
అన్నాదురై ఆటో ఎక్కితే.. వైఫై ఫ్రీ!
ప్రయాణంలో చదవడానికి న్యూస్‌పేపర్లు, ఇంటర్నెట్ బ్రౌజ్ చేసుకోవడానికి వైఫై కనెక్షన్, సెల్‌ఫోన్‌చార్జింగ్ సదుపాయం, ఏ నెట్‌వర్క్ మొబైల్ కైనా రీచార్జ్ కార్డులు, వెబ్ సర్ఫింగ్ కోసం ఒక ట్యాట్లెట్... ఇన్ని సదుపాయాలున్నాయంటే అది ఏ విమానమో, ఏసీ టూ టైర్ రైలు బోగీనో అయ్యుంటుందనుకొంటున్నారా... అదేమీ కాదు అన్నాదురై ఆటోలో ఈ సదుపాయాలన్నీ ఉన్నాయి. విమానాలను, వోల్వో బస్సులను తలదన్నే ఏర్పాట్లతో ప్రయాణికులను ఆకట్టుకొంటున్నాడు ఈ ఆటోడ్రైవర్.
అధునాతన సదుపాయాలను ఉచితంగా అందిస్తున్న ఇతడి వివరాలు ఇవి.. చెన్నైలోని ఒక ఐటీ సెజ్ చుట్టుపక్కల ఆటో నడుపుతుంటాడు అన్నాదురై. ఇతడి ఆటో ఎక్కేవారిలో ఎక్కువమంది ఐటీ ప్రొఫెషనల్స్. వారిని దృష్టిలో ఉంచుకొని తన ఆటోలో ఈ సదుపాయాలను అందుబాటులో ఉంచాడు అన్నాదురై. ఇతడి ఆటో ఎక్కగానే స్మార్ట్‌ఫోన్ లేదా లాప్‌టాప్ చేతిలో ఉంటే వైఫై కనెక్ట్ చేసుకొని ఇంటర్నెట్ బ్రౌజ్ చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ లేనివారి కోసం ప్రత్యేకంగా ఒక టాబ్లెట్‌ను ఏర్పాటు చేశాడు అన్నాదురై. బ్రౌజింగ్ మీద ఆసక్తి లేకపోతే రీడింగ్ చేయొచ్చు.
ప్రముఖ ఆంగ్ల వార్తపత్రికలన్నీ అన్నాదురై ఆటోలో అందుబాటులో ఉంటాయి. మ్యాగ్జిన్‌లు, న్యూస్ పేపర్లు కలిసి 35 రకాల పత్రికలు ఉంటాయి అందులో! ఇంతేకాదు.. అర్జెంట్‌గా ఫోన్ రీచార్జ్ అవసరమైతే అన్నాదురైని సంప్రదిస్తే వివిధ ప్యాకేజ్‌ల రూపంలోని మొబైల్‌రీచార్జ్ సేవలు అందిస్తాడు. ఇంకా డీటీహెచ్ రీచార్జ్ సదుపాయం కూడా ఉంటుంది. ఈ సౌకర్యాల విషయంలో ఎటువంటి అదనపు చార్జీలు వేయడు అన్నాదురై. కేవలం తన, ప్రయాణికుల సంతృప్తి కోసమే ఈ సదుపాయాలన్నింటినీ సమకూరుస్తున్నట్లు అన్నాదురై చెబుతాడు. వీటి విషయంలో ఇతడు బాగానే ఖర్చు చేస్తున్నాడు. మ్యాగ్జైన్‌లకు, న్యూస్ పేపర్ల కోసమే మూడు వేల రూపాయలు ఖర్చవుతోందట. వైఫై కోసం వెయ్యి రూపాయలు!
ఆటోలో ఇన్ని సదుపాయాలుండటమంటే ఇది పెద్ద విశేషమే కదా.. దీంతో మీడియా అన్నాదురై వెంటపడుతోంది. ఈ ఐడియా మీకు ఎలా వచ్చిందని ప్రశ్నిస్తోంది. దీని గురించి అన్నాదురై మాట్లాడుతూ.. చాలా రోజుల కిందట తాను చెన్నై రైల్వే స్టేషన్ బయట ఆటోను పెట్టుకొనుంటే.. ఒక పల్లెటూరి వ్యక్తి వచ్చి మాట్లాడుకోవడానికి మొబైల్ అడిగాడని.. అతడు తన ఆటోలో ఎక్కాలనే కండీషన్ మీద ఫోన్ ఇచ్చానని.. ఆ తర్వాత అలాంటి సదుపాయాలు పెడితే ఆటో ఎక్కడం పట్ల ఎవరైనా ఉత్సాహం చూపిస్తారనే ఆలోచన వచ్చిందని చెప్పాడు.
ఐటీ కంపెనీల దగ్గర్లో ఉన్న ఆటోస్టాండ్‌కు మారి.. ఈ విధమైన ఏర్పాట్లతో టెక్కీలను ఆకట్టుకొంటున్నానని అన్నాదురై వివరించాడు. ఆటోను అన్ని సదుపాయాలున్న డీలక్స్ గా మార్చడానికే నెలకు నాలుగైదు వేలు ఖర్చు చేస్తున్నాడు కదా.. అతడికి ఇంకేం మిగులుతుంది? అంటే.. తన సంపాదన రోజుకు వెయ్యిరూపాయలని చెబుతూ.. మిగతా లెక్కలు మీరే వేసుకోండి అని అంటాడు ఈ ఆటోడ్రైవర్!