మార్కాపురం: పొలాల్లో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వర్షాలు కురవడంతో పాములు పుట్టల్లో నుంచి పొలాల్లోకి వచ్చి రైతులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఏ క్షణం ఎటువైపు నుంచి ఎలాంటి పాము వస్తుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి, మిరప పొలాల్లోనే పాముల సంచారం అధికంగా ఉంది. వారం రోజుల క్రితం పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన రామచంద్రాపురం రైతు పాముకాటుకు గురయ్యారు. సకాలంలో చికిత్స అందించడంతో ప్రాణానికి ప్రమాదం తప్పింది.
హలో.. సార్.. పాము!
పాముల్లో అత్యంత విషపూరితమైన పాముల్లో మొదటిది రక్తపింజర, రెండోది తాచు, మూడోది కట్ల పాము. మార్కాపురం ప్రాంతంలో ఇటీవల కాలంలో ఎక్కువగా రక్తపింజరలు సంచరిస్తుండటంతో ప్రజలు, పొలాలకు వెళ్లే రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. మార్కాపురం ప్రాంతంలో అధికారికంగా స్నేక్ రెస్క్యూ టీమ్ సభ్యుడైన నిరంజన్ 20 రోజుల వ్యవధిలో 10 పాములను పట్టుకున్నారు. రామచంద్రాపురం, రాయవరం, కొండేపల్లి, నికరంపల్లి బడేఖాన్‌పేట, బుడ్డపల్లి, మాల్యవంతునిపాడు, సీతానాగులవరం తదితర గ్రామ పొలాల్లో పాములను గుర్తించిన రైతులు సకాలంలో స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇవ్వడంతో బంధించి అటవీ ప్రాంతంలో వదిలారు. వీటిలో ఎక్కువగా రక్తపింజర, తాచు, కట్లపాములు ఉన్నట్లు స్నేక్ క్యాచర్ ‘సాక్షి’కి వివరించారు.
రక్తపింజర యమా డేంజర్
ఐదు అడుగుల పొడవుండే రక్తపింజర పాముల్లో అత్యంత ప్రమాదకరమైంది. కాటేసిన 40 నిమిషాల్లోపు వైద్య చికిత్స అందకపోతే ప్రాణానికి ప్రమాదం. కాలుకు గురైన వారి శ్యాస వ్వవస్థ దెబ్బతినడంతోపాటు శరీరమంతా చెమటలు పడతాయి. రక్తపింజర విషం రక్తాన్ని వేగంగా పలుచన చేస్తుంది. తద్వారా గుండె బలహీనపడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం అధికంగా ఉంటుంది. ఎక్కువగా గడ్డి, పొదలు, పత్తి, మిరప, పొగాకు, కంది చేలల్లో రక్తపింజరలు కనిపిస్తున్నాయి.
గ్రామాల్లోకి కొండచిలువలు
మార్కాపురం ప్రాంతంలో కొండచిలువలు జనావాసాల మధ్యకు వస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. 18 అడుగుల పొడవు 90 నుంచి 100 కిలోల బరువు ఉండే కొండచిలువలు పొలాల్లో రైతులను భయపెడుతున్నాయి. ఇటీవల కాలంలో 3 ప్రాంతాల్లో భారీ కొండచిలువలు పట్టుకుని అడవుల్లో వదిలేశారు. నల్లమల అడవుల్లో నుంచి సమీప గ్రామాల్లోకి వస్తున్న కొండచిలువలు కోళ్లు, మేకలు, కుందేళ్లు, జింకలను భుజిస్తున్నాయి. భారీ కొండచిలువలు మనిషిని చుట్టేస్తే దాని పట్టు నుంచి బయటపడటం చాలా కష్టం
Comments
Please login to add a commentAdd a comment