బస్సు మిస్ అయ్యారా?
స్వప్నలిపి
బస్ అనే కాదు... కారు, రైలు, విమానం... మిస్ అయినట్లు కొందరికి తరచుగా కల వస్తుంది. నిజజీవితంలో మాత్రం అలాంటి సంఘటనలు ఏవీ జరిగి ఉండవు. మరి ఎందుకు ఇలాంటి కలలు వస్తాయి?
కలలో కనిపించే రవాణా సాధనం... లక్ష్యం, కోరిక, ఆశయానికి ప్రతీకలాంటిది. కొందరు... ఒక లక్ష్యం ఏర్పర్చుకుంటారు. ఆరునూరైనా సరే ఆ లక్ష్యాన్ని చేరుకుంటారు. అదృష్టవశాత్తు పరిస్థితులు కూడా వారికి సహకరిస్తాయి. మరి కొందరు... లక్ష్యం ఏర్పర్చుకుంటారు. లక్ష సాధనలో విజయం సాధించడానికి శతవిధాల ప్రయత్నిస్తారు. కానీ ఏవో అడ్డంకులు, రాజీ పడక తప్పని పరిస్థితులు ఎదురవుతాయి.
‘‘నేను ఒకటి తలిస్తే... పైవాడొకడు తలిచాడు’’ అని రాజీ పడిపోతారు. లక్ష్యానికి దూరంగా జరిగి పోతారు. అంతమాత్రాన... ఆ లక్ష్యం మీద ప్రేమ దూరమైనట్లు కాదు...అదెక్కడికీ వెళ్లదు. మీలోనే ఉంటుంది.
‘‘నన్ను చేరుకోలేక పోయావు!’’ అని వెక్కిరిస్తుంది.
మరొకటి ఏమిటంటే, ఒక అద్భుతమైన అవకాశం మీ దగ్గరికి వచ్చినప్పుడు తెలిసో తెలియకో ఆ అవకాశాన్ని చేజార్చుకుంటారు. ఆ చేజారిన అదృష్టం బస్సుగానో, రైలుగానో కలలో కనిపిస్తుంది. ఏ నిర్ణయం తీసుకోవాలి? అనే విషయంలో స్పష్టత లేనప్పుడు కూడా ఇలాంటి కలలు వస్తుంటాయి.