కోతి-కొబ్బరికాయ
కథ
ఒక అడవిలో ఓ కోతి ఉండేది. ఓ రోజు దానికి ఒక గుడి దగ్గర ఒక కొబ్బరి కాయ దొరికింది. కోతి కొబ్బరికాయను పగులగొట్టి తినాలని ప్రయత్నించింది. కానీ కోతి ఎంత ప్రయత్నించినా కొబ్బరి కాయ పగులలేదు. దానితో విసుగుపుట్టి ఆ కాయను ఎక్కడైనా దాచిపెడదామని ఆలోచిస్తూ చుట్టూ చూసింది. చెట్ల ఆకులు మేస్తున్న రెండు ఏనుగులు కనిపించాయి దానికి. కోతి వెంటనే వాటి దగ్గర ఉన్న చెట్టు పైకి దూకి, ‘‘మిత్రులారా! ఎప్పుడూ రుచీ పచీ లేని ఆకులు తినడమేనా? ఇదిగో ఈ కొబ్బరికాయ తినండి. చాలా రుచిగా ఉంటుంది. కాని నేను మీకు ఒక పోటీ పెడతాను. అందులో గెలిచిన వారికే ఇది ఇస్తాను’’ అని కొబ్బరికాయను వాటికి చూపిస్తూ అంది.
‘‘పోటీకి మేం సిద్ధం’’ అని అన్నాయి ఏనుగులు ముక్తకంఠంతో.
‘‘అయితే ఎదురుగా కనిపిస్తున్న ఆ జామచెట్టును వేళ్లతో సహా పెకలించాలి. ముందుగా ఎవరు అలా చేస్తారో వారికి ఈ కొబ్బరికాయ ఇస్తాను’’ ఊరిస్తూ అంది కోతి. వెంటనే ఒక ఏనుగు ఆ జామచెట్టు దగ్గరికి వెళ్ళింది. రెండో ఏనుగు మాత్రం కదలకుండా అలాగే నిల్చుంది.
‘‘మిత్రమా! నీకు ఈ కొబ్బరికాయ వద్దా?’’ అని అడిగింది కోతి దాన్ని. అందుకు ఆ ఏనుగు ‘‘నేస్తమా! ఒక కొబ్బరికాయ కోసం ఎన్నో పళ్ళు కాసే జామచెట్టును నాశనం చేయటమా? ఎన్నో జీవాలకు ఆశ్రయం, ఆహారం లేకుండా చేయటమా? అలా చేయలేను’’ అని అంది. ఏనుగు వివేకానికి, ప్రకృతిపై దానికున్న ప్రేమకు మెచ్చి, కోతి ఆ కొబ్బరికాయను రెండో ఏనుగుకు ఇచ్చేసింది.