మా బాబుకు ఆరేళ్లు. వాడికి తరచు జలుబు చేస్తోంది. వర్షాకాలం వస్తే చాలు... టాన్సిల్స్ వాచి, ఆహారం తీసుకోవడం కష్టంగా ఉంటోంది.
హోమియో కౌన్సెలింగ్
మా బాబుకు ఆరేళ్లు. వాడికి తరచు జలుబు చేస్తోంది. వర్షాకాలం వస్తే చాలు... టాన్సిల్స్ వాచి, ఆహారం తీసుకోవడం కష్టంగా ఉంటోంది. డాక్టర్‌కు చూపిస్తే, ఇంకొంతకాలం తర్వాత ఆపరేషన్ ద్రావా తొలగించాలన్నారు. కొందరేమో టాన్సిల్స్ తొలగించడం అంత మంచిది కాదంటున్నారు. ఏం చేయాలో తెలియక మాకు ఆందోళనగా ఉంది. దయచేసి మా బాబు సమస్య పూర్తిగా తొలగేందుకు తగిన సలహా ఇవ్వగలరు. - డి.కల్యాణి, కొలనుకొండ
టాన్సిలైటిస్ అంటే కొన్ని ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే ఇన్‌ఫ్లమేటరీ మార్పులు. ముఖ్యంగా టాన్సిల్స్‌లో చీము పట్టడం, నొిప్పి, వాపు లాంటి లక్షణాలతో బాధపడుతున్న స్థితిని టాన్సిలైటిస్ అంటారు. టాన్సిల్స్ ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. పిల్లల్లో తరచు వాస్తుంటాయి. వయసు పెరుగుతున్నకొద్దీ ఇవి క్షీణిస్తూ ఉంటాయి. టాన్సిల్స్ లింఫాయిడ్ టిష్యూ సముదాయం. పిల్లలో టాన్సిల్స్ దేహ రక్షణకు ఉపయోగపడతాయి. టాన్సిల్స్‌కు ఏ కారణం చేతనైనా చీము పడితే, అవి దేహాన్ని రక్షించే విధులను నిర్వర్తించకపోగా, చీము, రక్తనాళాల ద్వారా శరీరంలోని ఇతర అవయవాలకు ఇన్ఫెక్షన్ సోకి, అది ఇతర రకాల వ్యాధులకు కారణమవుతుంది. వీటిని సకాలంలో గుర్తించి, తగిన చికిత్స చేయకపోతే వ్యాధి ముదిరి దీర్ఘకాల సమస్యగా మిగిలిపోతుంది.
కారణాలు: అపరిశుభ్ర వాతావరణం, కిక్కిరిసిన పరిసరాలు, దుమ్ము, ధూళి ద్వారా, ఒకరితో ఒకరు మాట్లాడినప్పుడు గాలి ద్వారా, ఉమ్ము తుంపర్ల ద్వారా బ్యాక్టీరియా, వైరస్‌లు ఒకరినుండి ఇంకొకరికి వ్యాపిస్తాయి. చిన్నవయసు వారిలో ఎక్కువగా జరుగుతుంది.
లక్షణాలు: గొంతునొప్పి, ఆహారం మిగడంలో కష్టం, 102 నుండి 103 డిగ్రీల జ్వరం, ఒళ్లునొప్పులు, చెవినొప్పి, మలబద్ధకం, అక్యూట్ టాన్సిలైటిస్‌లో జ్వర తీవ్రత ఎక్కువగా అయి, దవడ కింద బిళ్లలు నొప్పిగా ఉంటాయి.
హెచ్చరిక: కొందరిలో టాన్సిలైటిస్ ప్రమాదకరం కూడా కావచ్చు. టాన్సిల్స్ పొరలో చీముగడ్డ ఏర్పడుతుంది. దానిని పెరిటాన్సిలర్ ఏబ్సెస్ అంటారు. ఇది అశ్రద్ధ చేస్తే చాలా ప్రమాదకరం. వీటిలో తీవ్రజ్వరం, ఉమ్మి కూడా మింగలేరు. ముద్దగా మాట్లాడుతూ తీవ్రమైన చెవిపోటుతో రోగి చాలా బాధపడతాయి. ఇది గొంతుకు ఒకవైపునే వస్తుంది.
రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు: పిల్లలకు పరిశుభ్రమైన ఆహారం, నీరు ఇవ్వాలి. ఇంట్లోకి గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూడాలి. తరచు గొంతునొప్పి, జ్వరం వస్తూ ఉంటే వైద్యుల సలహా తీసుకోవాలి.
హోమియో వైద్యవిధానం: టాన్సిలైటిస్ వ్యాధికి సంబంధించి పాజిటివ్ హోమియోపతిలో చాలా అద్భుతమైన చికిత్స ఉంది. ముఖ్యంగా పిల్లల్లో తరచు వచ్చే ఈ వ్యాధిని హోమియో మందుల ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుతూ, బ్యాక్టీరియా లేదా వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లని పూర్తిగా నియంత్రిస్తూ నివారిస్తూ పిల్లల్లో ఎటువంటి దుష్ర్పభావాలూ లేకుండా కాన్‌స్టిట్యూషనల్ సిమిలిమమ్ అనే ప్రత్యేక పద్ధతి ద్వారా మందులను ఎంపిక చేసి చికిత్స చేస్తే వ్యాధి పూర్తిగా నయం అవటమే కాకుండా మున్ముందు వచ్చే ఇన్ఫెక్షన్లు కూడా రాకుండా అరికట్టవచ్చు. పిల్లలు ఈ మందులను స్వీకరించడం కూడా చాలా సులభం.
గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్
నా వయసు 35 ఏళ్లు. నేను నిద్రపోయే సమయంలో ఛాతీకింద ఎడమవైపున గత వారం రోజులుగా నొప్పి వస్తోంది. డాక్టర్‌గారిని సంప్రదిస్తే లివర్ సైజు పెరిగిందని చెప్పారు. లివర్‌సైజు ఎందుకు పెరిగింది తెలియజేయగలరు.
- విజయ్, నిడదవోలు
మీరు రాసిన విషయాలను బట్టి చూస్తే మీకు లివర్ సైజు పెరిగిందని చెప్పవచ్చు. దీనికి వివిధ కారణాలు ఉండవచ్చు. అవి...ఆల్కహాల్ ఎక్కువ మోతాదులో తీసుకునే వారిలో, స్థూలకాయం ఉన్నవారిలో లివర్‌లో కొవ్వు పేరుకుపోయి, దాని సైజు పెరిగే అవకాశం ఉంది. మీరు స్థూలకాయులా లేదా ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉందా అన్న అంశాలు మీరు తెలియజేయలేదు.
కొన్ని రకాల వైరల్ ఇన్షెక్షన్స్... హెపటైటిస్-బి, హెపటైటిస్-సి అనే ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా లివర్ సైజు పెరిగే అవకాశం ఉంది. అయితే మీరు పంపిన రిపోర్టులలో అన్నీ నార్మల్‌గానే ఉన్నాయి కాబట్టి మీకు ఆ ఇన్ఫెక్షన్లు ఉండే అవకాశం తక్కువ. ముందుగా మీరు లివర్ ఎంత సైజ్‌కు పెరిగిందన్న అంశాన్ని అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా తెలుసుకోవాలి.మీకు వస్తున్న నొప్పి ఎడమవైపున ఛాతీ కింది భాగంలో కాబట్టి ఒకసారి ఎండోస్కోపీ చేయించాలి.పై రెండు పరీక్షల వల్ల మీ లివర్ సైజు పెరగడానికి, కడుపునొప్పికీ కారణం తెలిసే అవకాశం ఉంది. దాన్ని బట్టి చికిత్స ఉంటుంది.
వాస్క్యులార్ డిసీజ్ కౌన్సెలింగ్
నా వయసు 50 ఏళ్లు. నాకు పదిహేనేళ్ల క్రితం ఎడమరొమ్ము తొలగించారు. గత నెల నుంచి కళ్లు పచ్చగా కనిపిస్తున్నాయి. ఆకలి తగ్గింది. కడుపులో నొప్పి వస్తోంది. నాకు తగిన సలహా ఇవ్వగలరు.
- ఒక సోదరి, మహబూబాబాద్
మీరు రాసిన విషయాన్ని బట్టి మీకు రొమ్ముక్యాన్సర్ వచ్చినందున రొమ్ము తొలగించి ఉంటారని తెలుస్తోంది. ప్రస్తుతం కామెర్లు ఉన్నాయి కాబట్టి కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. అవి... గతంలో ఉన్న రొమ్ము క్యాన్సర్ ప్రభావం ఏదైనా లివర్‌పైన పడిందా అనే విషయాన్ని పరిశీలించాలి. అలాగే ఇతర వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా సోకాయా, ఏవైనా మందులు వాడుతుంటే వాటి ప్రభావం కాలేయం మీద పడి ఈ పరిణామం సంభవించిందా అని పరీక్షించాలి. మీరు ముందుగా అల్ట్రాసౌండ్ స్కాసింగ్ (లివర్)తో పాటు లివర్‌కు చెందిన రక్తపరీక్ష చేయించుకోండి. ఒకవేళ క్యాన్సర్ ప్రభావం కాలేయంపై కూడా పడి ఉంటే, దాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మేలు. మీరు ముందుగా పైన పేర్కొన్న పరీక్షలు చేయించి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను సంప్రదించండి.
నా వయసు 56 ఏళ్లు. నేను నడుస్తున్నప్పుడు కాలునొప్పిగా ఉంటోంది. పిక్కలు, తొడలు, తుంటి భాగంలోనూ నొప్పిగా ఉంటోంది. మెట్లు ఎక్కుతున్నప్పుడు వచ్చే నొప్పి, ఆగిన వెంటనే తగ్గుతోంది. నొప్పి సన్నగా, తిమ్మిరి ఎక్కినట్లుగా ఉంటోంది. కాళ్ల కండరాలు అలసిపోయినట్లుగా, పిరుదులూ నొపిగా అనిపిస్తున్నాయి. నా సమస్యకు కారణం ఏమిటో తెలపండి.
- జె. రాధాకృష్ణమూర్తి, కొత్తగూడెం
మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీకు కాలిలోని రక్తనాళాలు పూడిపోయినట్లుగా అనిపిస్తోంది. గుండెకు రక్తసరఫరా చేసే రక్తనాళాలు బ్లాక్ అయిన గుండెపోటు వచ్చినట్లే... కాలిలోనూ అదే పరిణామం సంభవించే అవకాశం ఉంది. గుండెపోటులో ఉంటే ప్రమాదం లాగే ఈ లెగ్ అటాక్స్ ప్రమాదకరం. కాలిపైన ఎంతకూ నయంకాని అల్సర్స్ వచ్చి, చివరకు కాలు తీసేయాల్సిన పరిస్థితి దారితీయవచ్చు. లెగ్ అటాక్స్‌లో ఉన్న మరో ప్రమాదకరమైన అంశం... వీటిని చివరిదశ వరకూ గుర్తించడం కష్టం. అంతకుమించి ఈ వ్యాధి గురించి సాధారణ ప్రజల్లో అవగాహన చాలా తక్కువ. డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు, 50 ఏళ్లు పైబడిన వారు, స్థూలకాయులు, రక్తపోటు ఎక్కువగా ఉన్నవారు, పొగతాగే వారు ఈ లెగ్ అటాక్స్ గురయ్యే అవకాశాలు ఎక్కువ. మీరు పేర్కొన్న లక్షణాలతో పాటు కాళ్లు లేదా పాదాలు క్రమంగా పాలిపోయినట్లుగా ఉండటం, కాళ్లు నీలిరంగులోకి లేదా ముదురు ఎరుపు రంగులోకి మారడం వంటివీ చోటుచేసుకుంటాయి. నడవకుండా విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా మీ లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉంటే వ్యాధి తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్లు గ్రహించాలి. ఈ రక్తనాళాల జబ్బును నిర్ధారణ చేయడానికి యాంజియోగ్రామ్ బాగా ఉపయోగపడుతుంది. అయితే నిర్ధారణలో మరింత కచ్చితత్వం కోసం అల్ట్రాసోనోగ్రఫీ, ఎమ్మారైలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
ఇలా కాలి రక్తనాళాల్లో పూడిక పేరుకుందని తెలిసినప్పుడు ప్రాథమిక దశలో సరైన మందులు, జీవనశైలిలో మార్పుల ద్వారా దీనికి చికిత్స చేస్తారు. దీనికి ఎంత త్వరగా చికిత్స చేయిస్తే అంత మంచిది. ఎందుకంటే వ్యాధి ముదిరాక డాక్టర్‌ను సంప్రదిస్తే ఒక్కోసారి కాలిని తొలగించే ప్రమాదమూ ఉండవచు. అందుకే మీలో కనిపించిన లక్షణాలను గుర్తిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఇప్పుడు దీనికి బెలూన్ యాంజియోప్లాస్టీ, స్టెంట్ విధానాల వంటి సమర్థమైన, సురక్షితమైన చికిత్స ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయి.