కలలో పాము కనిపించిందా?
స్వప్నలిపి
‘వామ్మో’ అని అరుస్తూ హఠాత్తుగా నిద్రలేస్తారు.
‘‘ఏమైంది?’’ అని అడిగేలోపే ‘పాము...పాము’ అని అరుస్తారు. అది నిజమైన పాము కాదని, కలలోకి వచ్చిన పాము అనే స్పృహ వచ్చిన తరువాత శాంతిస్తారు.
ఇంతకీ కలలోకి పాములు ఎందుకు వస్తాయి?
దీని గురించి స్పప్నవిశ్లేషకులు ఇలా చెబుతారు...
భయం.. అసహ్యం
కొందరికి పాములంటే అసహ్యంతో పాటు భయం కూడా ఉంటుంది. తాడు, కట్టెలాంటి వస్తువులను చూసి ‘సర్పభ్రమ’కు గురవుతుంటారు. మనసులో పాము పట్ల ఉన్న భయం లేదా అసహ్యమే ఇలా భ్రమ కల్పిస్తుంది. కలలోకి వస్తుంది.
ఊహించని సంఘటనలు...
ఎన్నడూ ఊహించిన సంఘటనలు ఎదురైనప్పుడు భయానికి లోనవుతాం. ఈ ఆకస్మిక భయం ‘పాము’ రూపంలో కలలోకి వస్తుంది.
ఒక విషయం మన పరిధి దాటి వెళ్లినప్పుడు, ఇక ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఇలాంటి పాము కల వస్తుంది.
బెదిరింపులు...
డబ్బు కోసమో, ఇంకేదైనా విషయంలోనో బెదిరింపులకు గురైనప్పుడు... వాటిని ఎదుర్కొనే శక్తి, అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు ఇబ్బంది ఏమీ ఉండదు.
ఎప్పుడైతే బెదిరింపుల గురించి నలుగురికీ చెప్పుకోలేని పరిస్థితి ఉంటుందో, చెప్పుకుంటే ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఏర్పడుతుందో...అప్పుడు మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడి కలలో పాముగా మారుతుంది.
ఫ్రాయిడ్ మాట!
సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతం ప్రకారం... కలలో పాము కనిపించడం అనేది అణచివేసుకున్న ఆలోచనలు, లైంగిక శక్తి, శృంగారదాహాన్ని ప్రతిబింబిస్తుంది.