కొత్త సరకు | New goods | Sakshi
Sakshi News home page

కొత్త సరకు

Published Wed, Jun 25 2014 11:35 PM | Last Updated on Sat, Aug 18 2018 4:50 PM

New goods

ఇక ఆండ్రాయిడ్ టీవీలు...

మీ టీవీ స్క్రీన్‌పై నుంచి మిత్రులకు వాట్సప్ మెసేజ్ పంపాలనుకుంటున్నారా? అయితే  ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే సరికొత్త ఎల్‌ఈడీ టీవీలు మీ కోసమే! దేశీయ కంపెనీ అరైజ్ ఈ మేరకు సరికొత్త టీవీ శ్రేణిని మార్కెట్‌లోకి విడుదల చేసింది. 32 అంగుళాల నుంచి 84 అంగుళాల సైజు వరకూ ఉన్న ఈ టెలివిజన్ల ధరలు రూ.35 వేల నుంచి రూ.రెండు లక్షల మధ్య ఉంటాయి. ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ టెలివిజన్ల ద్వారా వెబ్‌బ్రౌజింగ్‌తోపాటు, వైఫై, హోంషేరింగ్ వంటివి చేసుకోవచ్చు. 3 హెచ్‌డీఎంపై పోర్టులతోపాటు, యూఎస్‌బీ, ఎస్‌డీ కార్డు మెమరీకి ఏర్పాట్లు ఉన్నాయి దీంట్లో. మొబైల్ హై డెఫినిషన్ లింక్ ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్లను నేరుగా టీవీతో అనుసంధానించుకో వచ్చు. టెలివిజన్‌తోపాటు క్వెర్టీ కీబోర్డు, ఆరు ఆక్సిస్‌లు ఉన్న జాయ్‌స్టిక్ కూడా లభిస్తాయి కాబట్టి గేమింగ్, వెబ్‌సర్ఫింగ్‌లలో వినూత్న అనుభూతి పొందవచ్చు.
 
నమో పేరుతో యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్...

ఇన్నోవేజియన్ అనే దేశీ ఐటీ సంస్థ దేశ ప్రధాని నరేంద్ర మోడీ పేరుతో ఓ ఉచిత యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది. మాల్‌వేర్లు, వైరస్ అటాక్‌ల నుంచి పీసీలను రక్షించేందుకు ఈ సాఫ్ట్‌వేర్ ఉపయోగపడుతుంది. ఇంటర్నెట్ వినియోగంలో దేశం ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్నప్పటికీ చాలా తక్కువమంది  లెసైన్స్డ్ యాంటీవైరస్‌ను వాడతారని అంచనా. ట్రయల్ వెర్షన్లను పదేపదే ఇన్‌స్టాల్ చేసుకోవడమూ ఎక్కువ. దాదాపు 57 శాతం పీసీలకు ఎలాంటి రక్షణ ఏర్పాట్లూ లేవని, ఒకవేళ ఉన్నా అవి గుర్తుతెలియని అప్లికేషన్లు మాత్రమేనని నిపుణులు అంటున్నారు. అందువల్లనే బేసిక్ ప్రొటెక్షన్‌ను దృష్టిలో ఉంచుకుని తాము నమో యాంటీవైరస్‌ను అభివృద్ధి చేశామని అంటోంది కంపెనీ. రియల్‌టైమ్ డిటెక్షన్, ఇంటెలిజెంట్ స్కానింగ్ వంటి ఫీచర్లు ఉన్న ఈ సాఫ్ట్‌వేర్ ఎక్కువ మెమరీని కూడా ఆక్రమించదని కంపెనీ తెలిపింది.
 
సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్...

 సామ్‌సంగ్ కంపెనీ తాజాగా గెలాక్సీట్యాబ్ 4.7 వెర్షన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఈ శ్రేణిలో ఇప్పటికే 8, 10.1 అంగుళాల ట్యాబ్లెట్లు అందుబాటులో ఉండగా తాజాగా ఏడు అంగుళాల స్క్రీన్‌సైజును పరిచయం చేసింది ఈ కంపెనీ. ధర రూ.17825. ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వెబ్‌సైట్ల ద్వారా అందుబాటులో ఉన్న ఈ సరికొత్త ట్యాబ్లెట్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కిట్‌క్యాట్‌తో పనిచేస్తుంది. ప్రాసెసర్ వేగం 1.2 గిగాహెర్ట్జ్ కాగా, నాలుగు కోర్లు ఉంటాయి. ప్రధాన కెమెరా రెజల్యూషన్ 3 ఎంపీకాగా, వీడియోకాలింగ్ కెమెరా 1.3 ఎంపీ రెజల్యూషన్‌తో ఉంటుంది. స్క్రీన్ డిస్‌ప్లే రెజల్యూషన్ 1280 బై 800 పిక్సెల్స్. ర్యామ్ 1.5 జీబీ, ప్రధాన మెమరీ 8 జీబీలు. ఎస్‌డీ కార్డు ద్వారా మరింత మెమరీని  ఏర్పాటు చేసుకోవచ్చు. బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్.
 
ఇక పీసీల్లోనూ టాటాస్కై...


 పీసీలు, టెలివిజన్ల మధ్య అంతరం చెరిగిపోతోందనేందుకు ఇదో తార్కాణం. టెలివిజన్ కార్యక్రమాల రికార్డింగ్‌లు, లైవ్ స్ట్రీమింగ్ కోసం ఎన్నో వెబ్‌సైట్లు అందుబాటులో ఉన్నప్పటికీ తాజాగా ప్రముఖ దేశీయ సంస్థ టాటాస్కై... పీసీ, ల్యాప్‌టాప్‌ల కోసం ప్రత్యేకంగా ఎవరీవేర్‌టీవీ పేరుతో ఒక అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ సర్వీస్ ఇప్పటికే ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్లలోనూ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఈ అప్లికేషన్‌ను పీసీలపై డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా ఎటువంటి అదనపు రుసుము చెల్లించకుండానే సోనీ సిక్స్ టీవీ ఛానల్ ద్వారా ప్రపంచకప్ ఫుట్‌బాల్ పోటీలను చూడవచ్చు. ఎవరీవేర్ టీవీలో లైవ్ టీవీ, మునుపటి ఐదు రోజుల కార్యక్రమాలను చూసేందుకు క్యాచప్ టీవీ, సినిమాలతోపాటు వేర్వేరు కార్యక్రమాలను మీరు చూడాలనుకున్న ప్పుడు చూసేందుకు వీడియో ఆన్ డిమాండ్ వంటి మూడు విభాగాలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement