సందర్భానికి తగినట్టు దుస్తులను, నగలను, అలంకరణను ఎంచుకోవడంలో రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్మన్ నీతా అంబానీది ఎపుడూ అందెవేసిన చేయి. పట్టు చీరలు, బెనారసీ, స్వదేశీ నేత చీరలు అంటే ఆమెకు ప్రాణం. తాజాగా తన చిన్నకుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా నిర్వహించిన సామూహిక వివాహాల కార్యక్రమంలో కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు. దీనికి గుట్టపూసల నెక్లెస్, స్టైలిష్ చెవిపోగులు, బన్, గజ్రా (మల్లె పూల దండ)తో ఇలా ప్రతీ విషయంలో తన ష్యాషన్ స్టయిల్‌ను చాటుకున్నారామె. తన సిగ్నేచర్ స్టైల్‌లో ఆమె లుక్, ముఖ్యంగా చీరలోని మరో ప్రత్యేకత విశేషంగా నిలిచింది.
అనంత్-రాధిక వివాహ సన్నాహాకాలు జోరందుకున్న నేపథ్యంలో జూలై 12,మంగళవారం నిరుపేద కుటుంబాలకు చెందిన 50 జంటలకు సామూహిక వివాహాలను జరిపించారు. రిలయన్స్ కార్పొరేట్ పార్క్‌లో జరిగిన ఈ వేడుకలో నీతా అంబానీ ముదురు ఎరుపు రంగు బెనారసీ చీరలో మహారాణిలా కనిపించారు. ముఖ్యంగా చీర ఒక విషయంలో అందరినీ ఆకర్షించింది. పవిత్ర గాయత్రీ మంత్రాన్ని బంగారంతో ఎంబ్రాయిడరీ చేయించడమే దీనికి కారణం. దీంతో నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
బంగారు జరీ వర్క్, పక్షుల డిజైన్‌తో తీర్చి దిద్దిన అద్భుతమైన బెనారసి చీరకు తగ్గట్టుగా గుట్టపూసల నెక్లెస్‌ను ధరించారు. ఈ నెక్లెస్ ఆంధ్రప్రదేశ్‌కి చెందిన సాంప్రదాయ దక్షిణ భారత డిజైన్‌తో పోలి ఉందని నిపుణులు పేర్కొన్నారు. అలాగే చెవిపోగుల్లో శ్రీకృష్ణుని బొమ్మను కూడా గమనించవచ్చు.
కాగా సామూహిక వివాహ వేడుకల్లో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీతోపాటు పెద్ద కుమారుడు, ఆకాష్ అంబానీ భార్య శ్లోకా మెహతా, కుమార్తె ఇషా అంబానీ పిరమల్,, భర్త ఆనంద్ పిరమల్ పాల్గొన్నారు.
శ్లోకా, నీతా ఇద్దరూ నూతన వధూవరులకు ఖరీదైన బహుమతులను అందించారు. దేశవిదేశాలకు అతిరథ మహారథులసమక్షంలో జూలై 12న అనంత్-రాధిక వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment