అడుగు ముందుకు పడటం ఎంతో ఆనందంగా ఉంది. పురుషాధిక్యం ఉన్న సౌదీ అరేబియాలో మహిళలు ఎవరో ఒకరి మీద ఆధారపడుతూ, సెకండ్ క్లాస్ సిటిజన్‌గా, నిర్ణయాలు తీసుకోలేని వారిగా ఉండటం మాకు ఎంతో బాధగా ఉంటుంది’’ అంటున్నారు బయాన్.
– రోహిణి
ఎక్కడికైనా వెళ్లగలను
రైడ్ హెయిలింగ్ యాప్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్‌ను తీసుకున్న మొట్టమొదటి సౌదీ అమ్మాయిని నేనే. ఈ రోజు నాకు స్వేచ్ఛ లభించింది. ఏ సమయంలోనైనా ఎక్కడికైనా నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్లే హక్కును సాధించాను. నేను డ్రైవింగ్ స్కూల్ కూడా పెట్టాను. సౌదీలో మహిళా కాల్ సెంటర్ కూడా స్థాపించాను. ఇక్కడ ఇదే ఏకైక మహిళా కాల్ సెంటర్. త్వరలోనే 20 వేల మంది మహిళా డ్రైవర్లు వచ్చేలా చూస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం.
– కరీమ్, సౌదీ మహిళ
నా జీవితంలో మంచిరోజు
ఆర్థికంగా స్వేచ్ఛగా బతకడానికి, సంఘంలో నిలదొక్కుకోవడానికి డ్రైవింగ్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది. నేను హాయిగా నాకు కావలసినవారిని కలవడానికి స్వేచ్ఛగా వెళ్లగలుగుతాను. నా జీవితంలో ఇంత మంచి అవకాశం వచ్చినరోజు మరొకటి లేదేమో.
– ఈనామ్ ఘాజీ అల్ అస్వాద్, సౌదీ మహిళ
Comments
Please login to add a commentAdd a comment