వాన కలలో తడిసిపోయారా?!
స్వప్నలిపి
వానలో చిక్కుకుపోయినట్లు, బాగా తడిసిపోయినట్లు అప్పుడప్పుడు కల వస్తుంటుంది. కలలో కనిపించే వానకు రెండు భిన్నమైన కోణాలు ఉన్నాయి. ఒకటి సంతోషం. రెండోది విషాదం.
సంతోషం: ఊహించని విజయం సాధించినప్పుడు, ఒక మంచి పని చేసి ఇతరుల మెప్పు పొందినప్పుడు, వ్యాపారంలో ఊహించని లాభాలు వచ్చినప్పుడు, పెద్ద వాళ్ల అమూల్యమైన దీవెనలు లభించినప్పుడు, మన పట్ల ఎవరైనా దయగా ప్రవర్తించినప్పుడు...మనసు ఆహ్లాదంగా ఉంటుంది. ఆ ఆహ్లాదమే కలలో వాన!
చిన్న చిన్న చినుకులు. వర్షం వచ్చినట్లు కాదు...అలా అని రానట్లు కూడా కాదు. చిన్నటి చినుకులకు చిరుగాలి తోడైన సందర్భాన్ని సంతోషంగా ఆస్వాదిస్తుంటాం. ఇది మన మానసిక ఉల్లాసాన్ని ప్రతిబింబించే దృశ్యం. ఎప్పుడైనా ఎవరికైనా వాగ్దానం చేసి, దాన్ని నెరవేర్చిన శుభసందర్భంలో కూడా కలలో చిరు వర్షం పలకరిస్తుంది.
కొన్ని సందర్భాలలో బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా మన ఇంటి మీదే వర్షం కురుస్తుంటుంది. కుటుంబంలోని ఆప్యాయత,అనురాగాలు, సంతోషాలకు ఈ ప్రత్యేక వాన ప్రతీక.
విషాదం: ఉన్నట్టుండి పే...ద్ద వానలో చిక్కుకుపోతాం. తల దాచుకోవడానికి ప్రయత్నిస్తాం. అది కుదరక పూర్తిగా తడిసిపోతాం. సమస్యల్లో చిక్కుకుపోయినప్పుడు, వాటికి పరిష్కారం ఒక పట్టాన దొరకనప్పుడు...ఇలాంటి కలలు వస్తుంటాయి.
కేవలం... మన ఇంటి మీదే భారీ వర్షం కురిసినట్లు కల వస్తే... ఇంట్లో ఎవరో ఒకరు అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు అర్థం. కొన్నిసార్లు రాళ్ల వర్షం కురిసినట్లు, రక్తపు వర్షం కురిసినట్లు కూడా కల వస్తుంది. మోసం, వెన్నుపోటుకు గురైన విషాదం మూలంగా వచ్చే కల ఇది.