లండన్ : నైట్ షిఫ్ట్‌ల్లో పనిచేయడం ఆరోగ్యానికి పెను ముప్పని తాజా అథ్యయనం వెల్లడించింది. రాత్రి పనివేళల ఫలితంగా ఒబెసిటీ, స్ర్టోక్, గుండె జబ్బుల ముప్పు అధికమని తేల్చిచెప్పింది. శరీర కణజాలం నిద్రాణమైన సమయంలో పనిచేయడంతో మన శరీర జీవ క్రియల్లో రసాయన ప్రక్రియలు అస్తవ్యస్తమై జీవ గడియారాల్లో మార్పులకు దారితీస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. నైట్ షిఫ్ట్‌ల్లో పనిచేయడం ద్వారా మెదడులోని ప్రధాన గడియారం కాకుండా శరీరంలో ఉండే జీవ గడియారాలన్నీ ప్రభావితమవుతాయని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ సర్రే నిర్వహించిన అథ్యయనంలో తొలిసారిగా ఈ అంశాలు వెలుగుచూశాయి. రాత్రి వేళల్లో పనిచేయడానికి, తీవ్ర కిడ్నీ వ్యాధులకు ఉన్న సంబంధంపైనా ఈ అథ్యయనం దృష్టిసారించింది.
శరీరంలోని కాలేయం, ప్రాంకియాస్, జీర్ణవ్యవస్థల్లో ఉండే గడియారాలు సైతం షిఫ్ట్ వేళలకు అనుగుణంగా మారిన నిద్ర, ఆహారపు అలవాట్లకు స్పందిస్తాయని దీంతో శరీరంలోని ఇతర గడియారాలు, మెదడులో ఉండే మాస్టర్ క్లాక్‌కు మధ్య సమతూకం దెబ్బతింటోందని అథ్యయన రచయిత, సర్రే యూనివర్సిటీ న్యూరో ఎండోక్రినాలజీ ప్రొఫెసర్ డాక్టర్ దేవ్రా సేన్ వెల్లడించారు.
రాత్రి, పగటి వేళల్లో పనిచేసే ఉద్యోగులపై వీరు పరిశోధన చేపట్టారు. వీరి రక్త నమూనాలను పరీక్షించారు. కేవలం మూడు రోజులు నైట్ షిఫ్ట్‌ల్లో పనిచేసిన వారిలో జీవక్రియల్లో ఆటంకాలను గుర్తించామని , ఇవి ఇలాగే కొనసాగితే క్యాన్సర్, ఒబెసిటీ, కిడ్నీ సహా పలు వ్యాధులు చుట్టుముట్టే ముప్పు ఉందని డాక్టర్ స్కెన్ ఆందోళన వ్యక్తం చేశారు. అథ్యయన ఫలితాల నేపథ్యంలో రాత్రివేళల్లో పనిచేసేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. సాయంత్రం వేళ్లల్లో ఆహారం తీసుకోవద్దని, పగటి కంటే సాయంత్ర సమయాల్లో నిద్రించడం మేలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment