కాళ్లకు చెప్పులు లేకుండా నడిచారా?
స్వప్నలిపి
కలలో...
చెప్పులు వేసుకోకుండా రోడ్డు మీద నడుస్తుంటాం. కాళ్లకు చెప్పులు లేవనే విషయం హఠాత్తుగా గుర్తుకు వచ్చి వెనక్కి వెళ్లే లోపే....మెలకువ వస్తుంది!
గుడి నుంచి బయటికిరాగానే...చెప్పులు కనిపించవు.
ఫంక్షన్‌లో భోజనం చేసి బయటికి రాగానే...చెప్పులు కనిపించవు. చెప్పులు లేని కాళ్లతో రోడ్డు మీద నడుస్తుంటాం.
అర్థం ఏమిటి?
చెప్పులు లేని కాళ్లతో రోడ్డు మీద నడవడం...అనే కలకు ప్రత్యేక కారణం ఏదైనా ఉందా? ‘ఉంది’ అంటున్నారు స్వప్నవిశ్లేషకులు. వారు చెప్పే దాని ప్రకారం... స్వాతంత్య్రం, జీవిక కోల్పోవడం, దివాళా తీయడం... మొదలైన వాటిని ఈ కల ప్రతిబింబిస్తుంది. మీలో మొదటి నుంచి స్వతంత్ర దృక్పథం ఎక్కువ. తప్పనిసరి పరిస్థితులలో ఆ స్వేచ్ఛను కోల్పోవలసి రావచ్చు. పైకి బాగానే ఉన్నప్పటికీ, అంతరాంతరాలలో అసంతృప్తి.
ఉద్యోగం కోల్పోయినప్పుడు లేదా సంపద కోల్పోయినప్పుడు జీవితాన్నే కోల్పోయినట్లుగా విషాదంలో కూరుకుపోతారు కొందరు. ‘ఏమీ మిగల్లేదు’ అనుకుంటారు... ఈ స్థితిని చెప్పులు లేని నడక లేదా ‘అసౌకర్యమైన నడక’ ప్రతిఫలిస్తుంది.
‘‘ఇంకొద్ది రోజుల్లో సమస్యలు ఎదుర్కోబోతున్నాను’’ అనే ముందస్తు భయాల నుంచి కూడా ఇలాంటి కలలు పుడుతుంటాయి.
ఒక మాట
శాస్త్రీయ విశ్లేషణ మాట ఎలా ఉన్నప్పటికీ వివిధ దేశాలలో ‘చెప్పులు లేకుండా నడవడం’ అనే కలకు ‘కోల్పోవడం’ ‘దివాళా తీయడం’ లాంటి సంప్రదాయ అర్థాలు ఉన్నాయి.
ఉదా: అరబ్ దేశాలలో చెప్పులు లేకుండా నడవడం అనే కలకు... సంప్రదాయ అర్థం: అనారోగ్యం, నష్టపోవడం.