అపురూపాయల్
రంగులకు ప్రాణం పోస్తే... విహంగాలవుతాయి. హంగులకు ఫ్యాషన్ లుక్ ఇస్తే... లెహంగాలవుతాయి.ప్రింట్‌లను కట్ చేస్తే... ‘ఫుల్ లెంగ్త్’లు అవుతాయి. తారల్ని తీరుగా దిద్దితే... ట్రెడిషన్‌కి బొట్టూ కాటుక అవుతాయి. పాయల్ సింఘాల్ డిజైన్ చేస్తే అంతే మరి! డ్రెస్.. రాయల్‌గా ఉంటుంది. లాయల్‌గా ఉంటుంది.అపురూపంగానూ ఉంటుంది. ‘యువరాణీవారొస్తున్నారహో... తప్పుకోండి’ అంటుంది.
పదిహేనేళ్లకే ఫ్యాషన్ డిజైనింగ్‌లో అవార్డులు సొంతం చేసుకుంది. పదిహేనేళ్లకే ర్యాంప్ షోలో ఐశ్వర్యారాయ్‌తో పాటు ప్రముఖ తారలను తన డిజైనరీ దుస్తుల ద్వారా మెరిపించింది. పదిహేనేళ్ల్ల తన సృజనాత్మక ప్రపంచంలో ఎన్నో కొత్త వాణిజ్యసముదాయాలను నెలకొల్పి మహిళా వ్యాపారవేత్తగానూ నిరూపించుకున్న ఆమే పాయల్ సింఘాల్. ముంబయ్ ఫ్యాషన్ డిజైనర్ అయిన పాయల్ ఆన్‌లైన్ స్టోర్‌లోనూ తనదైన ముద్ర వేసింది. మూడు పదులు దాటిన పాయల్ ఈ రంగంలో ఎదగాలనుకునేవారికి కొన్ని సూచనలు చేస్తున్నారు. ‘మిగతా డిజైనర్ల డిజైన్స్ నుంచి కొత్తదనం నేర్చుకోవడం వరకు మంచిదే. కానీ, ఈ రంగంలో ఎదగాలంటే తమను తామూ మెరుగు పెట్టుకొని, ఎప్పటికప్పుడు దుస్తులలో కొత్తదనం చూపించాల్సిందే’ అంటున్నారు.