సిరి వరాలు
మనింట్లోనే ఉంది మహాలక్ష్మి!
ముస్తాబైతే అచ్చం వరమహాలక్ష్మియే!
పూజించనక్కర్లేదు.
నైవేద్యం పెట్టనక్కర్లేదు.
మనింటి అమ్మాయి
వరాలు ఇస్తూనే ఉంటుంది.
ఇవాళ వరలక్ష్మీ వ్రతం
మన ఇంటి వరలక్ష్ములకు
అందమైన అలంకరణలు పట్టుచీరలు.
►నీలం, బంగారు రంగు కలిసిపోతే వచ్చే మెరుపు ఈ చీర సొంతం. గులాబీ రంగు అంచు మీద అచ్చమైన జరీ జిలుగులు పండగ శోభను పెంచుతున్నాయి. దీనికి డిజైనర్ బ్లౌజ్‌ను జత చేయడంతో నవతరాన్ని ‘పట్టు’ అమితంగా ఆకట్టుకుంటుంది.
►పట్టు చీరకు నిలువెల్లా అల్లుకున్న జరీ పువ్వుల సొగసు చూపుతిప్పుకోనివ్వడం లేదు. అదే రంగులో ఆకట్టుకునే అంచు లక్ష్మీపూజలో వేయి దీపాల వెలుగులు విరబూయడానికి సిద్ధం అంటుంది.
►ఈ తరం వరమహాలక్ష్మి మేనికి లైట్‌వెయిట్ పట్టుచీర కొంగొత్త కలలకు ఆహ్వానం పలకడానికి సిద్ధం అంటోంది. సంప్రదాయంలోనూ ఆధునికత తోడైతే అలంకరణ కొత్త రెక్కలు కట్టుకుంటుంది.
►అమ్మ పట్టుచీర కొత్తగా రూపుకట్టాలంటే దానికి కొత్త హంగులు జతచేర్చాలి. అందుకు అచ్చమైన పట్టుచీరనే ఓ ఉదాహరణ. ముదురు పసుపు ప్లెయిన్ పట్టుచీరకు కళ తెచ్చే అంచు, చీరను మరింత హైలైట్ చేసే డిజైనర్ జాకెట్టు వేడుకకు వెయ్యింతల వెలుగులు తెస్తుంది.
►పండగకళ రావాలంటే ఆకుపచ్చ రంగు ఇంటికి తోరణమవ్వాల్సిందే! శ్రావణలక్ష్మిని ఆహ్వానించాలంటే పచ్చరంగు పట్టుచీర జిలుగులు నలువైపులా పరుచుకోవాల్సిందే! చిన్న చిన్న జరీ బుటీతో సెల్ఫ్ బార్డర్‌తో ఆకట్టుకునే ఇలాంటి డిజైన్లు ఎన్నో మనసును కట్టడి చేస్తూనే ఉంటాయి.
► నీలాకాశం ఇలకు దిగితే.. ఆ చుక్కలు నట్టింట్లో నడయాడితే.. ఆ అందాన్ని, ఆనందాన్ని వర్ణించడం తరమా! మన ఇంటి వరమహాలక్ష్మి పట్టుచీరలో ఇలా కనువిందు చేస్తే కళ్లూ, మనసూ నిండి... ఆ ఇంట సిరిసంపదలు కొల్లలుగా జల్లులై కురవాల్సిందే!
►కంజీవరం పట్టుచీరలో ఆకుపచ్చ, బంగారు రంగులు ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయి. వీటికి ఆభరణాల జిలుగులు, పువ్వుల కళలు తోడై సంప్రదాయ వెలుగులు విరజిమ్ముతున్నాయి. శ్రావణలక్ష్మికి స్వాగతం పలుకుతున్నాయి.
►పసుపు, కుంకుమ, పచ్చదనం.. ఈ మూడింటి రూపం శ్రీమహాలక్ష్మి. ఆ కళ కనుల నిండుగా మెరవాలంటే పట్టుచీరతో ముస్తాబు అవ్వాల్సిందే. చీర జరీ జిలుగులు మోములో పువ్వులై విరియాల్సిందే! మేని వెలుగులు ముచ్చటగొలపాలంటే ఆభరణాల కాంతులు అణకువగా ఉండాల్సిందే!