ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పణ చేయాలని... | Netaji's birthday tomorrow | Sakshi
Sakshi News home page

ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పణ చేయాలని...

Published Wed, Jan 21 2015 11:42 PM | Last Updated on Sat, Sep 2 2017 8:02 PM

ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పణ చేయాలని...

ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పణ చేయాలని...

రేపు నేతాజీ జయంతి

కోల్‌కతా వీధులన్నీ - ‘‘అదిగో... మన అమ్మాయి వచ్చేస్తుంది’ అని మేలుకుంటాయి. చేతులన్నీ హారతి పళ్లేలవుతాయి. దారులన్నీ స్వాగత తోరణాలవుతాయి. ఆ వచ్చేది ఎవరో కాదు... నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూతురు అనితాబోస్. ఈ ప్రొఫెసరమ్మ కోల్‌కతా వీధుల్లో కారులో ప్రయాణిస్తున్న సమయంలో పక్కవారితో మాట్లాడుతున్నట్లుగానో, పుస్తక పఠనంలో లీనమైపోయినట్లుగానో కనిపించరు. చెప్పాలంటే, ఆమె వీధులతో ‘మౌన సంభాషణ’ చేస్తూ ప్రయాణిస్తున్నట్లుగా కనిపిస్తారు.

అల్లంత దూరాన... అంతెత్తులో గంభీరంగా  నేతాజీ విగ్రహం. అది చూస్తున్నప్పుడు ఆయన కూతురు కళ్లలో కనిపించే ‘మెరుపు’ను పట్టుకోగలిగితే ఆమె అణువణువూ తండ్రి నామస్మరణతో ఎంత గర్వంగా ఎగిసిపడుతుందో అర్థమవుతుంది. బాల్యం నుంచి ఇప్పటి వరకు తన తండ్రి గురించి ఆమె ఎన్నెన్నో వీరగాథలు విని ఉంది. వాటిలో పూర్తి నిజాలు ఉండి ఉండొచ్చు. వీరాభిమానం నుంచి పుట్టిన ‘కల్పన’లు ఉండి ఉండొచ్చు. అయితే తన తండ్రి ‘చారిత్రక పురుషుడు’ అనేదాంట్లో మాత్రం మరో మాటకు తావులేదనే విషయం అనితాబోస్‌కు అర్థమైంది. ఇండియాలో ఉన్న నేతాజీ బంధువుల మాటల్లో ‘నాన్న’ జాడను వెదుక్కుంది ఆమె. ఆమె మోములో ‘నేతాజీ’ని చూసుకొని మురిసిపోయేవారు బంధువులు.

స్వాతంత్య్రానికి పూర్వం నాటి నలుపు, తెలుపు ఛాయాచిత్రాలతో, ఇప్పటి ‘ప్రెసిడెన్సీ కాలేజీ’ విజువల్‌తో సుభాష్ చంద్రబోస్ కుటుంబ నేపథ్యం, చదువు పరిచయం అవుతుంది. బంగారు చెంచా నోట్లో పెట్టుకొని పుట్టారు సుభాష్ చంద్రబోస్. కాలు కింద పెట్టాల్సిన అవసరం లేదు. సుఖాలు, సౌకర్యాలు క్యూ కట్టి నిల్చొంటాయి. చదువు విషయానికి వస్తే పుంభావ సరస్వతి. ఇండియన్ సివిల్ సర్వీస్‌లో నాలుగవ ర్యాంకు. ఎటు చూసినా భద్రజీవితమే! ‘‘ఆయనకేం తక్కువ’’ అని అనుకోవడానికి పెద్ద జాబితానే ఉంది. వీటన్నిటినీ కాదనుకొని సుభాష్ స్వాతంత్య్ర సమరంలోకి అడుగు పెట్టారు. నేతాజీ అయ్యారు. బ్రిటిష్ వాడి జాత్యహంకారంపై ఒంటి కాలి మీద లేచారు. అనేకానేకసార్లు కారాగారం పాలయ్యారు. అనారోగ్యానికి గురయ్యారు.

ప్రతిష్ఠాత్మకమైన ‘భారత జాతీయ కాంగ్రెస్’ అధ్యక్ష పదవికి ఎన్నికైన బోస్ ఆ తరువాత కాలంలో కాంగ్రెస్‌ను వీడారు. ‘ఇండియా ఈజ్ గోయింగ్ టు బీ ఫ్రీ. అవర్ స్ట్రగుల్ ఈజ్... నో డౌట్ ఏ నాన్‌వ యొలెన్స్ స్ట్రగుల్...’ ఈ దృశ్యంలో బోస్ కంచుకంఠాన్ని మళీ మళ్లీ వినాలనిపిస్తుంది. భారత స్వాతంత్య్రానికి ‘నాన్‌వయొలెన్స్ స్ట్రగుల్’ మాత్రమే సరిపోదని ‘ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్’ను స్థాపించారు. ప్రతి మనిషీ ఒక సైనికుడై ప్రాణార్పణ చేయాలన్నారు. ‘ఫాసిస్ట్ డిసిప్లేన్’ ‘సోషలిస్ట్ ఐడియాలజీ’తో ముందుకు వెళ్లాలనే బోస్ ఆలోచనను చాలామంది విభేదించినా... అంతకంటే చాలామంది ఆయన్ను ఆరాధించడానికి ప్రొఫెసర్ అంటోని పెలింక తన ఇంటర్వ్యూలో ఉపయోగించిన ‘మాగ్నటిక్ పర్సన్’ అనే విశేషం  కారణం కావచ్చు. ‘డెమోక్రసీ ఇండియా స్టైల్’ గ్రంథకర్తగా పెలింక ప్రసిద్ధుడు.
 చరిత్రకారుడు సుగతబోస్ నేతాజీకి సమీప బంధువు కూడా. స్వాతంత్య్ర సమర బాటలో నేతాజీ చేసిన ప్రయాణాల గూర్చి, ఎదురైన ప్రమాదాల గూర్చి తన ఇంటర్వ్యూలో చెప్పారు. నేతాజీని ఉద్దేశించి సుగతబోస్ ‘ ఏ మ్యాన్ విత్ అన్‌లిమిటెడ్ కరేజ్’ అని ఎందుకన్నారో ఆయన చెప్పిన విషయాల్లోనే తెలిసిపోతుంది.

నేతాజీ సెక్రటరీ భార్య  ఇంటర్వ్యూతో పాటు ప్రొఫెసర్ క్రిష్ణబోస్, జస్టిస్ యం.కె.ముఖర్జీ... మొదలైన వారి ఇంటర్వ్యూలు   ఈ డాక్యుమెంటరీకి బలాన్ని ఇచ్చాయి. ఒక దృశ్యంలో: అనితాబోస్, కెప్టెన్ లక్ష్మీ సెహెగెల్ ఇంటికి వెళ్లి ఆప్యాయంగా కౌగిలించుకుంటారు.
 ‘మై డాటర్!’ అని అనితను అక్కున చేర్చుకుంటారు లక్ష్మీ. ఇద్దరి కళ్లలో నీళ్లు ప్రేక్షకులకు సైతం భావోద్వేగపూరిత కన్నీళ్లను తె ప్పిస్తాయి. గత దృశ్యాల నుంచి వర్తమానానికి, ఇక్కడి నుంచి మళ్లీ గతానికి వెళ్లే దృశ్యాల సమాహారంగా ఈ డాక్యుమెంటరీ కనిపిస్తుంది. సందర్భానుసారంగా ఉపయోగించుకున్న ఆనాటి బ్రిటీష్ రాజ్‌కు సంబంధించిన నలుపు తెలుపు దృశ్యాలు ఆకట్టుకుంటాయి.
 ఈ డాక్యుమెంటరీకీ కాలం లేదు. ఇది గతానిది. వర్తమానానిది. రేపటి భవిష్యత్‌ది!

ఒక మాట: నేతాజీకి సంబంధించిన విషాదమేమిటంటే, మరణానికి సంబంధించిన మిస్టరీ గురించి జరిగినంత చర్చ ఆయన రాజకీయాభిప్రాయాల గురించి, సైద్ధాంతిక దృక్పథం గురించి జరగలేదు. ఒకవేళ జరిగినా...అది ప్రధాన స్రవంతి మీడియాకు దూరంగా ఉంది. ‘ఫలానాచోట... నేతాజీ స్వామీజీగా అవతరించాడు’లాంటి టాపిక్‌లపై జరిగే చర్చ కంటే ఆ యోధానుయోధుడి పొలిటికల్ కెరీర్, పబ్లిక్ లైఫ్ గురించి తెలుసు కోవాల్సిన విషయాలు, చర్చించాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి.
 - యాకుబ్ పాషా యం.డి

 
డాక్యుమెంటరీ పేరు: నేతాజీ సుభాష్ చంద్రబోస్
డెరైక్టర్: తిల్‌మన్ రెమ్మే 
కె మెరా: బ్రెమెర్ జాన్ హిన్‌రిచ్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement