తల్లే తొలి స్నేహితురాలు
అది 1998వ సంవత్సరం. మార్చి నెల. నా జీవితంలోకి ఓ కొత్త ఆనందం ప్రవేశించింది. ఓ అనిర్వచనీయమైన అనుభూతి నన్ను వెతుక్కుంటూ వచ్చింది... నా చిట్టితండ్రి సాత్విక్ రూపంలో. అమ్మా అన్న పిలుపును నాకు తొలిసారి రుచి చూపించిన నా తొలి సంతానం సాత్విక్. బుజ్జి బుజ్జి కాళ్లు, చిన్ని చిన్ని చేతులు... ఓ అందమైన పుష్పాన్ని చూస్తున్నట్టుగా ఫీలయ్యాను. వాడిని తొలిసారి చేతుల్లోకి తీసుకుంటున్నప్పుడు... ప్రపంచంలో ఎవరూ పొందని గొప్ప విజయమేదో పొందినంత గర్వపడ్డాను. ఇదే ఆనందం నాకు రెండేళ్ల తరువాత మరోసారి దక్కింది. మా పాప శృతి పుట్టింది. ఓహ్... ఇక నాకు ప్రపంచంలో మరేదీ అక్కర్లేదనిపించింది.
ఆ తరువాత కొన్ని సంవత్సరాల వరకూ నాకు నా పిల్లలు తప్ప మరెవరూ కనిపించలేదు. వాళ్ల సంతోషం తప్ప ఇంకేమీ కనిపించలేదు నా కంటికి. అంతకుముందు నేను ఉద్యోగం చేసేదాన్ని. కానీ పిల్లల కోసం మానేశాను. నా పిల్లల ముద్దొచ్చే ముఖాలను చూడటంతో మొదలై... వాళ్లను నిద్రపుచ్చి పక్కమీదకు చేరడంతో నా రోజు ముగిసేది. నేనో పోస్ట్ గ్రాడ్యుయేట్‌నని, ఉద్యోగినని మర్చిపోయాను. నా పిల్లలకు తల్లిని అన్న ఒకే ఒక్క విషయమే గుర్తుంది నాకు.
ఓ బిడ్డకు జన్మనివ్వడమే పునర్జన్మను పొందడమనుకుంటే... ఆ పుట్టిన బిడ్డలను పెంచి పెద్ద చేయడం ఓ పెద్ద తపస్సు తల్లికి. పిల్లలు పెరుగుతున్నకొద్దీ వాళ్లతో పాటు మనమూ ఎదగాలి. నేను కాస్త స్ట్రిక్ట్‌గానే ఉంటాను. మరీ కోప్పడనుగానీ... చేయకూడనిది చేస్తే వెంటనే సరిచేస్తాను. దానిలో తప్పేంటో, ఎందుకలా చేయకూడదో వివరిస్తాను. ఈ పని అన్నిటికంటే కష్టమైనది. ఎందుకంటే, కాస్త మనం ఎక్కువ మాట్లాడినా వాళ్ల మనసులు నొచ్చుకుంటాయి. ఆ బాధ నుంచే వారికి భయం పుడుతుంది. ఆ భయం కాస్త హద్దు దాటిందంటే, మన పిల్లల దృష్టిలో మనం విలన్లయిపోవడం ఖాయం. అందుకే నేను చాలా జాగ్రత్తగా ఉంటాను.
నా దృష్టిలో తల్లే పిల్లలకు మొదటి స్నేహితురాలు. స్నేహం దేనినైనా చెప్పుకునే స్వేచ్ఛనిస్తుంది. నా పిల్లలకు నా దగ్గర ఆ స్వేచ్ఛ ఉండాలి. నేనేదో అంటానన్న భయంతో ఏదీ దాచిపెట్టకూడదు. అందుకే మా తల్లీపిల్లల బంధాన్ని స్నేహబంధంగా మార్చేసుకున్నాను నేను!
- అరుణా శేఖర్, వైజాగ్ (సాక్షి పాఠకురాలు)