Svapnalipi
-
కలలో చిలుకా... కాస్త చెప్పవా!
స్వప్నలిపి చిలకది చూడచక్కని రూపం. ఏ చెట్టుపైనో చిలకను చూసీ చూడగానే ‘ఆహా’ అనుకుంటాం. మరి కలలో కనిపిస్తే? ‘ఆహా’ అనడం మాట అలా ఉంచి, కాస్త ఆలోచించాల్సిందే అంటున్నారు స్వప్నవిశ్లేషకులు. వారి విశ్లేషణల్లో కొన్ని... చిలక మీ కలలో కనిపించింది అంటే, మీరు చేయకూడని వారితో స్నేహం చేస్తున్నారని అర్థం. చిలక ఈకలు కలలో కనిపించడం అనేది... మీకు ఉన్న స్నేహితులలో బూటకపు స్నేహితులు, పక్కదారి పట్టించే స్నేహితులు ఎక్కువ ఉన్నారనేదాన్ని ప్రతిబింబిస్తుంది. ‘పంజరంలో చిలక’ కలలో కనిపిస్తే ... మీరు తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని పక్కదోవ పట్టిస్తున్నాయని లేదా ఊపిరి సలపని పనితో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని అర్థం. చిలక మిమ్మల్ని కొరికినట్లు కల వస్తే... మిమ్మల్ని చూసి కొందరు ఈర్ష్యపడుతున్నారని అర్థం. వేరే వాళ్లను చిలక కొరికినట్లు కల వస్తే... ఏదో విషయంలో ఆ వ్యక్తిని మీరు అప్రతిష్ఠపాలు చేస్తున్నట్లు అర్థం. రెక్కలు దెబ్బతిన్న చిలక... ఎగరలేక ఇబ్బంది పడుతున్న దృశ్యం మీ కలలోకి వస్తే, మీరు మార్పు కోరుకుంటున్నప్పటికీ, ఆ మార్పుకు అవసరమైన పరిస్థితులు మీకు అనుకూలంగా లేవని అర్థం. ఏం మాట్లాడినా...వల్లె వేసే చిలక కలలోకి వస్తే... మీకంటూ సొంత అభిప్రాయం లేకుండా ఉన్నారని, ఎవరు ఏది చెప్పినా దాన్ని గుడ్డిగా సమర్థించడం తప్ప, వాస్తవ ప్రాతిపాదికగా మీరు అభిప్రాయ ప్రకటన చేయడం లేదని అర్థం చేసుకోవాలి. చేతిపైన చిలక వచ్చి కూర్చున్నట్లు యువతులకు కల వస్తే వారి ప్రేమ ఫలించడానికి సూచనగా అర్థం చేసుకోవాలి. -
కలలో కల్లోల సముద్రం
స్వప్నలిపి మన కలలో అప్పుడప్పుడు... సముద్రం ముందు మౌనంగా కూర్చొని ఉంటాం. కొన్నిసార్లు సముద్రం ఏ శబ్దం లేకుండా మౌనంగా ఉన్నట్లు కనిపిస్తుంది. కొన్నిసార్లు దిక్కులు పిక్కటిల్లేలా ఊగిపోతుంది. కల్లోల కడలిగా మారుతుంది. నిజానికి కొద్దిమంది, సముద్రాన్ని ఏ సినిమాల్లోనో తప్ప ఎక్కడా చూసి ఉండరు. ‘సముద్రాన్ని చూడలేదు’ అనే నిరాశ, చూడాలనే కోరిక ఇలా కలగా వస్తుందా? కానే కాదు. కలలో కనిపించే సముద్రం జీవితానికి ప్రతీకలాంటిది. నిశ్శబ్దంగా ఉండే సముద్రం... మీలోని అసాధారణమైన అంతర్గత శక్తిని, భావోద్వేగ, ఆధ్యాత్మిక సమన్వయాన్ని ప్రతిబింబిస్తుంది. సముద్రం, అల్లంత దూరాన నిండు చంద్రుడు కనిపిస్తే... మీ జీవితం సుఖసంతోషాలతో హాయిగా గడిచిపోతుందని అర్థం. ఇక కల్లోల సముద్రం మీలో ఉండే...అసాధారణమైన ధైర్యాన్ని ప్రతిబింబిస్తుంది. అంటే, ఎలాంటి విషమ పరిస్థితిని అయినా తట్టుకోగలిగే సామర్థ్యం మీలో ఉన్నట్లు అర్థం. కేవలం శక్తిసామర్థ్యాలకు సంబంధించిన విషయాలనే కాకుండా, రకరకాల పరిస్థితుల ఆధారంగా ఉత్పన్నమయ్యే మానసికస్థితిగతులను ‘కడలి కల’ ప్రతిఫలిస్తుంది. ఉదా: మీలో మానసిక ప్రశాంతత లోపించిన సంఘటన ఏదైనా జరిగినప్పుడు...కల్లోలకడలికి సంబంధించిన కలలు వస్తుంటాయి. ఫ్రాయిడ్ ప్రకారం: దూరంగా కనిపిస్తున్న సముద్రం... మీకు విశ్రాంతి లేని విషయాన్ని సూచిస్తుంది. మీరు ఏదైనా విషయాన్ని కనుగోవాలని ప్రయత్నిస్తున్నప్పుడు...సముద్రంలో ఈత కొడుతున్నట్లు కల వస్తుంది. ‘నా నిర్ణయాన్ని అమలు చేయడానికి ఇది సరియైన సమయం’ అని మనసులో బలంగా అనుకున్నప్పుడు కూడా ఇలాంటి కలలు వస్తాయి. -
కలలో పాము కనిపించిందా?
స్వప్నలిపి ‘వామ్మో’ అని అరుస్తూ హఠాత్తుగా నిద్రలేస్తారు. ‘‘ఏమైంది?’’ అని అడిగేలోపే ‘పాము...పాము’ అని అరుస్తారు. అది నిజమైన పాము కాదని, కలలోకి వచ్చిన పాము అనే స్పృహ వచ్చిన తరువాత శాంతిస్తారు. ఇంతకీ కలలోకి పాములు ఎందుకు వస్తాయి? దీని గురించి స్పప్నవిశ్లేషకులు ఇలా చెబుతారు... భయం.. అసహ్యం కొందరికి పాములంటే అసహ్యంతో పాటు భయం కూడా ఉంటుంది. తాడు, కట్టెలాంటి వస్తువులను చూసి ‘సర్పభ్రమ’కు గురవుతుంటారు. మనసులో పాము పట్ల ఉన్న భయం లేదా అసహ్యమే ఇలా భ్రమ కల్పిస్తుంది. కలలోకి వస్తుంది. ఊహించని సంఘటనలు... ఎన్నడూ ఊహించిన సంఘటనలు ఎదురైనప్పుడు భయానికి లోనవుతాం. ఈ ఆకస్మిక భయం ‘పాము’ రూపంలో కలలోకి వస్తుంది. ఒక విషయం మన పరిధి దాటి వెళ్లినప్పుడు, ఇక ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఇలాంటి పాము కల వస్తుంది. బెదిరింపులు... డబ్బు కోసమో, ఇంకేదైనా విషయంలోనో బెదిరింపులకు గురైనప్పుడు... వాటిని ఎదుర్కొనే శక్తి, అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు ఇబ్బంది ఏమీ ఉండదు. ఎప్పుడైతే బెదిరింపుల గురించి నలుగురికీ చెప్పుకోలేని పరిస్థితి ఉంటుందో, చెప్పుకుంటే ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఏర్పడుతుందో...అప్పుడు మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడి కలలో పాముగా మారుతుంది. ఫ్రాయిడ్ మాట! సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతం ప్రకారం... కలలో పాము కనిపించడం అనేది అణచివేసుకున్న ఆలోచనలు, లైంగిక శక్తి, శృంగారదాహాన్ని ప్రతిబింబిస్తుంది. -
కాళ్లకు చెప్పులు లేకుండా నడిచారా?
స్వప్నలిపి కలలో... చెప్పులు వేసుకోకుండా రోడ్డు మీద నడుస్తుంటాం. కాళ్లకు చెప్పులు లేవనే విషయం హఠాత్తుగా గుర్తుకు వచ్చి వెనక్కి వెళ్లే లోపే....మెలకువ వస్తుంది! గుడి నుంచి బయటికిరాగానే...చెప్పులు కనిపించవు. ఫంక్షన్లో భోజనం చేసి బయటికి రాగానే...చెప్పులు కనిపించవు. చెప్పులు లేని కాళ్లతో రోడ్డు మీద నడుస్తుంటాం. అర్థం ఏమిటి? చెప్పులు లేని కాళ్లతో రోడ్డు మీద నడవడం...అనే కలకు ప్రత్యేక కారణం ఏదైనా ఉందా? ‘ఉంది’ అంటున్నారు స్వప్నవిశ్లేషకులు. వారు చెప్పే దాని ప్రకారం... స్వాతంత్య్రం, జీవిక కోల్పోవడం, దివాళా తీయడం... మొదలైన వాటిని ఈ కల ప్రతిబింబిస్తుంది. మీలో మొదటి నుంచి స్వతంత్ర దృక్పథం ఎక్కువ. తప్పనిసరి పరిస్థితులలో ఆ స్వేచ్ఛను కోల్పోవలసి రావచ్చు. పైకి బాగానే ఉన్నప్పటికీ, అంతరాంతరాలలో అసంతృప్తి. ఉద్యోగం కోల్పోయినప్పుడు లేదా సంపద కోల్పోయినప్పుడు జీవితాన్నే కోల్పోయినట్లుగా విషాదంలో కూరుకుపోతారు కొందరు. ‘ఏమీ మిగల్లేదు’ అనుకుంటారు... ఈ స్థితిని చెప్పులు లేని నడక లేదా ‘అసౌకర్యమైన నడక’ ప్రతిఫలిస్తుంది. ‘‘ఇంకొద్ది రోజుల్లో సమస్యలు ఎదుర్కోబోతున్నాను’’ అనే ముందస్తు భయాల నుంచి కూడా ఇలాంటి కలలు పుడుతుంటాయి. ఒక మాట శాస్త్రీయ విశ్లేషణ మాట ఎలా ఉన్నప్పటికీ వివిధ దేశాలలో ‘చెప్పులు లేకుండా నడవడం’ అనే కలకు ‘కోల్పోవడం’ ‘దివాళా తీయడం’ లాంటి సంప్రదాయ అర్థాలు ఉన్నాయి. ఉదా: అరబ్ దేశాలలో చెప్పులు లేకుండా నడవడం అనే కలకు... సంప్రదాయ అర్థం: అనారోగ్యం, నష్టపోవడం. -
మనీ మనీ...
స్వప్నలిపి కొందరికి అదే పనిగా డబ్బు కలలోకి వస్తుంటుంది. లాటరీ ఏదో గెలుచుకున్నట్లు... ఒక్కసారిగా ధనవంతుడై పోయినట్లు, భూమిని తవ్వుతుంటే కట్టలు, కట్టలుగా డబ్బు వస్తున్నట్లు... ఇలాంటి విచిత్రమైన కలలు కూడా వస్తుంటాయి. దీని అర్థం...డబ్బు మీద విపరీతమైన వ్యామోహం ఉన్నట్లు కాదు. ఒక విధంగా చెప్పాలంటే, కలలో కనిపించే ‘డబ్బు’ అసలు డబ్బు కానే కాదు. మరి ఏమిటి? విజయం. ఆత్మవిశ్వాసం. విలువలు... వీటిని డబ్బు ప్రతిబింబిస్తుంది. మన మీద మనకు ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు అది విజయానికి దారి చూపుతుంది. ఇక్కడ ‘ఆత్మవిశ్వాసం’ అనేది విలువైన పాత్రను పోషిస్తుంది. ఆ విలువ ‘డబ్బు’ రూపంలోనో, ‘బంగారం’ రూపంలోను ప్రతిఫలిస్తుంది.హృదయానికి సంబంధించిన రకరకాల అనుభూతులు కూడా డబ్బు రూపంలో కలలోకి వస్తాయి. ఉదా: ఒక అమ్మాయిని ప్రేమించారు. ఇప్పుడు ప్రపంచంలో మీకు అత్యంత విలువైనది ఈ ‘ప్రేమ’ మాత్రమే. ఆ విలువ ‘డబ్బు’గా కలలో దర్శనమిస్తుంది. డబ్బుకు సంబంధించి మరికొన్ని కలలు... బ్రీఫ్‌కేస్‌లో డబ్బును భద్రంగా తీసుకువెళుతుంటే, దొంగలు దాడి చేసి దోచుకెళతారు. రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఎవరో జేబు కొట్టేస్తారు...ఇలాంటి కలలు కూడా వస్తుంటాయి. డబ్బును కోల్పోవడం అనేది లక్ష్యానికి దూరం కావడాన్ని, ఆత్మీయులు దూరం కావడాన్ని, నిత్యజీవితంలోని అశాంతిని సూచిస్తుంది. మానసికంగా బలహీనంగా ఉన్న సందర్భంలో కూడా ఇలాంటి కలలు వస్తుంటాయి. ‘నా జీవితం నా చేతుల్లో లేకుండా పోయింది’ అని కుమిలిపోతున్నప్పుడు కూడా డబ్బు దొంగిలించబడినట్లు కలలు వస్తుంటాయి. చివరగా ఒక్క మాట: ఈసారి డబ్బు కలలో కనిపించినా లేదా డబ్బు దొంగిలించబడినట్లు కల వచ్చినా...మిమ్మల్ని మీరు విశ్లేషించుకోండి. కొత్త విషయాలు తెలియవచ్చు. ప్రయత్నించి చూడండి! -
వాన కలలో తడిసిపోయారా?!
స్వప్నలిపి వానలో చిక్కుకుపోయినట్లు, బాగా తడిసిపోయినట్లు అప్పుడప్పుడు కల వస్తుంటుంది. కలలో కనిపించే వానకు రెండు భిన్నమైన కోణాలు ఉన్నాయి. ఒకటి సంతోషం. రెండోది విషాదం. సంతోషం: ఊహించని విజయం సాధించినప్పుడు, ఒక మంచి పని చేసి ఇతరుల మెప్పు పొందినప్పుడు, వ్యాపారంలో ఊహించని లాభాలు వచ్చినప్పుడు, పెద్ద వాళ్ల అమూల్యమైన దీవెనలు లభించినప్పుడు, మన పట్ల ఎవరైనా దయగా ప్రవర్తించినప్పుడు...మనసు ఆహ్లాదంగా ఉంటుంది. ఆ ఆహ్లాదమే కలలో వాన! చిన్న చిన్న చినుకులు. వర్షం వచ్చినట్లు కాదు...అలా అని రానట్లు కూడా కాదు. చిన్నటి చినుకులకు చిరుగాలి తోడైన సందర్భాన్ని సంతోషంగా ఆస్వాదిస్తుంటాం. ఇది మన మానసిక ఉల్లాసాన్ని ప్రతిబింబించే దృశ్యం. ఎప్పుడైనా ఎవరికైనా వాగ్దానం చేసి, దాన్ని నెరవేర్చిన శుభసందర్భంలో కూడా కలలో చిరు వర్షం పలకరిస్తుంది. కొన్ని సందర్భాలలో బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా మన ఇంటి మీదే వర్షం కురుస్తుంటుంది. కుటుంబంలోని ఆప్యాయత,అనురాగాలు, సంతోషాలకు ఈ ప్రత్యేక వాన ప్రతీక. విషాదం: ఉన్నట్టుండి పే...ద్ద వానలో చిక్కుకుపోతాం. తల దాచుకోవడానికి ప్రయత్నిస్తాం. అది కుదరక పూర్తిగా తడిసిపోతాం. సమస్యల్లో చిక్కుకుపోయినప్పుడు, వాటికి పరిష్కారం ఒక పట్టాన దొరకనప్పుడు...ఇలాంటి కలలు వస్తుంటాయి. కేవలం... మన ఇంటి మీదే భారీ వర్షం కురిసినట్లు కల వస్తే... ఇంట్లో ఎవరో ఒకరు అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు అర్థం. కొన్నిసార్లు రాళ్ల వర్షం కురిసినట్లు, రక్తపు వర్షం కురిసినట్లు కూడా కల వస్తుంది. మోసం, వెన్నుపోటుకు గురైన విషాదం మూలంగా వచ్చే కల ఇది. -
మీ స్నేహితుడు చనిపోయాడా?!
స్వప్నలిపి ఏ అర్ధరాత్రో, తెల్లవారుజామునో దిగ్గుమని మెలకువ వస్తుంది. పాడు కలను ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటారు... కలలో...మీ ఫ్రెండ్‌కు యాక్సిడెంట్ జరిగి చనిపోతాడు! ‘ఫ్రెండ్‌ను గుండెలో పెట్టుకొని ప్రేమించే నాకు ఇలాంటి కల రావడం ఏమిటి?’ అని ఆశ్చర్యపోతారు. ఆ కలను అసహ్యించుకుంటారు. స్నేహితుడికే కాదు... ఆ కలను ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి. ‘‘నీకు తప్ప ఇలాంటి కలలు ఎవరికి వస్తాయి!’’ అని వెక్కిరిస్తారేమోనని భయం. అలాంటి కలలకు అర్థం ఇది మనం ఎవరినైనా బాగా ప్రేమిస్తున్నప్పుడు, అభిమానిస్తున్నప్పుడు...వారి బాగోగులు, యోగక్షేమాల గురించి చాలా ఎక్కువ శ్రద్ధ పెడతాం. ఉదాహరణకు... ‘వెళ్లొస్తాను’ అని స్నేహితుడు టాటా చెప్పి బైక్ మీద బయలుదేరే సమయంలో ‘జాగ్రత్తగా వెళ్లు’ అంటాం. ఇక మన మనసు మహల్లో ఈ ‘జాగ్రత్త’ రకరకాల రూపాలు ధరిస్తుంది. అనేకానేక ప్రశ్నలు పుట్టగొడుగుల్లా పుడుతుంటాయి. ‘జాగ్రత్తగానే వెళ్లాడా?’ ‘మొన్న ఒక రోడ్డు యాక్సిడెంట్‌ను కళ్లారా చూశాను. వీడికి అలా కాలేదు కదా?’ ‘డ్రైవింగ్ చేస్తూ ఏదో ఆలోచిస్తుంటాడు. ఎన్నో సార్లు చెప్పాను, అలా ఆలోచించవద్దని. జాగ్రత్తగానే వెళ్లి ఉంటాడా?’ ‘వేగంగా డ్రైవ్ చేయవద్దని వెయ్యిసార్లు చెప్పి ఉంటాను. ఇప్పుడు కూడా అలానే వెళ్లి ఉంటాడా?...’ ఇలా రకరకాల జాగ్రత్తలన్నీ కలిసి ఒక రూపాన్ని తీసుకుంటాయి. అవే కలలుగా మారుతాయి. అంతకు మించి ఇలాంటి కలల గురించి భయపడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. -
రోజంతా చేతులు కడుగుతున్నారా?
స్వప్నలిపి ఒక కల తరచుగా వస్తుంటుంది... ఆ కలలో చేతులు కడుగుతూ కనిపిస్తాం. కొన్నిసార్లు అయితే మరీ విచిత్రమైన కల కూడా వస్తూ ఉంటుంది. మరే పని లేనట్లు రోజంతా చేతులను కడుగుతూనే ఉంటాం. ‘ఆరోగ్య స్పృహ నాలో ఎక్కువైందా?’ ‘శుభ్రత గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నానా?’ ఇలాంటి సందేహాలు మదిని చుట్టుముడతాయి. నిజానికి ఆరోగ్యానికి సంబంధించిన స్పృహకూ, ఈ కలకూ ఎలాంటి సంబంధం లేదు! మరి ఈ కల ఉద్దేశం ఏమిటి? మనకు కొన్ని పశ్చాత్తాపాలు ఉంటాయి. వాటిని చెప్పుకోవాల్సిన వారి దగ్గర చెప్పుకుంటే మనసు శాంతిస్తుంది. అక్కడితో ఆ పశ్చాత్తాపానికి చెల్లుచీటీ దొరుకుతుంది. కానీ అన్నీ సందర్భాల్లోనూ అది కుదరకపోవచ్చు. అది ఒక బాధగా మనసులో మిగిలిపోవచ్చు. ‘చేతులు కడుక్కోవడం’ అనేది పశ్చాత్తాపానికి సంబంధించిన భావనకు ప్రతీక. కొన్నిసార్లు... మనం అత్యంత వినయంగా చేతులు కట్టుకున్నట్లుగా కల వస్తుంది, ఎదురుగా మాత్రం ఎవరూ కనిపించరు! మనకు బాగా నచ్చిన వ్యక్తి, గౌరవించే వ్యక్తి, అభిమానించే వ్యక్తి... కలవడానికి అందుబాటులో ఉండనంత దూరంలో ఉన్నప్పుడు, లేదా ఏవో కారణాల వల్ల కలవడానికి కుదరనప్పుడు ఇలాంటి కలలు వస్తుంటాయి. -
అయ్యో.. పళ్ళు విరిగిపోయాయా?
స్వప్నలిపి ఉన్నట్టుండి...ఠక్కున మెలకువ వస్తుంది. చేతులు నోరును తడుముతాయి. ‘‘హమ్మయ్యా...పళ్ళకేమీ కాలేదు’’ అనుకుంటాం. భయపెట్టిన కలను గుర్తుకు తెచ్చుకుంటాం. కలలో.. మైసూర్‌పాక్ కొరకగానే... ముందు పళ్ళు విరిగిపోతాయి. ఏదో జోక్ విని గట్టిగా నవ్వుతుంటాం...ఆ శబ్దానికే పళ్ళు విరిగిపోతాయి. పొద్దున పళ్ళు తోముకుంటున్నప్పుడు... ఒకటి తరువాత ఒకటి పళ్ళు విరిగిపోతుంటాయి. మైసూర్‌పాక్ కొరికితే, బ్రష్ చేస్తే...పళ్ళు విరగడమేమిటి? ఇలాంటి వింత కలలను గుర్తు తెచ్చుకున్నప్పుడు తెగ నవ్వొస్తుంది. అంతమాత్రాన ఆ కల తీసిపారేయదగిన కల కాదు. దానిలో రహస్య భయం ఉంది. అదేమిటో తెలుసుకుందాం... తలలో ఒక తెల్లవెంట్రుక కనిపించినా కొందరు ఆందోళన పడిపోతారు. ‘వయసు మీద పడుతోంది’ అనే భయం వారిని అంతర్గతంగా పీడిస్తుంటుంది. ‘చూడడానికి నేను అందంగా ఉంటాను. వయసు మీద పడితే నా అందం సంగతి ఏమిటి? కొంతకాలానికి పళ్ళు ఉండవు, బోసి నోరు, మోకాళ్ల నొప్పులు..’ ఇలా ఏవేవో ఊహిస్తూ చేసే ఆలోచనలే కలల రూపంలో వస్తాయి. వయసు గురించిన భయాలను ప్రతిబింబించే కల ఇది. -
బస్సు మిస్ అయ్యారా?
స్వప్నలిపి బస్ అనే కాదు... కారు, రైలు, విమానం... మిస్ అయినట్లు కొందరికి తరచుగా కల వస్తుంది. నిజజీవితంలో మాత్రం అలాంటి సంఘటనలు ఏవీ జరిగి ఉండవు. మరి ఎందుకు ఇలాంటి కలలు వస్తాయి? కలలో కనిపించే రవాణా సాధనం... లక్ష్యం, కోరిక, ఆశయానికి ప్రతీకలాంటిది. కొందరు... ఒక లక్ష్యం ఏర్పర్చుకుంటారు. ఆరునూరైనా సరే ఆ లక్ష్యాన్ని చేరుకుంటారు. అదృష్టవశాత్తు పరిస్థితులు కూడా వారికి సహకరిస్తాయి. మరి కొందరు... లక్ష్యం ఏర్పర్చుకుంటారు. లక్ష సాధనలో విజయం సాధించడానికి శతవిధాల ప్రయత్నిస్తారు. కానీ ఏవో అడ్డంకులు, రాజీ పడక తప్పని పరిస్థితులు ఎదురవుతాయి. ‘‘నేను ఒకటి తలిస్తే... పైవాడొకడు తలిచాడు’’ అని రాజీ పడిపోతారు. లక్ష్యానికి దూరంగా జరిగి పోతారు. అంతమాత్రాన... ఆ లక్ష్యం మీద ప్రేమ దూరమైనట్లు కాదు...అదెక్కడికీ వెళ్లదు. మీలోనే ఉంటుంది. ‘‘నన్ను చేరుకోలేక పోయావు!’’ అని వెక్కిరిస్తుంది. మరొకటి ఏమిటంటే, ఒక అద్భుతమైన అవకాశం మీ దగ్గరికి వచ్చినప్పుడు తెలిసో తెలియకో ఆ అవకాశాన్ని చేజార్చుకుంటారు. ఆ చేజారిన అదృష్టం బస్సుగానో, రైలుగానో కలలో కనిపిస్తుంది. ఏ నిర్ణయం తీసుకోవాలి? అనే విషయంలో స్పష్టత లేనప్పుడు కూడా ఇలాంటి కలలు వస్తుంటాయి. -
ఎవరో వెంటాడుతున్నారా?
స్వప్నలిపి ప్రపంచ వ్యాప్తంగా సాధారణంగా వచ్చే కల....మనల్ని ఎవరో వెంటాడడం. ‘‘నాకెవరూ శత్రువులు లేరు...ఎందుకిలాంటి కల వచ్చింది?’’ అని కొందరు, ‘‘గత జన్మలో నా శత్రువులెవరైనా ఇలా వెంటాడుతున్నారా?’’ అని మరికొందరు ఆలోచిస్తుంటారు. నిజానికి ఆ శత్రువులు మనలోనే ఉన్నారు. ‘‘ఎగ్జామ్స్ దగ్గరపడుతున్నాయి. అయ్యో! అసలేమీ ప్రిపేర్ కాలేదు’’ ఒక స్టూడెంట్ భయం ఇది. ఆ భయానికి పెద్ద మీసాలు వస్తాయి. కండలు వస్తాయి. ఆ భయం ఒక రౌడీలా తయారై కలలోకి వస్తుంది. ‘‘అప్పు అంతకంతకూ పెరిగిపోతుంది. ఎలా తీర్చాలిరా దేవుడా’’ ఇది ఒక మిడిల్ క్లాస్ సుబ్బారావు ముందస్తు ఆందోళన. ఆ ఆందోళన అనకొండగా మారి మన అంతఃచేతనలోకి వెళ్లిపడుకుంటుంది. సమయం చూసి వెంటాడుతుంది. మనల్ని నిద్రలో పరుగెత్తించే శక్తులు రకరకాలుగా ఉంటాయి. మనం భయపడే విషయాలు, ఒప్పుకోవడానికి మనస్కరించని వాస్తవాలు, రాజీపడేలా నడిపించే పద్ధతులు, నచ్చని వాటిని నచ్చినట్లు తలకెత్తుకునే బరువులు...ఇవన్నీ రకరకాల రూపాలు ధరించి కలలో మనల్ని వెంటాడుతుంటాయి. అంతేతప్ప పూర్వజన్మకు ఈ కలకు ఎలాంటి సంబంధం లేదు.