అమ్మ బదులు..పదిన్నర లక్షలు
మందుకొట్టి వెంటబడ్డాడు. ఛీకొట్టి వెళ్లిపోతుంటే కారుతో గుద్ది చంపేశాడు. మర్డర్‌ని యాక్సిడెంట్‌గా చిత్రీకరించడానికి... క్యాష్ బయటకు తీశాడు. అమ్మ బదులు... పదిన్నర లక్షలు... ఏమంటారు? ఇది జనం ప్రశ్న!!
‘తనను ఎప్పుడూ వదిలి ఉండలేదు. ఫంక్షన్లకు వెళ్లినా, బంధువుల ఇళ్లకు వెళ్లినా నాతోనే తీసుకొచ్చేసేవాడిని. తొలిసారి ఆమెను వదిలి పిల్లలతో ఇంటికొచ్చాను. ఇలా జీవితాంతం ఆమెను వదులుకోవాల్సి వస్తుందని తెలుసుకోలేకపోయాను’ అన్నాడతను. ఆ మాట అంటున్నప్పుడు అతడి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. వాటిని అదిమి పెట్టుకుంటూ అన్నాడు- ‘ఆరోజు అనకాపల్లి నూకాంబికా ఆలయంలో గర్భగుడి దర్శనం చేసుకొని వస్తానని అంది. పిల్లలకు నిద్ర వస్తోంది కనుక వాళ్లను తీసుకుని నేను వచ్చేశాను. అప్పుడు కూడా మావాళ్లందరూ ఉన్నారు కదా అనే ధైర్యంతో వచ్చాను. ఇంటికి వచ్చిన గంటన్నర కాలంలో ఈ ఘోరం జరిగిపోయింది...’ ఇటీవల ఒక పోకిరి వెకిలి చేష్టల వల్ల ప్రాణాలు కోల్పోయిన మాటూరి లావణ్య భర్త అప్పలరాజు ఆవేదన ఇది.
అసలేమైంది?...
విశాఖ జిల్లా గాజువాక మండలం రాజీవ్‌నగర్‌కు చెందిన లావణ్య పదో తరగతి వరకు చదువుకుంది. ఒద్దికైన అమ్మాయి. వడ్లపూడికి చెందిన మాటూరి అప్పలరాజుతో వివాహమయ్యాక అత్తింటి వారితో బాగా కలిసిపోయింది. అత్తింటి వారు కూడా ఆమెను మహారాణిలా చూసుకొంటున్నారు. ఆమె తన భర్త, పిల్లలు, ఆడపడుచు, బంధువులతో మొన్నటి మే నెల 22వ తేదీన నూకాంబిక అమ్మవారి దర్శనానికి వెళ్లింది. లక్షణమైన ఆమె కాపురం చూసి మృత్యువుకు కళ్లెర్రబడ్డాయో ఏమో ప్రమాదం ఓ కీచకుడి రూపంలో దాపురించింది. అమ్మాయిలను ఏడిపించి పైశాచికానందం పొందే దాడి హేమకుమార్ అనే యువకుడి కన్ను ఆ రోజు లావణ్య మీద పడింది. వెంటనే అతడు లావణ్య, ఆమె ఆడపడుచు దివ్యలను వెంబడిస్తూ ఏడిపించసాగాడు. దాంతో లావణ్య, దివ్య, బంధువుల అబ్బాయి మోహన్... వీరు ముగ్గురూ కలిసి త్వరగా దర్శనం ముగించుకుని మోటార్ బైక్ మీద తిరుగు ప్రయాణం అయ్యారు. కాని దాడి హేమకుమార్ వదల్లేదు. బొడ్డేడ హేమంత్, మరికొందరు స్నేహితులతో కలిసి కారులో బైక్‌ను వెంబడించాడు. హారన్ మోగిస్తూ, వెకిలిగా పైపైకి వస్తున్నాడు హేమకుమార్. అతడి నుంచి తప్పించుకోవడానికి శతవిధాలా చేసిన ప్రయత్నం విఫలమైంది. సాలాపువానిపాలెం వద్ద బైకును కారుతో గుద్దాడు. లావణ్య అక్కడికక్కడే మరణించింది. దివ్య, మోహన్ తీవ్రంగా గాయపడ్డారు.
చట్టం ఎవరికి రక్షణ?
ఇంత దారుణానికి ఒడిగట్టిన హేమకుమార్‌కు సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యేలే రక్షణ కవచంగా నిలిచారని వడ్లపూడి గ్రామం కోడై కూస్తోంది. లావణ్య ప్రాణానికి వెల కట్టారని కూడా తెలుస్తోంది. ఏ ఇద్దరు కలుసుకున్నా ఒకటే మాట. పదవిలో ఉన్న వాళ్లు చట్టాన్ని నిందితులకు, హంతకులకు అనుకూలంగా మార్చేశారని గుసగుసలాడుకుంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ‘రేపట్నుంచి... జేబులో రూ.10 లక్షలున్న ప్రతి ఒక్కడూ కనబడ్డ అమ్మాయిని ఏమైనా చేయొచ్చు. మత్తెక్కువైతే చంపేయొచ్చు. సెటిల్‌మెంట్లు చేయడానికి అధికార పార్టీ ఉండనే ఉంది. ఇది అధికార పార్టీ రేట్ చార్టు అని బోర్డులు వేలాడదీసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు’ అని ఆందోళన పడుతున్నారు.
నాయకుల ప్రమేయం నిజమేనా?
అనకాపల్లి, పెందుర్తి, గాజువాకకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతోపాటు ఆ పార్టీకి చెందిన కొంతమంది మాజీ కార్పొరేటర్లు స్వయంగా రంగంలోకి దిగారని ఊరంతా గుప్పుమంటోంది. మరి ఈ కేసులో వారి ప్రమేయం లేదనుకుంటే ఉన్నఫళంగా గాజువాకలోని మాజీ కార్పొరేటర్ ఇంట్లో వారి అనుచర నాయకులు సమావేశమై చర్చలు జరపాల్సిన అవసరం ఏమిటి అనేది స్థానికుల విశ్లేషణ. పైగా ఆ మాజీ కొర్పొరేటర్ గాజువాక ఎమ్మెల్యేకి బంధువు కూడా. సమావేశమై ఏం చర్చించినట్లు అనే సందేహానికి సమాధానంగా ‘పోయిన లావణ్య ఎలాగూ తిరిగి రాదు, పిల్లల భవిష్యత్తు కోసం పదిన్నర లక్షల రూపాయలిచ్చేటట్లు సెటిల్ చేశారు’ అంటూ స్థానిక అధికార పార్టీ
ద్వితీయశ్రేణి నాయకులే లీకులిస్తున్నారు. ఈ లీకుల ద్వారా తమ నేతల చాతుర్యాన్ని, రూలింగ్ పార్టీ ప్రతాపాన్ని చాటుకునే ప్రయత్నమే కనిపిస్తోంది. బాధితులకు ఇప్పటికే ఐదు లక్షలు ఇచ్చినట్లు, కేసు మూసేసిన తర్వాత మిగిలిన డబ్బు ఇస్తారని వారి కథనం.
కేసులో మలుపులు...
కేసు విషయంలో అధికార పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. అది హత్య కాదని, రోడ్డు ప్రమాదమేనని సంఘటన జరిగిన వారం రోజుల తరువాత స్వయంగా నగర పోలీస్ కమిషనర్ యోగానంద రంగంలోకి దిగిన 24 గంటల్లో తేల్చేశారు. హత్య జరిగినట్టు తమకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయలేదని, యాక్సిడెంట్‌గానే కేసు నమోదైందని ట్రాఫిక్ పోలీసులంటున్నారు. ట్రాఫిక్ పోలీసుల నుంచి కేసు తమకు వస్తే తప్ప రోడ్డు ప్రమాదాన్ని హత్యగా భావించి దర్యాప్తు చేపట్టలేమని శాంతిభద్రతల పోలీసులు చెబుతున్నారు. చట్టంలో నిబంధనల్లో ఉన్న లొసుగులను అధ్యయనం చేసినంతగా ఒక ప్రాణం పోయిందనే వాస్తవాన్ని ఒంటబట్టించుకుంటున్నట్లు లేదు పోలీసులు.
లావణ్య తిరిగి రాదనే నిజాన్ని అందరూ ఒప్పుకోవాల్సిందే. లావణ్యకు జరిగినట్లు మరే అమ్మాయికీ జరగకూడని విధంగా నిందితులను కఠినంగా శిక్షించేలా ఉండాలి చట్టం. డబ్బు మదంతో చెలరేగిపోతున్న వాళ్లకు చట్టం మీద భక్తి లేకపోయినా తప్పు చేస్తే శిక్ష తప్పదనే భయమైనా కలిగించాలని పాలకులు అనుకోవాలి. అలా అనుకోకపోతే ఈ రోజు లావణ్య, రేపు మరెవరో? మనం ఉన్నది ఆటవిక రాజ్యంలో కాదు, సామాజిక చైతన్యం ఉన్న ఆధునిక సమాజంలోనే. మరి మన చట్టాలు, పాలకులు ఎవరికి అండగా ఉండాలి? బాధితులకా, బలవంతులకా? - ప్రదీప్‌నాయుడు కె., గాజువాక, విశాఖపట్నం జిల్లా
ఆ రోజు... ఇలా జరిగింది!
వడ్లపూడిలో బయల్దేరింది: ఉదయం ఎనిమిది గంటలకు
ఆలయానికి చేరుకున్నది: ఉదయం 8.45 గంటలకు
భోజనం చేసిన సమయం: మధ్యాహ్నం 1.30 తరువాత పిల్లలతో కలిసి భర్త ఇంటికి
బయల్దేరి సమయం: మధ్యాహ్నం సుమారు 2.30 తరువాత
ప్రమాదం జరిగింది: సాయంత్రం 4.30 సమయంలో అగనంపూడి ఆస్పత్రికి
బాధితులను చేర్చిన సమయం: సాయంత్రం 5.30 గంటలకు
బాధితుల ఫిర్యాదు సమయం: రాత్రి 10.15 గంటలకు (లావణ్య చినమామ లక్ష్మణరావు ఫిర్యాదు చేశారు)
ఎఫ్‌ఐఆర్ నమోదు సమయం: పోలీసులు రకరకాలుగా చెబుతున్నారుమాకు ఒక్క పైసా అందలేదు... పిల్లలకు పదిన్నర లక్షల రూపాయలు ఇవ్వడానికి సెటిల్‌మెంట్ జరిగినట్టు పేపర్లలో వచ్చింది. ఎవరు ఇచ్చారో, ఎవరు పుచ్చుకున్నారో మేము ఓట్లేసి గెలిపించిన ఆ పెద్దోళ్లకే తెలియాలి. మనిషి పోయిన బాధలో మేముంటే పరామర్శించడానికి వచ్చిన వాళ్లు కూడా డబ్బు గురించే అడుగుతున్నారు. బాధతో మనసు చితికిపోతోంది. - వసంత, లావణ్య బంధువు
ఎఫ్‌ఐఆర్ కాపీ ఇవ్వడం కుదరదు...
మాకు ఫిర్యాదు చేసిన వ్యక్తికే ఎఫ్‌ఐఆర్ కాపీ ఇస్తాం. వేరే ఎవరు అడిగినా దాన్ని ఇవ్వడానికి నిబంధనలు ఒప్పుకోవు. ఈ ప్రమాదం జరిగిన రోజు రాత్రి 8.30 గంటలకు యాక్సిడెంట్ కేసుగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాను. ఈ విషయంలో అపోహలకు తావులేదు. - కృష్ణ, ట్రాఫిక్ సీఐ
అమ్మ లేదు..!
లావణ్య పిల్లలు సుశాంత్‌కు నాలుగేళ్లు, కుషాల్‌కు 15 నెలలు. రోజూ గోరుముద్దలు తినిపించే అమ్మ కనిపించడంలేదు. తల్లి ఏమైందో తెలియడంలేదు. నాన్న, అమ్మమ్మ, తాతయ్య, అక్కలు, బావలు, అత్తలు... అందరూ కనిపిస్తున్నారు. అమ్మ వారి మధ్యనే ఎక్కడో దాగి ఉందేమోనని చిన్నారుల కళ్లు వెతుకుతూనే ఉన్నాయి. వారి చేత అమ్మను మరిపించడం ఎలాగో తెలియక అమ్మమ్మ, నానమ్మలు కుమిలిపోతున్నారు. అమ్మ... మదమెక్కిన మగాళ్ల కిరాతకానికి బలయిందనే నిజం ఆ చిన్నారులకు అర్థం కాదు. పసిబిడ్డలకు తెలియకపోవడంలో అర్థం ఉంది. కానీ పోలీసులకు కూడా తెలియడం లేదా? తెలిసీ కేసుని రకరకాల మలుపులతో పలచబరచడానికే ప్రయత్నిస్తున్నారా? విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారం ప్రకారం రెండోదే నిజమని నమ్మాల్సి వస్తోంది.
ఎఫ్‌ఐఆర్ కాపీ మాకు ఇవ్వలేదు...
ఈ ప్రమాదం జరిగినరోజు రాత్రి పరవాడ ట్రాఫిక్ పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాను. ఇంకా మాకు ఎఫ్‌ఐఆర్ కాపీ ఇవ్వలేదు. మేం కూడా ఇతర పనుల్లో ఉండి వెళ్లి తీసుకోలేదు. అందులో ఏం రాశారో కూడా మాకు తెలియదు. ‘డబ్బుతో కేసు సెటిల్‌మెంట్ జరిగిందటగా’ అని మమ్మల్ని అడుగుతుంటే ఏం మాట్లాడాలో తెలియడం లేదు. ఆ పెద్దవాళ్లు నిజంగా పిల్లలకు డబ్బు ఇవ్వదలుచుకుంటే ఇవ్వమనండి. పోయిన తల్లిని ఎలాగూ తెచ్చివ్వలేం. కనీసం వారిని చదివించడానికి, ప్రయోజకులను చేయడానికి ఆ డబ్బు ఉపయోగపడుతుంది. - మాటూరి లక్ష్మణరావు లావణ్య చినమామ