రోజంతా చేతులు కడుగుతున్నారా?
స్వప్నలిపి
ఒక కల తరచుగా వస్తుంటుంది...
ఆ కలలో చేతులు కడుగుతూ కనిపిస్తాం. కొన్నిసార్లు అయితే మరీ విచిత్రమైన కల కూడా వస్తూ ఉంటుంది. మరే పని లేనట్లు రోజంతా చేతులను కడుగుతూనే ఉంటాం.
‘ఆరోగ్య స్పృహ నాలో ఎక్కువైందా?’
‘శుభ్రత గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నానా?’ ఇలాంటి సందేహాలు మదిని చుట్టుముడతాయి. నిజానికి ఆరోగ్యానికి సంబంధించిన స్పృహకూ, ఈ కలకూ ఎలాంటి సంబంధం లేదు!
మరి ఈ కల ఉద్దేశం ఏమిటి?
మనకు కొన్ని పశ్చాత్తాపాలు ఉంటాయి. వాటిని చెప్పుకోవాల్సిన వారి దగ్గర చెప్పుకుంటే మనసు శాంతిస్తుంది. అక్కడితో ఆ పశ్చాత్తాపానికి చెల్లుచీటీ దొరుకుతుంది. కానీ అన్నీ సందర్భాల్లోనూ అది కుదరకపోవచ్చు. అది ఒక బాధగా మనసులో మిగిలిపోవచ్చు.
‘చేతులు కడుక్కోవడం’ అనేది పశ్చాత్తాపానికి సంబంధించిన భావనకు ప్రతీక. కొన్నిసార్లు... మనం అత్యంత వినయంగా చేతులు కట్టుకున్నట్లుగా కల వస్తుంది, ఎదురుగా మాత్రం ఎవరూ కనిపించరు! మనకు బాగా నచ్చిన వ్యక్తి, గౌరవించే వ్యక్తి, అభిమానించే వ్యక్తి... కలవడానికి అందుబాటులో ఉండనంత దూరంలో ఉన్నప్పుడు, లేదా ఏవో కారణాల వల్ల కలవడానికి కుదరనప్పుడు ఇలాంటి కలలు వస్తుంటాయి.