మృతుడి సమీపంలో పురుగుమందు డబ్బా, శివాజీ మృతదేహం వద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులు
తూర్పుగోదావరి, తుని రూరల్: అప్పు చేసి కష్టించి పండించిన చెరకు పంట పేమెంట్లు అందక, చేసిన అప్పులకు వడ్డీలు, పనులు చేసిన కూలీలకు కూలి డబ్బులు చెల్లించలేక ఓ రైతు తన పంట పొలంలోనే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తుని మండలం ఎన్.సూరవరం గ్రామంలో బుధవారం జరిగింది. నాలుగేళ్లలో పాలకుల విధానాలతో అప్పులపాలైన జీలకర్ర శివాజీ(48) తన పంట పొలంలోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత టీడీపీ ప్రభుత్వంలో అనుసరించిన వ్యతిరేక విధానాలు సాగుదారులను నేటికీ వెంటాడుతున్నాయని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆత్మహత్యకు పాల్పడిన రైతు జీలకర్ర శివాజీకి రూ.ఐదు లక్షలకుపైబడి అప్పులు ఉన్నట్టు బంధువులు తెలిపారు.
స్థానికుల సమాచారం మేరకు జీలకర్ర శివాజీకి సొంత భూమి అరెకరంతోపాటు మూడెకరాలను కౌలుకు తీసుకుని చెరకు, పత్తి, వరి పంటలు సాగు చేస్తున్నాడు. గిట్టుబాటు ధర లేక నాలుగైదేళ్లుగా పెట్టిన పెట్టుబడులు తిరిగి రాక ఏటా అప్పులు పేరుకుపోయాయి. ఈ దశలో 2018–19 సీజన్‌లో తాండవ చక్కెర కర్మాగారానికి రైతు జీలకర్ర శివాజీ చెరకు సరఫరా చేశాడు. 15 రోజుల్లో చెల్లించాల్సిన చెరకు పేమెంట్లు తాండవ షుగర్స్ యాజమాన్యం చెల్లించలేదు. అయినా ఈ ఏడాది కూడా అప్పులు చేసి పండించిన చెరకు పంటను ఇటీవల తాండవ షుగర్స్‌కు సరఫరా చేశాడు. అప్పుదారులు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంటే ఫ్యాక్టరీ నుంచి బకాయిలు విడుదలైన వెంటనే చెల్లిస్తానంటూ కాలాన్ని నెట్టుకువచ్చాడు.
రూ.25 వేలు మాత్రమే రావడంతో..
రెండేళ్లు చెరకు సరఫరా చేయగా తాండవ షుగర్స్ బకాయిలలో కొంత మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. అలా జమైన మొత్తాన్ని మంగళవారం తుని వెళ్లిన శివాజీ బ్యాంకులో జమైన మొత్తాన్ని పరిశీలించాడు. కేవలం రూ.25వేలు మాత్రం రావడంతో ఆ మొత్తాన్ని అప్పుదారులందరికీ ఎలా సర్ధాలో తెలియక మనస్తాపంతో ఇంటికి తిరిగివచ్చాడు. శివాజీ రోజులాగే బుధవారం ఉదయం ఐదు గంటలకు నిద్రలేచి పొలంలోకి వెళ్లాడు. ఆ తర్వాత సమీపంలో పొలాల రైతులు వెళ్లగా పాకలో పడి ఉన్న శివాజీని, పక్కన ఉన్న పురుగు మందు డబ్బాను గమనించారు. అపస్మారకస్థితిలో ఉన్న శివాజీని ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా అప్పటికే మృతి చెందినట్టు గ్రామస్తులు నిర్ధారించారు. దీంతో రూరల్ పోలీసులకు, వీఆర్వోకు ఫిర్యాదు చేశారు. రూరల్ పోలీసులు వచ్చి మృతదేహాన్ని, సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సంఘటన స్థలంలో లభించిన పురుగు మందుడబ్బా, సగానికి కోసిన వాటర్ బాటిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
రుణ బాధలు భరించలేకనే..
అప్పులు బాధ తాళలేక వాటర్ బాటిల్‌లో పురుగులు మందు వేసుకుని సేవించి ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు. మృతుడు శివాజీకి భార్య ఆదిలక్ష్మి, రెండేళ్ల క్రితం వివాహమైన కుమార్తె స్వప్న, డిగ్రీ చదువుతున్న కుమారుడు పృథ్వీరాజ్ ఉన్నారు. రూరల్ సీఐ కిశోర్‌బాబు ఆధ్వర్యంలో ఎస్సై వై.గణేష్ కేసు నమోదు చేశారు. పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. బంధువులు, స్థానికుల నుంచి వివరాలను సేకరించారు. విషయం తెలియడంతో స్థానిక వైఎస్సార్ సీపీ, టీడీపీ నాయకులు రైతు శివాజీ మృతదేహం వద్ద శ్రద్ధాంజలి ఘటించి, కుటుంబాన్ని పరామర్శించారు. రైతు శివాజీ ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజాకు తెలియజేసినట్టు నాయకులు చింతంనీడి కృష్ణ, నడిగట్ల అనిల్‌బాబు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చినట్టు వారు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment