కలలో కల్లోల సముద్రం
స్వప్నలిపి
మన కలలో అప్పుడప్పుడు...
సముద్రం ముందు మౌనంగా కూర్చొని ఉంటాం. కొన్నిసార్లు సముద్రం ఏ శబ్దం లేకుండా మౌనంగా ఉన్నట్లు కనిపిస్తుంది. కొన్నిసార్లు దిక్కులు పిక్కటిల్లేలా ఊగిపోతుంది. కల్లోల కడలిగా మారుతుంది.
నిజానికి కొద్దిమంది, సముద్రాన్ని ఏ సినిమాల్లోనో తప్ప ఎక్కడా చూసి ఉండరు. ‘సముద్రాన్ని చూడలేదు’ అనే నిరాశ, చూడాలనే కోరిక ఇలా కలగా వస్తుందా?
కానే కాదు.
కలలో కనిపించే సముద్రం జీవితానికి ప్రతీకలాంటిది.
నిశ్శబ్దంగా ఉండే సముద్రం... మీలోని అసాధారణమైన అంతర్గత శక్తిని, భావోద్వేగ, ఆధ్యాత్మిక సమన్వయాన్ని ప్రతిబింబిస్తుంది. సముద్రం, అల్లంత దూరాన నిండు చంద్రుడు కనిపిస్తే... మీ జీవితం సుఖసంతోషాలతో హాయిగా గడిచిపోతుందని అర్థం.
ఇక కల్లోల సముద్రం మీలో ఉండే...అసాధారణమైన ధైర్యాన్ని ప్రతిబింబిస్తుంది. అంటే, ఎలాంటి విషమ పరిస్థితిని అయినా తట్టుకోగలిగే సామర్థ్యం మీలో ఉన్నట్లు అర్థం.
కేవలం శక్తిసామర్థ్యాలకు సంబంధించిన విషయాలనే కాకుండా, రకరకాల పరిస్థితుల ఆధారంగా ఉత్పన్నమయ్యే మానసికస్థితిగతులను ‘కడలి కల’ ప్రతిఫలిస్తుంది. ఉదా: మీలో మానసిక ప్రశాంతత లోపించిన సంఘటన ఏదైనా జరిగినప్పుడు...కల్లోలకడలికి సంబంధించిన కలలు వస్తుంటాయి. ఫ్రాయిడ్ ప్రకారం: దూరంగా కనిపిస్తున్న సముద్రం... మీకు విశ్రాంతి లేని విషయాన్ని సూచిస్తుంది.
మీరు ఏదైనా విషయాన్ని కనుగోవాలని ప్రయత్నిస్తున్నప్పుడు...సముద్రంలో ఈత కొడుతున్నట్లు కల వస్తుంది. ‘నా నిర్ణయాన్ని అమలు చేయడానికి ఇది సరియైన సమయం’ అని మనసులో బలంగా అనుకున్నప్పుడు కూడా ఇలాంటి కలలు వస్తాయి.