మీ స్నేహితుడు చనిపోయాడా?!
స్వప్నలిపి
ఏ అర్ధరాత్రో, తెల్లవారుజామునో దిగ్గుమని మెలకువ వస్తుంది.
పాడు కలను ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటారు...
కలలో...మీ ఫ్రెండ్‌కు యాక్సిడెంట్ జరిగి చనిపోతాడు!
‘ఫ్రెండ్‌ను గుండెలో పెట్టుకొని ప్రేమించే నాకు ఇలాంటి కల రావడం ఏమిటి?’ అని ఆశ్చర్యపోతారు. ఆ కలను అసహ్యించుకుంటారు.
స్నేహితుడికే కాదు... ఆ కలను ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి.
‘‘నీకు తప్ప ఇలాంటి కలలు ఎవరికి వస్తాయి!’’ అని వెక్కిరిస్తారేమోనని భయం.
అలాంటి కలలకు అర్థం ఇది
మనం ఎవరినైనా బాగా ప్రేమిస్తున్నప్పుడు, అభిమానిస్తున్నప్పుడు...వారి బాగోగులు, యోగక్షేమాల గురించి చాలా ఎక్కువ శ్రద్ధ పెడతాం.
ఉదాహరణకు... ‘వెళ్లొస్తాను’ అని స్నేహితుడు టాటా చెప్పి బైక్ మీద బయలుదేరే సమయంలో ‘జాగ్రత్తగా వెళ్లు’ అంటాం.
ఇక మన మనసు మహల్‌లో ఈ ‘జాగ్రత్త’ రకరకాల రూపాలు ధరిస్తుంది. అనేకానేక ప్రశ్నలు పుట్టగొడుగుల్లా పుడుతుంటాయి.
‘జాగ్రత్తగానే వెళ్లాడా?’ ‘మొన్న ఒక రోడ్డు యాక్సిడెంట్‌ను కళ్లారా చూశాను. వీడికి అలా కాలేదు కదా?’ ‘డ్రైవింగ్ చేస్తూ ఏదో ఆలోచిస్తుంటాడు. ఎన్నో సార్లు చెప్పాను, అలా ఆలోచించవద్దని. జాగ్రత్తగానే వెళ్లి ఉంటాడా?’ ‘వేగంగా డ్రైవ్ చేయవద్దని వెయ్యిసార్లు చెప్పి ఉంటాను. ఇప్పుడు కూడా అలానే వెళ్లి ఉంటాడా?...’ ఇలా రకరకాల జాగ్రత్తలన్నీ కలిసి ఒక రూపాన్ని తీసుకుంటాయి. అవే కలలుగా మారుతాయి. అంతకు మించి ఇలాంటి కలల గురించి భయపడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు.