
నయగారాల సోయగాలు వందేళ్లకు పైగా చరిత్ర
వివాహాలు, ప్రత్యేక సందర్భాలలో పార్సీ మహిళలు గారా చీరలను ధరించేవారు. అత్యంత ఖరీదైనదిగా పేరొందిన ఈ ఎంబ్రాయిడరీని కొన్ని ప్రత్యేక రోజులకే పరిమితం చేయకూడదని నేడు సృజనాత్మకంగా దుపట్టాలు, లెహంగాలు, ఇండోవెస్ట్రన్ డ్రెస్సుల మీదకు తీసుకు వస్తున్నారు. భారతదేశం నుండి పార్సీలు వాణిజ్యం కోసం చైనాకు ప్రయాణించే రోజుల్లో ‘గారా’ ఎంబ్రాయిడరీ మన దేశంలోకి అడుగుపెట్టింది.
పార్సీలు మన దేశం నుండి నల్లమందు, పత్తిని చైనాకు తీసుకెళ్లి, అక్కడి టీ కోసం మార్పిడి చేసేవారు. బ్రిటిష్ వారు ఐరోపాలో ఎక్కువ టీని అమ్మాలనుకోవడంతో పార్సీలు త్వరగా వ్యాపారంలో ధనవంతులయ్యారు. వారు తిరిగి వచ్చేటప్పుడు చైనాలో అందుబాటులో ఉన్న సిరామిక్స్, వివిధ ప్రాచీన వస్తువులను కూడా తీసుకు వచ్చేవారు. ఒక వ్యాపారి కళాత్మకంగా ఉండే ఆ ఎంబ్రాయిడరీ ముక్కను ఒకటి తీసుకువచ్చాడన్నది చరిత్ర. ఆ ఎంబ్రాయిడరీ లో రకరకాల మార్పులు చేసి, తదుపరి కాలంలోపార్సీ మహిళల చీరల మీద వైభవంగా వెలిసింది. ముంబైలో స్థిరపడిన పార్సీ సమాజం చాలా ధనవంతులుగా, గారా చీరలు వారి సిగ్నేచర్‌గా మారిపోయాయి. ఆ విధంగా పార్సీ గారా అనే పేరు స్థిరపడిపోయింది.
‘గారా’ ఎంబ్రాయిడరీలో పోల్కా చుక్కలను, సాలీడులా అనిపించే మోటిఫ్స్ కనిపిస్తాయి. పక్షులు, వృక్షజాలం, జంతుజాలం.. వంటివి ఈ ఎంబ్రాయిడరీలో ఒద్దికగా కనిపిస్తాయి. అచ్చమైన పట్టు దారాలతో సంక్లిష్టంగా ఉండే ఈ డిజైన్‌తో చీర రూ పొందించాలంటే కళాకారులకు కొన్ని నెలల సమయం పడుతుంది. అందుకే ఈ ఎంబ్రాయిడరీ అత్యంత ఖరీదైనదిగా పేరొందింది.
ఇదీ చదవండి: వేసవిలో మెరిసే చర్మం : అద్భుతమైన మాస్క్‌లు
నాటి రోజుల్లో ఈ ఎంబ్రాయిడరీకి సాలిఘజ్’ అని పిలిచే ప్రత్యేక ఫ్యాబ్రిక్‌ను ఎంపిక చేసుకునేవారు.. 1930లలో ఈ ఫ్యాషన్ వెలుగు చూసింది. తర్వాత 80లలో పునరుద్ధరించబడింది. ముంబైలో పార్సీలు ఈఎంబ్రాయిడరీని మందపాటి పట్టు ఫ్యాబ్రిక్ పైనే డిజైన్ చేసేవారు. ఇప్పుడు క్రేప్, జార్జెట్, షిఫాన్ ఫ్యాబ్రిక్‌లను ఉపయోగిస్తున్నారు. డిజైన్‌కి పెద్దమొత్తంలో పట్టుదారాలు ఉపయోగిస్తారు కాబట్టి కొన్ని ఫ్యాబ్రిక్స్ ఈ ఎంబ్రాయిడరీ బరువును మోయలేవు.

దాదాపు 40–50 సంవత్సరాల క్రితం ట్రెండ్‌లో ఉన్న ఈ కళ ఇప్పుడు మళ్లీ కళగా వెలుగులోకి రావడం చూస్తుంటే టైమ్‌లెస్ ట్రెడిషన్ అనిపించకమానదు. తరతరాలుగా చేతులు మారే ఆభరణాలలా పార్సీ‘గారా’ అనే ఎంబ్రాయిడరీని అత్యున్నతమైన వారసత్వ సంపదగా పేర్కొంటారు. గాజ్ లేదా పాజ్ అనే అందమైన పట్టు వస్త్రంపై రూపొందించే ఈ ఎంబ్రాయిడరీ సంప్రదాయ వేడుకలలో వైభవంగా వెలిగిపోతుంటుంది. వందేళ్లకు పైగా ప్రాచీన చరిత్ర కల ‘గారా’ డిజైన్ నేడు సెలబ్రిటీలకు ఇష్టమైన ఎంపిక అయ్యింది.
ఇదీ చదవండి: వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? బెస్ట్ టిప్స్ ఇవే!
ఇటీవల హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న నీతా అంబానీ పార్సీ గారా శారీలో మెరిసి, మరోసారి వారసత్వ సంపదను అందరికీ గుర్తుచేశారు. సంక్లిష్టమైన ఈ హస్తకళ పూర్తి కావడానికి దాదాపు రెండేళ్లు పట్టింది. ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ జెనోబియా ఎస్.దావర్ ఈ చీర రూపకర్త.
Comments
Please login to add a commentAdd a comment