పెట్టుబడి పదిహేను వందలు టర్నోవర్ కోటి రూపాయలు! | Nevertheless, it has so far invested in turnover! | Sakshi
Sakshi News home page

పెట్టుబడి పదిహేను వందలు టర్నోవర్ కోటి రూపాయలు!

Published Thu, Jan 9 2014 11:56 PM | Last Updated on Sat, Sep 2 2017 2:26 AM

పెట్టుబడి పదిహేను వందలు టర్నోవర్ కోటి రూపాయలు!

పెట్టుబడి పదిహేను వందలు టర్నోవర్ కోటి రూపాయలు!

అప్పుడే తాను పెద్ద ఎంటర్‌ప్రెన్యూర్ అయిపోయినట్టు భావించడం లేదు అనిమేష్. మరో3 సంవత్సరాల్లోపు కంపెనీని మూడు కోట్ల రూపాయల టర్నోవర్‌కు తీసుకెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాడతను.
 
సెర్చింజిన్ దిగ్గజం గూగుల్‌కు ప్రత్యామ్నాయంగా ఒక కొత్త వెబ్‌సైట్ ప్రారంభించేద్దాం అనుకొన్నాడు ఆ యువకుడు. అతడిది అతి విశ్వాసం కాదు. అతడి ఆత్మవిశ్వాసం ఆ స్థాయిలో ఉంది. అయితే ఆలోచించే కొద్దీ గూగుల్.కామ్‌ను చూసేవారికి తన సైట్‌ను చూడాల్సిన అవసరం ఉండదనిపించింది. అయితే ఏదో చేయాలన్న తపన మాత్రం మిగిలింది. ఆ స్ఫూర్తితో అతడు పదిహేను వందల రూపాయల పెట్టుబడితో ఒక వ్యాపారాన్ని ప్రారంభించాడు. మూడేళ్లలో కోటిరూపాయల టర్నోవర్‌కు దాన్ని తీసుకెళ్లాడు. ఆ యువకుడి పేరు అనిమేష్ సారింగి. భువనేశ్వర్‌కు చెందిన ఆ 20 యేళ్ల కుర్రాడి విజయగాథ ఇది...
 
12 యేళ్ల వయసు నుంచే ఏదో ఒక వ్యాపారం చేయాలన్న కోరిక ఉందట అనిమేష్‌కి. తను ఒక పెద్ద వ్యాపార వేత్త అయిపోవాలన్నది ఆ వయసులో అతడికి ఉన్న డ్రీమ్. అయితే ఆ డ్రీమ్‌ను అతడు మనసులో దాచేసుకొని దాని గురించి ఫాంటసీల్లో మునిగి తేలుతూ సమయాన్ని గడిపేయలేదు. ఆ కోరికను బయటపెట్టుకొన్నాడు. అలా బయటపెట్టినప్పుడే కదా ఎవరికైనా వాస్తవం అర్థమయ్యేది! అనిమేష్ విషయంలోనూ అదే జరిగింది. తన ఆలోచన గురించి చెబితే తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. చక్కగా చదువుకొమ్మని హిత బోధ చేశారు.

అప్పుడు అనిమేష్ మనసులో ఫాంటసీలు మొదలయ్యాయి. అమ్మానాన్నలు చెప్పినట్టుగా చదువుకొంటూనే వ్యాపారతవేత్తగా ఎదగడానికి సంబంధించిన ప్రయత్నాలను చేయసాగాడు. ఇంటర్ పూర్తయిన తర్వాత తన ఐడియాలను స్నేహితులతో పంచుకొనే అవకాశం దొరికింది. వారితో సాధ్యాసాధ్యాలను చర్చించి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ క్రమంలోనే మొదట ఒక సెర్చింజన్‌ను అభివృద్ధి చేయాలని అనుకొన్నాడట. అయితే అది క్లిక్ కావడం కష్టసాధ్యం అని అర్థం చేసుకొని వేరే ఆలోచన మొదలుపెట్టాడు.

ఆ సమయంలో ‘అమాజింగ్ యూత్’ అంటూ ఒక సంస్థను రిజిస్టర్ చేయించాడు అనిమేష్. దాని పేరు మీద ఒక వెబ్‌సైట్‌ను స్థాపించాడు. మూడేళ్ల క్రితం ఈ రిజిస్ట్రేషన్ కోసం పెట్టిన ఖర్చు పదిహేను వందలు. స్నేహితులను కలుపుకొని ఆ సంస్థ తరపున ఏవైనా కాంట్రాక్టులు చేయించాలనేది అనిమేశ్ ఐడియా. ఆ క్రమంలో మొదట వారికి వీధి వీధి తిరిగి ఒక కంపెనీకి సంబంధించిన వాల్‌పోస్టర్లను అతికించే కాంట్రాక్టు దక్కింది. అనిమేష్ బ్యాచ్ అంతా ఒక్కరోజు రాత్రిలోనే 2,5000 పోస్టర్లను అతికించారు.

ఒక్కోపోస్టర్‌కు పదిరూపాయలు వచ్చిందట. అక్కడ నుంచి తన కంపెనీని విస్తరించే పనిని మొదలుపెట్టాడు. ఆ కాంట్రాక్ట్ అతడికి ఎన్నో సంపాదనా మార్గాలను చూపింది. ఆ ఉత్సాహంతో ఔత్సాహిక యువతకు, కంపెనీల హెచ్‌ఆర్‌లకు వారధిగా మారాడు. కాల్‌సెంటర్‌లు, డాటా ఆపరేటింగ్ ఏజెన్సీలకు ఎంప్లాయీస్‌ను కుదిర్చే పనిని మొదలుపెట్టాడు. అటు కంపెనీల నుంచి కొంత, నిరుద్యోగుల నుంచి మరికొంత కమీషన్ తీసుకొంటూ ఒక ఆదాయమార్గాన్ని ఏర్పాటు చేసుకొన్నాడు.

భువనేశ్వర్‌లోని అనేక కంపెనీల మానవ వనరుల అవసరాలకు ‘అమేజింగ్‌యూత్’ వాళ్లు సోర్స్‌గా మారారు. నెలకు 30 నుంచి 40 కంపెనీలతో ఇలాంటి కాంట్రాక్టులు కుదుర్చుకోవడంతో అనిమేష్ స్థాపించిన ఈ కంపెనీ దశ తిరిగింది. ఆదాయం పెరిగింది. బ్రాంచ్‌లు పెరిగాయి. ప్రస్తుతం ఒరిస్సా, పశ్చిమబెంగాల్, చెన్నై, కర్ణాటక, ఢిల్లీ తదిరత చోట్ల ‘అమేజింగ్ యూత్’కు బ్రాంచీలు ఉన్నాయి. ఇప్పటివరకూ వేలాదిమంది యువతీ యువకులకు ఈ కంపెనీ ప్లేస్‌మెంట్స్‌ను ఇప్పించింది. దీంతో 40 నుంచి 50 శాతం ఆదాయంతో ఈ కంపెనీ టర్నోవర్ కోటి రూపాయలకు చేరింది.

అమెరికాలో కూడా ఇప్పుడు ఈ ఏజెన్సీ కార్యకలాపాలు మొదలయ్యాయి. అయితే అనిమేష్‌కు అప్పుడే తాను పెద్ద ఎంటర్ ప్రెన్యూర్ అయిపోయినట్టు భావించడం లేదు. మూడు సంవత్సరాల్లోపు కంపెనీని మూడు కోట్ల రూపాయల టర్నోవర్‌కు తీసుకెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాడతను. ఇప్పటివరకూ తను సాధించిన విజయంలో తన స్నేహితుల సహకారం మరవలేనిదని అంటాడు అనిమేష్. అమేజింగ్ యూత్‌ను బెటర్ స్థాయి నుంచి బెస్ట్‌కు తీసుకెళ్లాలన్నదే తన ప్రస్తుత లక్ష్యం అని అనిమేష్ చెబుతాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement