రాష్ట్రపతి రామ్‌నా«ద్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకుంటున్న నరసమ్మ
మొదట నరసమ్మ. తర్వాత డా‘‘ సులగట్టి నరసమ్మ. ఇటీవలి వరకు దాదాపు పదిహేను వేల సుఖ ప్రసవాలు చేశారు. డెబ్బయ్ ఎనిమిదేళ్ల క్రితం మొదటి ప్రసవం చేశారు. గ్రామానికి ప్రధాన మంత్రసాని అయ్యారు. ఏడు దశాబ్దాలుగా అదే వృత్తిలో కొనసాగారు. ఆవిడ హస్తవాసి మంచిదన్న పేరుంది. ఆ పేరును ఇక్కడే వదిలేసి, నరసమ్మ మూడు రోజుల క్రితం డిసెంబరు 25, 2018న నిండు వయసులో 98 సంవత్సరాలు పూర్తిచేసుకుని ఆ భగవంతుడి సన్నిధికి చేరుకున్నారు.
నరసమ్మ పురుడు పోస్తే, సుఖప్రసవం కావడమే కాదు, ఆరోగ్యకరమైన పిల్లలు పుడతారని గ్రామంలోని వారి నమ్మకం. నరసమ్మ దగ్గర ఒక ప్రత్యేకమైన గుణం ఉంది. ఇన్నివేల పురుళ్లు పోసినా, ఒక్కరిదగ్గరా ఒక్క పైసా తీసుకోలేదు. స్వచ్ఛంద సేవ చేయడానికే ఇష్టపడ్డారు వృద్ధురాలైన నరసమ్మ. ఇన్ని సేవలు చేసినందుకే ఆవిడను ‘సులగట్టి’ బిరుదుతో సత్కరించారు. ఈ కన్నడ పదానికి ‘పురుడు పోయడం’ అని తెలుగు అర్థం. అయితే ఆమె జీవితాన్ని సరిగ్గా నిర్వచించాలంటే, ‘ఎన్నో కుటుంబాలో సంతోషాన్ని తీసుకువచ్చిన వ్యక్తి’. నరసమ్మ అమ్మమ్మ మార్గమ్మ కూడా ఆ రోజుల్లో మంత్రసానిగా పని చేశారు. ఆవిడ నుంచే ఈ విద్యను నేర్చుకున్నారు నరసమ్మ. సులువుగా పురుడు పోయడం కూడా అమ్మమ్మ దగ్గర నుంచే అబ్బింది. టుంకూరు జిల్లా పావ్‌గడ్ గ్రామంలో జన్మించారు నరసమ్మ. 2014లో కర్ణాటక టుంకూర్ విశ్వవిద్యాలయం నరసమ్మను డా. సులగట్టి నరసమ్మగా గౌరవించింది. ప్రసవాలు చేయడమే కాదు, చాలామందికి తన గుడిసెలో ఆశ్రయం కూడా ఇచ్చారు. అనేక సంచార జాతుల వారు ఈ గ్రామానికి వచ్చి ఆమె దగ్గర సేదతీరి వెళ్లేవారట. వారికి సహాయం చేయడమంటే నరసమ్మకు పరమానందమని ఆమె కుటుంబ సభ్యులు చెప్పుకుంటారు. గర్భిణుల కోసం ఆకులతో మందులు తయారు చేసేవారు నరసమ్మ. ఈ మందులే ఆమె విజయానికి కారణం అయ్యాయి. గర్భంలో ఉండే బిడ్డకు తల భాగం ఎక్కడ ఉంది, లోపల బిడ్డ ఆరోగ్యం ఎలా ఉందో కూడా చేతితో ముట్టుకుని చెప్పేవారు నరసమ్మ. ఈ ఏడాది ఆమెకు పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది.
ఆరోగ్య రహస్యం
నరసమ్మకు 12 మంది పిల్లలు, 22 మంది మనవలు. తాను ఆరోగ్యంగా ఉండటం మాత్రమే కాకుండా, అందరికీ సుఖప్రసవం చేశారు నరసమ్మ. చిరుధాన్యాలు మాత్రమే ఆహారంగా తీసుకునేవారు. 90 సంవత్సరాల వయసులో కూడా ఆవిడకు కళ్లజోడు లేదు. శరీర భాగాలన్నీ ఆరోగ్యంగా పనిచేశాయి. బంగారంలాంటి మనసు ఆవిడది. తనకున్న పరిజ్ఞానంతో 180 మంది విద్యార్థులను పరీక్షలో ఉత్తీర్ణులను చేశారు. ఆఖరి అమ్మాయి జయమ్మను కూడా మిడ్‌వైఫ్‌ను చేశారు.
– జయంతి
Comments
Please login to add a commentAdd a comment