ప్రకృతి సేద్యానికి పెద్ద బాలశిక్ష
ఫల సాయం
మనుగడకై మానవుడు చేసిన ప్రయత్నాలన్నింటిలోను వ్యవసాయం అత్యంత ప్రధానమైనది, అత్యంత ప్రభావవంతమైనది. వేలాది సంవత్సరాలుగా మానవజాతి ఈ భూమిపై మనగలిగిందంటే కేవలం వ్యవసాయం వల్లనే. భారతదేశంలో వ్యవసాయం ఒక జీవన విధానంగా ఉంది. గ్రామాలు సస్యశ్యామలంగా ఉంటూ గ్రామస్తులంతా వ్యవసాయంలో భాగస్తులై ఫలసాయాన్ని అందరూ అందుకునేవారు. మనదేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం మూల స్తంభమై ఉండేది.
కానీ, అలాంటి సుస్థిర వ్యవసాయ వ్యవస్థ నేడు అస్థిర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అందరికీ అన్నంపెట్టే అన్నదాతలు లక్షల సంఖ్యల్లో ఆత్మహత్యలు చేసుకోవడం సభ్య సమాజానికే కాదు, దేశానికి కూడా తలవంపే. విచ„ý ణా రహితంగా రసాయనిక ఎరువులు పురుగుమందులు వాడడం మూలాన రైతుల పెట్టుబడులు పెరగడమే కాకుండా నేల, నీరు విషపూరితమై ఉత్పాదకత కూడా తగ్గిపోయింది. విత్తనాలు, ఎరువులు పురుగుమందులు ప్రతిదీ బజారు నుండి కొనుగోలు చేయవలసిన పరిస్థితిలో రైతు తన స్వావలంబనను కోల్పోయాడు. ఈ బరువు తడిసి మోపెడైనప్పుడు రైతు తన తలను పణంగా పెడుతున్నాడు.
వి^è క్షణా రహిత రసాయనిక సేద్యం వలన నేల నీరు విషపూరితాలు కావడమే కాకుండా, పండిన పంటలు కూడా విషపూరితాలై, మన ఆరోగ్యం మీద ఎంతో దుష్ప్రభావం చూపుతున్నాయి. అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ప్రసిద్ధి చెందిన పంజాబ్ రాష్ట్రం నుంచి ‘కేన్సర్ ఎక్స్‌ప్రెస్’ ట్రైన్ ప్రతి నిత్యం బయలుదేరుతుందంటే వ్యవసాయంలో ఈ ‘కేన్సర్’ ఎంతగా వ్యాపించిందో చెప్పకనే చెబుతున్నది. ఈ ‘కేన్సర్’ మనుషులకే కాదు పర్యావరణానికి కూడా వ్యాపిస్తున్నది. అతివృష్టి, అనావృష్టి, వరదలు, తుఫానులకు మూలాలు కొంతమేరకు రసాయనిక వ్యవసాయంలోనే ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ విపరీత పరిస్థితులకు కారణం వెదకినప్పుడు వ్యవసాయం, ప్రకృతి నుంచి దూరం కావడమనే విషయం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. మళ్లీ మానవ మనుగడ వైపు కృషి జరగాలంటే ప్రకృతి ఆధారంగా ప్రకృతితో మమేకమయ్యే విధంగా వ్యవసాయం చేయాలి. ఈ నేపథ్యంలో ఎన్నో ప్రయత్నాలు, ప్రయోగాలు జరిగినా పద్మశ్రీ సుభాష్ పాలేకర్ ప్రకృతి సేద్య పద్ధతి ఎక్కువ ప్రాచుర్యం పొందినది. జనబాహుళ్యంలోకి చొచ్చుకుపోయింది. సంక్షోభంలో నుంచి వ్యవసాయాన్ని వెలికితీసే ప్రయత్నంలో ప్రకృతి వ్యవసాయం ఒక ఆశాకిరణంగా వెలుగుతున్నది. గత ఏడెనిమిది సంవత్సరాలలో దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి వ్యవసాయం దిశగా రైతులు ముందంజ వేస్తున్నారు. సత్ఫలితాలు అందుకుంటున్నారు. ప్రభుత్వాల్లో, వ్యవసాయ అధికారుల్లో కూడా కొంత చలనం కనిపిస్తున్నది.
ఈ క్రమంలో రైతులకు కొత్తదారులు చూపించడంలో‘సాక్షి’దినపత్రికలో ప్రతి మంగళవారం వెలువడుతున్న ‘సాగుబడి’ పేజీ కీలకపాత్ర నిర్వహిస్తోంది. పేజీ ఇన్‌చార్జిగా పంతంగి రాంబాబు తెలుగునాట ప్రకృతి వ్యవసాయానికి రాచబాట వేస్తున్నారు. ఆసక్తిని రేకెత్తించే కథనాల ద్వారా సుస్థిర వ్యవసాయ రంగంలో నూతన ప్రయోగాత్మక విషయాలను, వ్యవసాయ రంగంలో కృషి చేస్తున్న కృషీవలులను వారం వారం పరిచయం చేస్తున్నారు. రైతు సోదరులకే కాకుండా సాధారణ పాఠకులకు కూడా అర్థమయ్యే రీతిగా రాయడం ద్వారా ‘సాగుబడి’ రైతులోకానికి ఎంతో చేరువయింది. మంగళవారం వచ్చిందంటే ‘సాగుబడి’ కోసం ఎదురు చూసేంతగా ఆ పేజీ ఆదరణ పొందింది. గత మూడేళ్లుగా అందులో వచ్చిన సుమారు 60 ముఖ్య కథనాలకు ప్రచురణకర్తలు పుస్తకరూపం ఇచ్చారు. రైతులకు ప్రకృతి వ్యవసాయంపై లోతైన అవగాహన కలిగించేందుకు క్రమ పద్ధతిలో 9 అధ్యయనాలలో ఈ కథనాలను కూర్చడం బాగుంది. 324 పేజీలతో ఆర్ట్ పేపర్‌పై అందంగా డిజైన్ చేసి, పంచరంగుల్లో అచ్చువేశారు లివాల్ట్ ప్రొడక్షన్స్ వ్యవస్థాపకులు కె. క్రాంతికుమార్.
‘ప్రకృతి వ్యవసాయానికి పెద్ద బాలశిక్ష’ అనే ఉపశీర్షికతో వెలువyì న ఈ ‘సాగుబడి’ పుస్తకం ప్రకృతి వ్యవసాయదారులకు ‘ఊతకర్ర’గా పనిచేస్తుంది. ఇంకా ఊగిసలాడే అధికార యంత్రాంగానికి ‘ముల్లుగర్ర’లాగా పనిచేస్తుందని ఆశిద్దాం. ఇదొక మంచి అడుగు. ముందుకు తీసుకువెళ్లడం మనందరి కర్తవ్యం. – పి. మోహనయ్య, విశ్రాంత నాబార్డు సి.జి.యం.
► జనవరి 3 సాయంత్రం 7 గంటలకు విజయవాడ బుక్ ఎగ్జిబిషన్‌లో ఈ పుస్తకం ఆవిష్కరణ జరుగుతుంది.
‘సాగుబడి’ సంకలనం: 324 పేజీలు
వెల: రూ. 400 (ఆన్‌లైన్‌లో కొంటే రూ. 350)
ప్రతులకు: కె. క్రాంతికుమార్‌రెడ్డి
లివాల్ట్ ప్రొడక్షన్స్, హైదరాబాద్):
80967 21184