మనీ మనీ...
స్వప్నలిపి
కొందరికి అదే పనిగా డబ్బు కలలోకి వస్తుంటుంది. లాటరీ ఏదో గెలుచుకున్నట్లు... ఒక్కసారిగా ధనవంతుడై పోయినట్లు, భూమిని తవ్వుతుంటే కట్టలు, కట్టలుగా డబ్బు వస్తున్నట్లు... ఇలాంటి విచిత్రమైన కలలు కూడా వస్తుంటాయి. దీని అర్థం...డబ్బు మీద విపరీతమైన వ్యామోహం ఉన్నట్లు కాదు. ఒక విధంగా చెప్పాలంటే, కలలో కనిపించే ‘డబ్బు’ అసలు డబ్బు కానే కాదు.
మరి ఏమిటి?
విజయం. ఆత్మవిశ్వాసం. విలువలు... వీటిని డబ్బు ప్రతిబింబిస్తుంది. మన మీద మనకు ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు అది విజయానికి దారి చూపుతుంది. ఇక్కడ ‘ఆత్మవిశ్వాసం’ అనేది విలువైన పాత్రను పోషిస్తుంది. ఆ విలువ ‘డబ్బు’ రూపంలోనో, ‘బంగారం’ రూపంలోను ప్రతిఫలిస్తుంది.హృదయానికి సంబంధించిన రకరకాల అనుభూతులు కూడా డబ్బు రూపంలో కలలోకి వస్తాయి. ఉదా: ఒక అమ్మాయిని ప్రేమించారు. ఇప్పుడు ప్రపంచంలో మీకు అత్యంత విలువైనది ఈ ‘ప్రేమ’ మాత్రమే. ఆ విలువ ‘డబ్బు’గా కలలో దర్శనమిస్తుంది.
డబ్బుకు సంబంధించి మరికొన్ని కలలు...
బ్రీఫ్‌కేస్‌లో డబ్బును భద్రంగా తీసుకువెళుతుంటే, దొంగలు దాడి చేసి దోచుకెళతారు. రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఎవరో జేబు కొట్టేస్తారు...ఇలాంటి కలలు కూడా వస్తుంటాయి. డబ్బును కోల్పోవడం అనేది లక్ష్యానికి దూరం కావడాన్ని, ఆత్మీయులు దూరం కావడాన్ని, నిత్యజీవితంలోని అశాంతిని సూచిస్తుంది. మానసికంగా బలహీనంగా ఉన్న సందర్భంలో కూడా ఇలాంటి కలలు వస్తుంటాయి. ‘నా జీవితం నా చేతుల్లో లేకుండా పోయింది’ అని కుమిలిపోతున్నప్పుడు కూడా డబ్బు దొంగిలించబడినట్లు కలలు వస్తుంటాయి.
చివరగా ఒక్క మాట:
ఈసారి డబ్బు కలలో కనిపించినా లేదా డబ్బు దొంగిలించబడినట్లు కల వచ్చినా...మిమ్మల్ని మీరు విశ్లేషించుకోండి. కొత్త విషయాలు తెలియవచ్చు. ప్రయత్నించి చూడండి!